Monday, November 25, 2024

అరుదైన రికార్డులకు చేరువగా భారత్, ఇంగ్లండ్ కెప్టెన్లు

  • కొహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు
  • టెస్టుల శతకానికి రూట్ పరుగు

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ఇటు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, అటు ఇంగ్లండ్ సారథి జో రూట్ లకు పలువిధాలుగా చిరస్మరణీయం కానుంది. కరోనా కాలంలో రెండుజట్ల కెప్టెన్ల పాలిట పన్నీటి జల్లుగా మారనుంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా ఫిబ్రవరి 5న ప్రారంభంకానున్న ఈ సిరీస్ ద్వారా భారత సారథి విరాట్ కొహ్లీ రెండు అరుదైన రికార్డులు అందుకొనే అవకాశం ఉంది.

విరాట్ కోసం జంట రికార్డులు

టెస్టు క్రికెట్లో భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీ రికార్డును విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ ద్వారా సమం చేయటమో లేదా అధిగమించడమో చేసే అవకాశాలున్నాయి.  భారత్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్ ల్లో కెప్టెన్‌గా ధోనీ 21 మ్యాచ్ ల్లో విజయాలు అందించాడు. అయితే…గత ఏడాది ముగిసిన సిరీస్ ల వరకూ కోహ్లి పేరుతో 20 విజ‌యాలు ఉన్నాయి. ప్రస్తుత సిరీస్ లో భారత్ ఒక్క మ్యాచ్ లో నెగ్గితే ధోనీ రికార్డును కొహ్లీ సమం చేయగలుగుతాడు. అదే రెండుమ్యాచ్ లు నెగ్గితే ధోనీ పేరుతో ఉన్న అత్యధిక స్వదేశీ విజయాల రికార్డును తెరమరుగు చేస్ అవకాశం ఉంది.

ఇదీ చదవండి:చెన్నై టెస్టులో రోహిత్ జోడీ ఎవరో?

కెప్టెన్ గా అత్యధిక పరుగుల రికార్డు :

 టెస్టుల్లో కెప్టెన్‌గా అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలవటానికి కోహ్లి కేవలం 14 ప‌రుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ కోహ్లి టెస్టుల్లో కెప్టెన్‌గా 5220 ప‌రుగులు సాధించాడు. మ‌రో 14 ప‌రుగులు చేస్తే.. కరీబియన్ దిగ్గ‌జం క్లైవ్ లాయిడ్ రికార్డును కోహ్లి అధిగ‌మించ గలుగుతాడు. కెప్టెన్లుగా అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, కంగారూ మాజీ సారథులు అలన్ బోర్డర్, రికీ పాంటింగ్ ఉన్నారు. గ్రీమ్ స్మిత్ మొత్తం 8 వేల 659 పరుగులు,  అల‌న్ బోర్డ‌ర్ 6 వేల 623 పరుగులు, రికీ పాంటింగ్ 6 వేల 542 పరుగులతో మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నారు.

కెప్టెన్ గా సెంచరీలలోనూ రికార్డు :

క్రికెట్లో కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడి రికార్డు సైతం విరాట్ కొహ్లీని ఊరిస్తోంది. ప్రస్తుత సిరీస్ లో కొహ్లీ ఒక్క శతకం బాదినా…కంగారూ దిగ్గజం రికీ పాంటింగ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించగలుగుతాడు. టెస్టులు, వన్డేలలో కలిపి పాంటింగ్,కొహ్లీ చెరో 41 సెంచరీలు చొప్పున సాధించారు. పాంటింగ్ మొత్తం 376 ఇన్నింగ్స్ లో 41 శతకాలు బాదితే….విరాట్ కొహ్లీ మాత్రం కేవలం 191 ఇన్నింగ్స్ లోనే పాంటింగ్ రికార్డును చేరుకోగలిగాడు. కొహ్లీ సాధించిన మొత్తం 41 శతకాలలో 20 టెస్టు క్రికెట్లోను, 21 వన్డే క్రికెట్లోనూ ఉన్నాయి. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా కొహ్లీ సాధించిన మొత్తం ఐదు శతకాలలో నాలుగు కెప్టెన్ గా నమోదు చేశాడు.

టెస్టుల సెంచరీకి రూట్ తహతహ :

ఇంగ్లండ్ కెప్టెన్ కు, భారత్ కు అవినాభావ సంబంధమే ఉంది. రూట్ అసాధారణ రికార్డులన్నీ భారత్ తోనే ముడిపడి ఉన్నాయి. భారత్ ప్రత్యర్థిగా 2012 సిరీస్ లో …నాగపూర్ వేదికగా తన టెస్టు అరంగేట్రం చేసిన రూట్ …తన 50వ టెస్టును విశాఖ వేదికగా..భారత్ ప్రత్యర్థిగానే ఆడటం విశేషం. అంతేకాదు…వందో టెస్టు మ్యాచ్ ను సైతం భారత్ ప్రత్యర్థిగానే ఆడటానికి సిద్ధమయ్యాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 5న ప్రారంభంకానున్న తొలిటెస్టుమ్యాచ్ రూట్ కెరియర్ లో 100వ టెస్టుగా రికార్డుల్లో చేరనుంది.

15వ ఇంగ్లీష్ క్రికెటర్ రూట్ :

ఇంగ్లండ్ 144 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ వంద టెస్టులు ఆడిన 15వ క్రికెటర్ గా రూట్ నిలువనున్నాడు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో 228, 186 పరుగుల స్కోర్లు సాధించిన రూట్ …మొత్తం 99 టెస్టుల్లో 8 వేల 249 పరుగుల నమోదు చేశాడు. ఇందులో 19 శతకాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్న జో రూట్ కు భారత్ ప్రత్యర్థిగా 16 టెస్టులు ఆడిన రికార్డు ఉంది. నాలుగు సెంచరీలు,9 అర్థశతకాలతో సహా 1421 పరుగులు, 56.84 సగటుతో ఉన్నాడు. ప్రస్తుత సిరీస్ లో ఇంగ్లండ్ కెప్టెన్ గా మాత్రమే కాదు…టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గానూ 30 ఏళ్ల జో రూట్ నిర్ణయాత్మకపాత్ర పోషించనున్నాడు.

ఇదీ చదవండి: సఫారీ-కంగారూ సిరీస్ కు కరోనా దెబ్బ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles