డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
ఏ ఆధునిక సమాజం తీరునైనా నిర్ణయించేవి ఏవి? స్వాతంత్ర్యం, న్యాయం, శాంతి, సంతోషం అనేవి ఆ సమాజంలో ఏ స్థాయిలో పరిగణించబడుతున్నాయి, ఏ రీతిలో వ్యాఖ్యానించబడుతున్నాయి, ఏ విధానంలో ఫలితాలనిస్తున్నాయి అనే వాటి మీద ఆధారపడతాయి. పౌరులు, సమాజం, రాజ్యం, మార్కెట్, మీడియా, వివిధ జనసమూహాలు వంటి వాటి మధ్యన ఉండే అంతస్సంబంధాల తీరు అనేది కూడా అత్యంత కీలకం ప్రస్తుత తరుణంలో. ఈ మొత్తం వ్యవహారానికి రాజ్యాంగం కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ రాజ్యాంగమే మనం దేశంగా ఎటువంటి పాలనావ్యవస్థను అంగీకరించి ఆమోదించి నిర్దేశింపబడుతున్నామో తెలియజేస్తుంది. కనుక మనదేశం ఆధునిక చరిత్రలో 1950 జనవరి 26 అనేది ఒక లైట్ హౌస్ లాగానో, ఒక ధ్రువతారలాగానో గొప్పగా నిలబడి దిశానిర్దేశనం చేస్తుంది. ఆ వెలుగులో గతాన్ని అవగతం చేసుకోవచ్చు, వర్తమానాన్ని అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవచ్చు. అవలోకించిన ప్రతిసారీ కొత్త భావనలు, కొంగొత్త పరిష్కారాలు స్ఫురిస్తాయి.
విలువైన రెండు మాసాలు
నిజానికి 1950 జనవరి 26న భారతరాజ్యాంగం అమలులోకి వచ్చి, సర్వసత్తాక గణతంత్ర దేశంగా మారి ఉండవచ్చు. దానికి సరిగ్గా రెండు నెలల ముందు అంటే 1949 నవంబరు 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. ఈ తేదీని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆమోదం పొందిన తర్వాత అనువర్తింపబడటానికి కొన్ని వ్యవస్థలు దాని ప్రకారంగా ఏర్పడి అమలుకు తోడ్పడాలి. ఈ రెండు నెలల కాలంలో జరిగింది అదే. జనవరి 26కు ముందు రెండు నెలల కాలం విలువైంది, దానికి మన దేశం విశేషంగా సమాయత్తం అయ్యింది. ఆ మాటకు వస్తే రెండు నెలలు కాదు రెండు దశాబ్దాలు. ఎలా? 1929 లో లాహోరులో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు; వాటికున్న నేపథ్యం కారణం. అప్పటికి మహాత్మాగాంధీ భారతదేశం వచ్చి దశాబ్దిన్నర అయ్యింది. తొలిసారిగా దేశం అన్ని విభేదాలూ మరచి ఒకటి అయ్యింది. మన సమాజంలో ఉన్న అన్ని మతాల సారాన్ని స్వీకరించి ఉన్నత మానవ విలువలతో మహాత్ముడు సత్యాగ్రహ ఆయుధాన్ని రూపొందించారు. దాన్ని దక్షిణాఫ్రికాలో విజయవంతంగా వాడి, ఫలితం సాధించిన అనుభవంతో గాంధీ రంగంలో దిగి ఉన్నారు. చౌరీచౌరా వంటి ఘటనలను ఆమోదించినా, పరోక్షంగా వత్తాసు పలికినా ప్రమాదమని గ్రహించిన గాంధీకి స్వాతంత్ర్యంకన్నా సవ్యమైన సమాజం తొలి ప్రాధాన్యం. ఇదీ నేపథ్యం. పూర్ణ స్వరాజ్యం ఒకటే లక్ష్యమని పరిగణించిన క్షణం నుంచే ఎటువంటి వ్యవస్థతో మనం పాలింపబడాలనే ఆలోచన, అధ్యయనం మొదలైంది.
రెండు దశాబ్దాల శోధన
కనుక 1949 నవంబరు 26న ఆమోదింపబడిన రాజ్యాంగం వెనుక రెండు దశాబ్దాల శోధన, ఆశలు, భావనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్వాతంత్ర్యం సిద్ధించాకా రెండు సంవత్సరాలలో రాజ్యాంగ నిర్మాణ కృషి గొప్పది. ఒకవైపు శాంతి, సామరస్యం, ప్రజాస్వామ్యం, సర్వతోముఖాభివృద్ధి అనే లక్ష్యంతో ఏర్పడిన దేశం. మరోవైపు మతపరమైన కారణాలతో విడిపోయిన పాకిస్తాన్ ఏర్పడిన తరుణం. అంతేకాదు మత విద్వేషాలతో సమాజం అట్టుడికిపోయిన సందర్భం. మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 15న ఢిల్లీలో సంబరాలు జరుపుకోలేదు. విద్వేషాలతో ప్రజ్వరిల్లిన ప్రకోపాలతో బెంగాలు ప్రాంతంలో గాయపడిన మనసులను, మనుషులను ఊరటపరిచి, సేదదీరుస్తున్నారు. అంతేకాదు వాటి కారణంగానే స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నెలలలోపే విద్వేషాల తుపాకిగుండ్లకు బలయ్యారు. ఈ అనుభవం, గాయం కూడా పెద్ద మలుపు. అన్ని వైరుధ్యాలను ప్రతిఫలిస్తూ, అన్ని రకాల తేడాలను సంబాళిస్తూ భారత రాజ్యాంగం మరింత పటిష్టంగా రూపొందింది.
