తెలుగు నేలపై వెలసిన సారస్వత, కళామూర్తులను పద్మపురస్కారాలు వరించాయి , మనల్ని మురిపించాయి. ప్రతి సంవత్సరం పద్మపురస్కారాల ఎంపిక ఆనవాయితే అయినప్పటికీ, ఈ ఏట ప్రకటించిన పురస్కారాలు గతంలో కంటే కొంత ప్రత్యేకంగా, విశిష్టంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదుగురికి పద్మపురస్కార గౌరవం వరించింది. వీరందరూ కళా, సారస్వతమూర్తులు కావడమే విశేషం.అందరి ఆరాధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ ప్రకటించడం సముచితం, సమున్నతం.
పద్మపురస్కారం పొందిన తొలి అవధాని
భారతీయ భాషలలో, కేవలం తెలుగులోనే వికసించి, విజృంభించిన విద్య “అవధానం”. ఈ రంగాన్ని ఆలంబనగా చేసుకొని, పద్యంతో ప్రయాణం చేసిన ఆశావాది ప్రకాశరావుకు పద్మశ్రీ రావడం పరమానందకరం. ఈ పురస్కారం పొందిన తొలి అవధాని ఆశావాది. సాహిత్యం -విద్య అనే విభాగంలో ఈ పురస్కారం ప్రకటించినప్పటికీ, “అవధాన కళ”కు వచ్చినట్లుగానే భావించాలి. “పద్మ” పురస్కారాలను 1954లో స్థాపించారు. ఈ విద్యకు మూలస్థంభాలై నిలిచిన తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు అప్పటికే స్వర్గస్తులయ్యారు.ఈ కవిద్వయాలు వేసిన బంగారుబాటలో అవధానం ఖండాంతరాలు దాటి ప్రభవించింది.
ఇది తెలుగువారి భాగ్యం
దాదాపు ఏడు దశాబ్దాల నుండి ఎందరో అవధాన కవులు ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నారు. రసరమ్యంగా ఈ కళను ప్రదర్శిస్తూ తెలుగుభాషాసాహిత్యాలకు విశేషమైన గుర్తింపును తెచ్చి పెట్టారు. హిందీ, తమిళ, కన్నడీయులు ఈ విద్యను ఒడిసిపట్టుకోడానికి ప్రయత్నించినా, అది ఎవ్వరికీ చిక్కలేదు. ఆ భాగ్యం తెలుగువారికే దక్కింది. ఈ కళ అనన్య సామాన్యమైంది. పద్యకవితా ధార, అసాధారణమైన జ్ఞాపకశక్తి ఉంటే తప్ప, ఇక్కడ రాణించలేరు. అలా రాణించినవారు మన తెలుగువారు. ఈ విజయానికి ప్రధానమైన కారణం మన పద్య ఛందో నిర్మాణం. ఇంతటి నిర్మాణం,శిల్పం ఏ ఇతర భాషల్లోనూ లేవు.
Also Read : క్రీడాకారులకు పద్మ అవార్డులు
ఏటా ఒక అవధానికి పురస్కారం
అంతటి అవధానరంగాన్ని ఇంతకాలం వరకూ గుర్తించకపోవడం చాలా బాధాకరం. 2020 వరకూ ఒక్క అవధాన కవికి కూడా పద్మపురస్కారం సమర్పించలేదు. మొట్టమొదటగా ఇప్పుడే వచ్చింది. ఇప్పటికైనా గుర్తించినందుకు పాలక పెద్దలను అభినందిద్దాం. ఇక నుంచి ప్రతి ఏటా, తప్పకుండా, ఒక అవధానకవికి పద్మపురస్కారం వచ్చేట్టు చూడడం మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దల బాధ్యత. విస్మరించకుండా, అవధాన సరస్వతి గౌరవాన్ని కాపాడుతారని విశ్వసిద్దాం.
