- అభివృద్ధిలో దూసుకుపోతున్న సింగరేణి
- వ్యాపార విస్తరణకు పలు చర్యలు
- నిర్మాణంలో ఉన్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్
- మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ ప్లాంటు
హైదరాబాద్ సింగరేణి భవన్‌లో మంగళవారం (జనవరి 26వ తేదీ) ఉదయం జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సింగరేణి సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. సింగరేణి తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఒడిస్సా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాకు కు సంబంధించి ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు పూర్తి మద్దతు తెలపడంపై కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలోనే నైనీ బొగ్గు బ్లాకు నుండి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి సంసిద్ధమవుతున్నామని, సింగరేణికి కేటాయించిన న్యూపాత్రపాద బొగ్గు బ్లాకు నుండి కూడా మరో రెండేళ్లలో బొగ్గు తవ్వకం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్ ప్లాంటుల్లో 85 మెగావాట్లు ఇప్పటికే గ్రిడ్ కు అనుసంధానం చేశామనీ, ఇదే ఏడాదిలో మిగిలిన 215 మెగావాట్ల ప్లాంటులు కూడా పూర్తవుతాయని తెలిపారు. అంతేకాకుండా కరీంనగర్ మానేరు జలాశయం మీద మరో 300 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటు నిర్మాణానికి సింగరేణి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని అనుమతి లభిస్తే అక్కడ కూడా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సింగరేణి లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు పంచే పద్ధతి కేవలం సింగరేణిలో మాత్రమే ఉందని శ్రీధర్ అన్నారు.
ఇది చదవండి: సింగరేణిలో ఉద్యోగస్థులకు క్వార్టర్ల నిర్మాణం
కరోనా నివారణకు చర్యలు:
కోవిడ్ వ్యాధి నివారణకు సింగరేణి 60 వేల ర్యాపిడ్ టెస్టు కిట్లు కొని పరీక్షలు చేయించడమే కాక సుమారు 50 కోట్ల రూపాయలతో కోవిడ్ నివారణ చర్యలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించి అతితక్కువ నష్టంతో సింగరేణి కార్మికుల్ని కాపాడుకోగలిగామని వివరించారు. సింగరేణి సంస్థ ప్రస్తుత పోటీ మార్కెట్టును తట్టుకొని నిలబడాలి అంటే బొగ్గు ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గించుకోవాలనీ, దీని కోసం యంత్రాలు, ఉద్యోగులు తమతమ డ్యూటీలో పూర్తి పనిగంటలు సద్వినియోగం చేయాలని కోరారు. ఈ ఏడాదికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అంతే మొత్తంలో బొగ్గు రవాణా జరపాలని కోరారు.
ఇది చదవండి: సింగరేణిలో ఉద్యోగాల జాతర
ఉత్తమ సింగరేణియన్ గా కె.రవిశంకర్ కు అవార్డు
సింగరేణిలో ఉత్తమ సింగరేణియన్ (అధికారి)గా ఎంపికైన జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ కె.రవిశంకర్ ను ఆయన ఘనంగా సన్మానించారు. అలాగే హైదరాబాద్ కార్యాలయం నుండి ఉత్తమ అధికారులుగా ఎంపికైన అడిషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & ఎకౌంట్స్) బి.రాజేశ్వరరావు, డి.జి.ఎం. (పర్చేజ్) జి.విజేందర్ రెడ్డి, ఫైనాన్స్ శాఖ పి.ఎ. వి.పూర్ణచంద్రశేఖర్, డిప్యూటీ సూపరింటిండెంట్ (సింగరేణి సేవా సమితి) కె.కిషోర్ లను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇ.డి. (కోల్‌మూమెంట్) జె.ఆల్విన్, అడ్వయిజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వయిజర్ (ఫారెస్ట్రీ) కె.సురేంద్రపాండే, అధికారుల సంఘం సి.ఎం.ఓ.ఎ.ఐ. జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఎన్.భాస్కర్ లు పాల్గొన్నారు.
ఇది చదవండి: సింగరేణి సోలార్ విద్యుత్ ఓపెన్ యాక్సిస్ పై ట్రాన్స్ కో తో ఒప్పందం