ప్రకాశం బాటలో నడిచిన స్వాతంత్ర్య సమర యోధుడు
గాంధీజీ తత్త్వానికి అమితంగా ప్రభావితులైన వారిలో బులుసు సాంబమూర్తి ఒకరు. దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర లక్ష్యాల సాధనకు అవిశ్రాంతగా ఉద్యమించిన నేత. ఆశయ సాధనలో లాఠీ దెబ్బలకు, జైళ్లకు వెరవలేదు. పదవుల కంటే ప్రజా సంక్షేమమే ప్రధానమని నమ్మి ఉన్న పదవిని వదులుకుని, రాని వాటికి ఆరాటపడని స్థితప్రజ్జుడు.
దర్జాలకూ, దర్పాలకూ వీడ్కోలు :
గాంధీజీ ప్రియశిష్యులలో ఒకరిగా, చివరికి గాంధీజీ ఆహార్యాన్ని కూడా అనుసరించారు. న్యాయవాదిగా రెండు చేతులా ఆర్జిస్తూ సూటుబూటుతో మోటారు వాహనంపై గోదావరి జిల్లాలు తిరిగిన ఆయన గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపుతో ఆ దర్జాలు, దర్పాలకు వీడ్కోలు పలికారు.మోకాళ్లు దాటని ముతక కొల్లాయిని ధరించారు. గాంధేయవాద సిద్ధాంతాల వ్యాప్తికి, నిజమైన గాంధేయవాదులను రూపొందించడానికి సబర్మతీ ఆశ్రమం తరహాలో 1924లో గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం ఏర్పాటు చేశారు. అందుకే ఆయనను `తెలుగు గాంధీ`గా పిలవవచ్చు. ఆహార్యంలో గాంధీజీ, పౌరుషంలో టంగుటూరి. గాంధీజీ నాయకత్వంలో అనేక ఆందోళనలో పాల్గొని జైలుకు వెళ్లారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా, సహాయ నిరాకరణవాదిగా `ముతక కొల్లాయి`తో దేశం చుట్టివచ్చిన ఆయన అదే ఆహార్యంతో మద్రాస్ శాసనసభ సభాపతి పీఠాన్ని అలంకరించారు.
త్యాగశీలి :
గాంధీజీ కాకినాడ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి మహిళలు స్వరాజ్యసమరానికి విరాళాలు అందచేశారు. బులుసు వారి సహధర్మచారిణి రెండు చేతులకు రెండు బంగారు గాజులు తప్ప ఏమీ లేకపోవడంతో సిగ్గుతో మిన్నకుండిపోయారు. `పిచ్చిదానా…చేతులకున్న గాజులు ఇవ్వకుండా అలా నిలుచుంటావెందుకు?` అని మరీ విరాళంగా ఇప్పించారు. లక్ష్యంవైపు సాగే ప్రయత్నంలో కడుపుకోతను కూడా లక్ష్యపెట్టలేదు.
కుమారుడి హఠాన్మరణం :
ఆంధ్ర ప్రాంతంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ ప్రప్రథమంగా (1923)లో జరగడానికి కారకులు బులుసు సాంబమూర్తిగారే. దాని ఏర్పాట్లను ఆయనే చూసుకోవలసి వచ్చింది. అలా ఊపిరి సలపని పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడే చేతికి అందిన కుమారుడు హఠాన్మరణం చెందాడు. ఆ విషాదం ఆయనను కర్తవ్య విముఖుడిని చేయలేదు. ఆయన అంకిత భావానికి ఆశ్చర్యపడిన సరోజినీ నాయుడు ఆయన త్యాగశక్తిని, నిబ్బరాన్ని బహిరంగ వేదికపై ప్రస్తుతించారు.