పద్మవిభూషణ్
పద్మ పురస్కారాల్లో అత్యున్నతమైన “పద్మ విభూషణ్” బాలుకు రావడం అత్యంత ఆనందకరం. ఇది తమిళనాడు కోటాలో వచ్చినప్పటికీ మనందరికీ ఎంతో నచ్చే అంశం. ఐతే, బాలు జీవించివున్నప్పుడే… ఇచ్చివుంటే ఇంకా ఎంతో బాగుండేది. దీన్ని ఒక వెలితిగానే భావించాలి. కరోనాతో పోరాడుతూ అర్ధాంతరంగా బాలు వెళ్లిపోయారే… అనేది,ఎప్పుడు తలుచుకున్నా గుండెలు పిండే సంఘటన.
పీవీకీ, బాలూకీ భారతరత్న
ఈ ఏడు “భారతరత్న” ఇంకా ప్రకటించలేదు. బాలుకు భారతరత్న వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. శత జయంతి సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ జూన్ కు పీవీ జన్మించి వందేళ్లు నిండుతాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యక్తిగతంగానూ పీవీ పట్ల ఎంతో గౌరవం, ఇష్టం ఉన్నాయి. పీవీకి భారతరత్న సమర్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బిజెపి ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అందించింది. అది కూడా మరణానంతరం (పోస్తుహ్యూమస్ ) కాక, జీవించి వున్నప్పుడే ప్రదానం చేయడం ఎంతో విశేషం.పీవీకి కూడా ప్రకటించి విజ్ఞతను చాటుకుంటారాని ఆశిద్దాం.
Also Read : గానగంధర్వుడు ఎస్ పీబీకి పద్మవిభూషణ పురస్కారం
ఎన్టీఆర్ సంగతి ఏమిటి?
మరో తెలుగు తేజం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే నినాదం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అది ఇంతవరకూ నోచుకోలేదు. ఇప్పటి వరకూ దేశాన్ని పాలించిన ఢిల్లీ పెద్దలకు ఎన్టీఆర్ పట్ల గౌరవం ఉన్నప్పటికీ,తెలుగుదేశం పార్టీలోని అంతర్గత రాజకీయాల వల్ల అది దూరమైంది. ఎన్టీఆర్ కు భార్య హోదాలో లక్ష్మీపార్వతి ఈ పురస్కారాన్ని అందుకోవాల్సి ఉంటుంది. అది ఏ మాత్రం ఇష్టం లేక చంద్రబాబు దీనికి అడ్డుపడుతున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో బలంగానే వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రాగానే….భారతరత్న ప్రకటించిన సందర్భాల్లోనూ ఈ నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత, అందరూ మరచిపోతూ వుంటారు. ఎన్టీఆర్ విషయంలో పాతికేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. దీనికి మోక్షం ఎప్పుడో?
తాంబూలం తమిళనాడుదే
బాలుకు గతంలో వచ్చిన పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలకు కూడా భూమిక తమిళనాడే కావడం విశేషం.పీవీ నరసింహారావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎన్టీఆర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి మహనీయులు భారతరత్న జాబితాలో ఉన్నారు. వీరందరూ గతించినా, మన హృదయ పద్మాల్లో చిరంజీవిగా ఉన్నారు. వీరందరూ నూటికి నూరు శాతం భారతరత్నకు అర్హులు. ఇవన్నీ ఎప్పటికి సాకారమవుతాయో కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : కల్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర
బాలమురళి, రామస్వామి సహాధ్యాయులు
ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కార గ్రహీతలైన అన్నవరపు రామస్వామి, నిడుమోలు సుమతి, కనకరాజు కూడా కళాకారులే.రామస్వామి, సుమతి వాద్య సంగీతకళాకారులు.వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ కోటాలో ఎంపికయ్యారు.నృత్య కళాకారుడు కనకరాజు తెలంగాణ నుంచి పొందారు. ఈ ముగ్గురు కూడా విశేష ప్రతిభామూర్తులే. అన్నవరపువారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుకు శిష్యులు.పారుపల్లివారు త్యాగరాజ గురుపరంపరకు చెందినవారు.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రామస్వామి సహధ్యాయులు. వాయులీన (వైలెన్ ) సంగీత ప్రపంచంలో రామస్వామి సుప్రసిద్ధులు. తొమ్మిది పదులు దాటిన వయస్సులోనూ సుస్వర నాదాన్ని వినిపిస్తూ, ఎందరికో విద్యను బోధిస్తూ, అటు కళాకారునిగా -ఇటు గురువుగా సంగీత సరస్వతికి అంకితమైన జ్ఞానవృద్ధుడిని పద్మశ్రీతో గౌరవించడం ఔచిత్య శోభితం.
