- చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
- రైతు ఆందోళనలపై చర్చకు చైర్మన్ నిరాకరణ
- వాకౌట్ చేసిన విపక్షాలు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై రాజ్యసభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఈ రోజు (ఫిబ్రవరి 2) సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించిన తరువాత ప్రశ్నోత్తరాల కార్యక్రమాని మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు రైతులకు మద్దతుగా సభలో నినాదాలు చేశారు. రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలకు మద్దతుగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీనికి నిరాకరించిన వెంకయ్యనాయుడు చర్చను బుధవారం చేపడదామన్నారు. అయినా చర్చ నిర్వహించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే చర్చకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ససేమిరా అనడంతో విపక్షాలు నిరసన తెలియజేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఇదీ చదవండి: సంపద సృష్టించే బడ్జెట్..కాదు భారం పెంచేదే.
అంతకు ముందు రాజ్యసభ ప్రారంభం కాగానే కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనతో సభను 10.30 గంటల వరకూ చైర్మన్ వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమై మళ్లీ వాయిదాపడింది. సాగు చట్టాలపై చర్చకు విపక్ష నేతలు పట్టుబట్టడంతో సభను 11.30 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్ సభలో తొలుత చర్చ ప్రారంభం కావాల్సిఉన్నందున సాగు చట్టాలపై చర్చను రేపు చేపడదామని వెంకయ్యనాయుడు సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా విపక్షాలు పట్టిన పట్టు వీడలేదు. ఛైర్మన్ చేసేదేంలేక 12.30 గంటలకు సభను వాయిదా వేశారు. అనంతర రాజ్య సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు పట్టు వీడలేదు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ దద్దరిల్లింది. సాగు చట్టాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టడంతో సభను ఛైర్మన్ వెంకయ్య నాయుడు రేపటికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి: బడ్జెట్ పద్మనాభాలు పారిశ్రామిక వేత్తలు