అధ్యాపకుడిగా :
బులుసు వారి కుటుంబమంతా దానధర్మాలు చేస్తూ ధార్మిక జీవనం సాగించింది. తూర్పుగోదావరి జిల్లా దుళ్ళ గ్రామంలో వేద పండిత వంశంలో 1886 మార్చి 4న శివరాత్రి నాడు కళ్లు తెరచిన చిన్నారిని పరమశివుని ప్రసాదంగా భావించి సాంబమూర్తి అని నామకరణం చేశారు. స్థానికంగా చదువు పూర్తయిన తరువాత ఆయన మద్రాసు విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రులై కొంత కాలం విజయనగరం మహారాజా కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. స్వతంత్ర భావాలు గల ఆయనకు ఆ ఉద్యోగం నచ్చలేదు.న్యాయవాద వృత్తిపట్ల మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై 1911లో కాకినాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. జిల్లాలో మూడు న్యాయస్థానలలో గట్టి న్యాయవాదిగా ప్రఖ్యాతులతో పాటు బాగానే ఆర్జించారు. ఖరీదైన వస్తధ్రారణతో మోటారు వాహనంపై తిరిగేవారు.
ఉద్యమ నేతగా :
స్వాత్రంత్ర్య ఉద్యమంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలలో సాంబమూర్తిగారు ముందుండే వారు. నాగపూర్ జాతీయ పతాక సమరం, మద్రాసులో నీల్ విగ్రహ సత్యాగ్రహం…ఇలా దేనికైనా నడుంకట్టేవారు. 1919 సం.లో హోమ్‌రూల్ ఉద్యమంలో ప్రవేశించారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్ర తీరానికి వెళ్లి ఉప్పు తయారుచేశారు. ఉప్పుమీద పన్ను ఎత్తివేసేవరకు ఉప్పు లేకుండానే ఆహారం స్వీకరిస్తానని శపథం చేసి ఆచరించి చూపారు. 1927లో నాగపూర్ పతాక సత్యాగ్రహ దళానికి నేతృత్వం వహించిన ఆయన 1928లో హిందూస్తానీ సేవాదళం అధ్యక్షునిగా, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు.
సైమన్ కమిషన్ బహిష్కరణ :
గురువు ప్రకాశం పంతులుతో సైమన్ కమీషన్ బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. 1921లో ప్రకాశంగారి అధ్యక్షతన కాకినాడలో జరిగిన గోదావరి మండల కాంగ్రెస్ సభలో సర్వ సంపూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సాంబమూర్తి, 1929లో లాహోర్ గౌహతి అఖిల భారత సభలో కార్యవర్గ సభ్యుడి హోదాలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. అయితే చాలా మంది నాయకులు ఇది సాధ్యం కాదని నిరసించారు. 1935-37 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు.
చట్టసభ ప్రతినిధిగా :
మద్రాసు ప్రొవిన్షియల్ అసెంబ్లీకి 1935లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకు శాసనసభకు సభాపతిగా ఉన్నారు. సభాపతిగా సంప్రదాయానుగునంగా, అద్వితీయంగా బాధ్యతలు నిర్వర్తించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం ప్రదర్శించే వారు. జమీందారీ రద్దు బిల్లు తీసుకురావడాన్ని అందుకు ఉదాహరణగా చెబుతారు.
జమీందారీ రద్దు బిల్లు :
రైతులకు న్యాయం జరగాలంటే ఎవరి ఒత్తిళ్లకు లొంగకూడదన్న సంకల్పంతో జమీందారీ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. అధినాయకులందరూ దీనిని వ్యతిరేకించారు. అయినా బెదరలేదు, లొంగలేదు. అవసరమైతే పదవీ త్యాగానికీ వెనుకాడలేదు. ఈ పదవులకంటే స్వరాజ్య ఉద్యమమే ప్రధానమని సభాపతి పదదికి రాజీనామా చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లాలలో సత్యాగ్రహ శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలలో పోరాట పటిమను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన :
స్వరాజ్యం సిద్ధించిన తరువాత తన జీవిత రెండవ లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర సాధనమీద దృష్టి పెట్టారు బులుసు. ఉమ్మడి మద్రాపు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతం విడిపోవడం పట్ల రాజాజీ సుముఖత చూపలేదు, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకీ ఇష్టంలేదు. అయినప్పటికీ పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోగా, సాంబమూర్తిగారు మద్దతునిచ్చారు. దీక్షకు తగిన వేదిక దొరకకపోవడంతో మద్రాసు మైలాపూరులోని తమ ఇంట్లో అవకాశం కల్పించారు.
పొట్టి శ్రీరాములు దీక్ష :
శ్రీరాములుగారి దీక్ష నిర్విఘ్నంగా సాగడానికి తోడ్పడుతూ,ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచారు. చివరికి శ్రీరాములు `అమరజీవి`కాక తప్పలేదు. ఆ ఇంటిని అమరజీవి స్మారక భవనంగా వదిలి కాకినాడ వెళ్లిపోయారు.
ఇదీ చదవండి : మరచిపోతున్న ‘మహాత్ముని’ మరణం… కొన్ని వాస్తవాలు
గురువు పరిస్థితే
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి సహాయకుడిగా వ్యవహరించారు. అనేక కేసుల్లో న్యాయవాదిగా ఆయన సరసన నిలబడి వాదించారు. క్రిమినల్ న్యాయవాదిగా మంచి పేరు పొందారు. ఆయనకున్న పరిజ్ఞానానికి న్యాయవాద వృత్తిలో ఆర్థికంగా మరింత ఉన్నత స్థానానికి ఎదిగే వారే కానీ ఆ వృత్తిని కాదని దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగారు. ఖద్దరు పంచె, పైన ఉత్తరీయం ధరించి, కడవరకు అదే ఆహార్యమనుకున్నారు. సంపాదనలోనూ, చివరిదశలోనూ గురువు ప్రకాశం గారి అనుభవాలే ఈయనకూ ఎదురయ్యాయి. ఆయన మాదిరిగానే రెండు చేతులా సంపాదించి, స్వరాజ్యం సమరంలో పాల్గొని చివరి రోజులు దుర్భర దారిద్య్రంతో గడిపారు.
ఇదీ చదవండి: సమరశీలి బూర్గుల నరసింగరావు
చివరికి ఒంటరి, విరాగి :
రాష్ట్రం కోసం సొంత ఇంటిని వదిలి భార్య మరణంతో మానసిక వేదనతో ఒంటరివారయ్యారు. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మద్రాసు నుంచి కాకినాడ చేరగా, ఆయన సహాయం పొందినవారే ముఖం చాటేశారు. అయితే ఆయన పరిస్థితి తెలుసుకున్న నాటి కేంద్ర హోంశాఖా మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మాత్రమే ఆర్థిక సహాయం చేశారు. సాంబమూర్తి గారు చివరి రోజులలో విరాగిగా మారిపోయారు.
మహర్షిగా మన్నన :
శివాలయాలచుట్టూ తిరుగుతూ, ‘శివరాత్రిరోజున పుట్టాను కనుక సాంబు అని పేరు పెట్టారు. శివదీక్షాపరుడను. ఆదిభిక్షువు భక్తుడిని. నుదుట విభూతి అలంకారమే నా ఆస్తి. నేనిలా మారడంలో తప్పేముంది’ అని అడిగినవారికి జవాబు చెప్పేవారట. దేశం కోసం సరస్వం త్యాగం చేసి `మహర్షి`గా మన్ననలు అందుకొని, శేషజీవితాన్ని దుర్భరంగా గడిపిన పరమేశ్వర వరప్రసాది 1958 ఫిబ్రవరి 3న 72వ ఏట `శివైక్యం` చెందారు. భారత ప్రభుత్వం ఆయనపై ప్రత్యేక తపాలా బిళ్ల ముద్రించింది.
(ఈ నెల 2న బులుసు సాంబమూర్తి వర్థంతి)