తొలి మృదంగ విద్వాంసురాలు సుమతి
తెలుగునాట,మృదంగ వాయిద్య విద్యను ఎంచుకున్న తొలి కళాకారిణి నిడుమోలు సుమతి. సహజంగా మగవాళ్లే మృదంగ కళను ఎంచుకుంటారు. వీరందరికీ భిన్నంగా, మృదంగ విద్వాంసులైన తండ్రి రాఘవయ్య ప్రేరణతో, మృదంగాన్ని చేపట్టి, విజయదుందుభి మ్రోగించిన విశిష్ట కళాకారిణి సుమతి. ఈమె ప్రేరణతో కొందరు స్త్రీలు మృదంగాన్ని ఎంచుకుని ఈ విద్యలో రాణిస్తున్నారు. తబల ఉత్తరాదివారిది. మృదంగం మన దాక్షిణాత్యులది. ఆ విధంగా, తెలుగువారికి, యావత్తు దక్షిణాదివారికి కూడా ఘన గౌరవాన్ని తెచ్చిపెట్టిన నిడుమోలు సుమతి శతధా అభినందనీయరాలు. పక్క వాయిద్యాన్ని తక్కువ చూపు చూసే వారికి, ఈ పురస్కారం కళ్ళు తెరిపిస్తుంది.
గుస్సాడీ కళాకారుడు కనకరాజు
గుస్సాడీ కళాకారునిగా రాణకెక్కిన కనకరాజుకు పద్మశ్రీ అందించడం హృదయానందకరం. గుస్సాడీ అనేది ప్రత్యేకమైన నృత్య కళ. రంగు రంగుల వస్త్రాలతో, తలపాగాతో అలంకరించుకుని, ఆడుతూ, పాడుతూ, డప్పులు వాయిస్తూ,శ్రమను మరచి, గుంపులుగా చిందేస్తూ నయనానందకరంగా సాగే గొప్ప గిరిజన కళ “గుస్సాడీ”.ఇది ఆదిలాబాద్ జిల్లాలో గోండు తెగల ప్రత్యేక నృత్యం. ఈ కళకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతుడు కనకరాజు. ఆదివాసీల సంప్రదాయ కళను శోభిల్లజేసిన కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించడం గొప్ప మలుపు.
అభినందన చందన మాలలు
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ జానపద కళలు వున్నాయి.వాటన్నింటినీ బతికించుకోవాలి.వాటన్నంటికీ గుర్తింపు రావాలి. ఇప్పటికే చాలా సంప్రదాయ కళలు, చేతివృత్తులు నశించిపోయాయి. కొన్నిమాత్రమే ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి.ఆ వెలుగులు ఆరకూడదు.చిత్ర,లలిత సంగీత సుగాత్రుడైన బాలసుబ్రహ్మణ్యం, వాయులీననాద శరీరుడు అన్నవరపు రామస్వామి, అవధాన కవితాసారథి ఆశావాది ప్రకాశరావు, మృదంగ కళాసుకీర్తి సుమతి, ఆదివాసీల గుండెచప్పుడు కనకరాజు మన భూమి పుత్రులు.వీరందరికీ పద్మ పురస్కారాలు లభించడం వల్ల, ఈ కళలను ఎంచుకున్నవారికి విశ్వాసం పెరుగుతుంది. తెలుగు కళాక్షేత్రాలు కొత్త పరీమళాలు వెదజల్లుతూ, సరికొత్త పూలు పూయిస్తాయని ఆశలు నింపుకుందాం.పద్మ పురస్కార గ్రహీతలకు అభినందన చందన మాలలు సమర్పిద్దాం.