- పరువు నిలుపుకునేందుకు అధికార పార్టీ ఎత్తుగడలు
- పల్లెల్లో పట్టు కోసం టీడీపీ కసరత్తు
- మనుగడ కోసం బీజేపీ, జనసేన పోరాటం
పంచాయతీ ఎన్నికల్లో అలకలు, బుజ్జగింపులు, బెదిరింపుల పర్వాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏకగ్రీవాల పేరుతో అసలు పోటీ లేకుండా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది మరోవైపు బలమైన అభ్యర్థులను బరిలోకి దించి వైసీపీ దూకుడుకి చెక్ పెట్టాలని టీడీపీ పైఎత్తులు వేస్తోంది. చట్ట సభల్లో ప్రాతినిథ్యం లేని జనసేన, బీజేపీతో కలిసి ఉనికి కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండటమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది. టీడీపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యోచిస్తోంది. కొన్ని చోట్ల నామమాత్రంగా అభ్యర్థులను నిలిపి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు.
ఇదీ చదవండి: షాడో టీమ్స్ నిఘాలో ఏకగ్రీవాలు
క్షేత్రస్థాయిలో పట్టుకోసం జనసేన మంత్రాంగం:
సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు జనసేన, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. కార్యకర్తల బలమున్న చోట్ల జనసేన అభ్యర్థులను నిలబెడుతోంది. గ్రామాల్లో పట్టుకోసం జనసేన నేతలు కాపునేతలతో భేటీ అవుతున్నారు మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పంచాయతీలలో సాధ్యమైనన్ని సర్పంచ్, వార్డులకు మహిళా అభ్యర్ధులను రంగంలోకి దింపేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై “పంచాయితీ”
మరోవైపు నామినేషన్లు వేసిన అభ్యర్థులకు రక్షణ కల్పించే దిశగా టీడీపీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా బరిలో ఉన్న అభ్యర్థులకు రక్షణ కల్పించే బాధ్యతను మండల, నియోజకవర్గ స్థాయి నేతలకు అప్పగించారు. నామినేషన్ వేసిన అభ్యర్థులతో తరచూ టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులను లొంగదీసుకునేందుకు అధికార పార్టీ పన్నే కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు.