- సౌతాఫ్రికా పర్యటన రద్దు చేసుకొన్న ఆస్ట్రేలియా
భారత్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలు వేదికలుగా ఓవైపు టెస్టు సిరీస్ లు, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లూ జరుగుతూ ఉంటే…సౌతాఫ్రికా వేదికగా జరగాల్సిన కంగారూజట్టు పర్యటన మాత్రం రద్దుల పద్దులో చేరిపోయింది.
Also Read : చెన్నై టెస్టులో రోహిత్ జోడీ ఎవరో?
సౌతాఫ్రికా వ్యాప్తంగా కరోనా తారాస్థాయికి చేరడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ముందుజాగ్రత్త చర్యగా తమజట్టు సఫారీ టూర్ ను రద్దు చేసుకొంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో హాక్లే …క్రికెట్ సౌతాఫ్రికాకు ఓ లేఖను పంపారు.
అంతర్జాతీయ క్రికెట్ వేదికలుగా ఉన్న మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే సౌతాఫ్రికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందని, అత్యంత ప్రమాదకరస్థితికి చేరిందని తమకు క్రికెట్ కంటే తమ ఆటగాళ్లు, దేశప్రజల భద్రత ముఖ్యమని తన లేఖ ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
Also Read : టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్
ముందుగా ప్రకటించిన కార్యక్రమం ప్రకారం ఫిబ్రవరి, మార్చి మాసాలలో జరిగే మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడాల్సి ఉంది. అయితే…ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా తమజట్టు పర్యటనను వాయిదా వేసుకోక తప్పడం లేదని వివరించింది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, ఇకముందు కూడా అలాగే ఉంటామని క్రికెట్ ఆస్ట్రేలియా హామీ ఇచ్చింది. సౌతాఫ్రికా ప్రజలు కరోనా మహమ్మారి కోరల నుంచి క్షేమంగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.
Also Read : చెన్నై టెస్టుకు కౌంట్ డౌన్