- 4 ఓ.సి. గనుల్లో మొబైల్ క్రషర్ల ఏర్పాటుకు అనుమతి
- ఎస్.సి., ఎస్.టి. లకు చిన్నతరహా కాంట్రాక్టుల కేటాయింపుకు అంగీకారం
రిటైరెన కార్మికులకు చెల్లించే పెన్షన్ నిధికి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే ప్రతి టన్ను బొగ్గుకు 10 రూపాయల చొప్పున కోల్ మైన్స్ పెన్షన్ స్కీం (సి.ఎం.పి.ఎస్.) నిధికి చెల్లించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదించామని సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. గురువారం (జనవరి 28వ తేదీ) నాడు హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఎండీ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు.
ఇది చదవండి: సింగరేణిలో ఉద్యోగాల జాతర
బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సి.ఎం.పి.ఎఫ్.) సంస్ధ ఏకమొత్తంగా పి.ఎఫ్. సొమ్మును చెల్లిస్తారనీ, దీనితో పాటు నెల నెలా అతను పనిచేసిన కాలానికి సంబంధించి లెక్కలు వేసి పెన్షన్ (కోల్ మైన్స్ పెన్షన్ స్కీం ప్రకారం) కూడా చెల్లిస్తుంటారని, అయితే రిటైరయిన కార్మికుల సంఖ్య బాగా పెరుగుతుండడంతో పెన్షన్ కు నిధుల కొరత ఏర్పడిందనీ, దీనిని భర్తీ చేయడానికి కోల్ ఇండియాతో పాటు సింగరేణి కూడా టన్నుకు 10 రూపాయల చొప్పున సి.ఎం.పి.ఎస్. నిధికి చెల్లించడానికి తాము అంగీకారం తెలిపామని వివరించారు. 2020 డిసెంబర్ 19వ తేదీ నుండి దీనిని అమలు చేయనున్నామని వివరించారు. దీని వలన రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ చెల్లింపు సాఫీగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
ఇది చదవండి: సింగరేణిలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
దీనితో పాటు బోర్డులో అనుమతించి ఆమోదించిన పలు వివరాలను ఆయన తెలిపారు. వివిధ ఓ.సి. గనులకు అవసరమై ఉన్న 12 మోటార్ గ్రెడర్లను 33.74 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడానికి, భూగర్భ గనుల్లో అవసరమై ఉన్న 21 ఎస్.డి.ఎల్. యంత్రాలను 7 కోట్ల 13 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సింగరేణిలోని నాలుగు ఓ.సి. గనుల్లో మొబైల్ క్రషర్లను నిర్వహించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్.జి. ఓపెన్ కాస్ట్-3, రామక్రిష్ణాపూర్ ఓపెన్ కాస్ట్, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్, కె.టి.కె. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఓవర్ బర్డెను తొలగింపుకు కాంట్రాక్టులు అప్పగించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. 59 ప్రకారం పలురకాల చిన్న తరహా పనులను ఎస్.సి., ఎస్.టి. వర్గాలకు చెందిన వారికి కేటాయిస్తున్న పద్ధతిని సింగరేణిలో కూడా అమలు జరపడానికి బోర్డు ప్రాథమికంగా అంగీకరించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించిన 2,550 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ కు బోర్డు అంగీకరించడంతో పాటు, 2020-21కి సవరించబడిన 1,750 కోట్ల వార్షిక బడ్జెటుకు కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది.
ఈ సమావేశానికి సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ అధ్యక్షత వహించగా కేంద్ర ప్రభుత్వం తరపున బోర్డు సభ్యులుగా ఉన్న కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్ పి.ఎస్.ఎల్.స్వామి, డిప్యూటీ సెక్రటరీ అజితేష్ కుమార్ లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొనగా ఎస్.చంద్రశేఖర్ డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా), ఎన్.బలరామ్ డైరెక్టర్ (ఫైనాన్స్ & పి&పి), డి.సత్యనారాయణ రావు డైరెక్టర్ (ఇ&ఎం)లు హైద్రాబాద్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ కె.రవిశంకర్, కంపెనీ కార్యదర్శి శ్రీమతి సునిత లు కూడా పాల్గొన్నారు.
ఇది చదవండి: సింగరేణిలో ఉద్యోగస్థులకు క్వార్టర్ల నిర్మాణం