అంబేడ్కర్ నాయకత్వం
ఈ కృషిలో ఎంతోమంది పాలుపంచుకున్నారు. దీనికి నాయకత్వం వహించిన అబేద్కర్ పరిశ్రమ ఉన్నతమైంది. కనుకనే భారత రాజ్యాంగం ఆమోదించుకుని, గణతంత్ర ప్రజాస్వామ్యంగా ఏర్పడి ఏడ దశాబ్దాలు అయిన సందర్భంగా 26 నవంబరు 2019 నుంచి 14 ఏప్రిల్ 2020 దాకా ప్రత్యేక అధ్యయనం, ప్రత్యేక అవగాహనా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 14 అంబేద్కర్ జన్మదినం. 2020 ఏప్రిల్ 14 నుంచి అంబేద్కర్ 130వ జయంతి సంవత్సరం మొదలవుతోంది. అదీ ప్రత్యేకత. గాంధీ 150వ జయంతి సంవత్సరం ముగింపు, అంబేద్కర్ 130వ జయంతి సంవత్సరం శ్రీకారం సంగమ సమయంలో ఏడు దశాబ్దాల రాజ్యాంగ ఫలితాల గురించి అనుభవాల గురించి చర్చించుకుంటున్నాం.
ఇది చదవండి: అంబేడ్కర్ దృష్టిలో దళిత రిజర్వేషన్ల చరిత్ర
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనది. అతి సమగ్రమైంది. అయినా కూడా అమెండ్ మెంట్స్ (సవరణలు) చాలానే వచ్చాయి. సమాచార హక్కు చట్టం 2005 దాకా కానీ రాలేదు, విద్యాహక్కు చట్టం 2009 దాకా కానీ రాలేదు! ఎందువల్ల ? భావ ప్రకటనా స్వేచ్ఛ గొప్పగా పొందుపరచబడిన రాజ్యాంగం పాలించే సమాజంలో సమాచారం హక్కు అని విడిగా చట్టం రావాల్సి వచ్చిందా? ప్రజాస్వామ్యానికి విచక్షణ మూలం, విలక్షణకు విద్య కారణం. మరి ఆరు దశాబ్దాల తర్వాత దాకా మనం విద్యాహక్కు చట్టం కోసం ఆగామా? చట్టం అయితే కానీ ఉన్నత భావాల అంతరార్థం అందుకోలేమా? ఆదర్శాలు వల్లిస్తూ, అసలు దారులు మరిచిపోయామా? గమ్యం దిశలోబడి గమనాన్ని దోషభరితం చేసుకున్నామా? — అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా సిగ్గుపడాల్సి ఉంది, మరోరకంగా ఆందోళన పడాల్సి ఉంది, ఇంకోరకంగా ఆలోచించి సరిదిద్దుకోవాల్సి ఉంది.
ఆరు అంగాల వ్యవస్థ
ప్రజాప్రతినిధుల సభ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయవ్యవస్థలను రాజ్యాంగంలో ప్రధాన రంగాలుగా పరిగణిస్తాం. అసలు ఎన్నుకోబడిన ప్రతినిధులు సమాజం అభ్యున్నతి కోసం విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు పరుస్తుంది అధికారవ్యవస్థ. వీటి తర్వాత న్యాయవ్యవస్థను పేర్కొన్నా – మొదటి వర్గం ఎన్నిక, విధి విధానాలను సరిచూసేది, సరిచేసేది జ్యుడీషిరి మాత్రమే! కనుక ప్రభుత్వాన్ని తప్పు పట్టే అధికారం న్యాయవ్యవస్థకు ఉంటుంది. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించే హక్కు ప్రజాప్రతినిధుల సభకు ఉంటుంది. ఈ రెండింటికీ అనుగుణంగా సాగుతుంది కార్యనిర్వాహాక వర్గం. ఈ మూడు వ్యవస్థలు లోపలి నుంచి పనిచేస్తే, అదే స్ఫూర్తితో బయటి నుంచి పనిచేసేది ప్రజాభిప్రాయమనబడే మీడియా. తొలుత పత్రికారంగాన్ని, పిమ్మట సమాచార వ్యవస్థలను ఈ నాల్గవ ప్రధాన అంగంగా పేర్కొంటాం. ఇవన్నీ ఉన్నా, రాజకీయ పార్టీలు లేకపోతే మొత్తం వ్యవస్థ రూపుదిద్దుకోదు. అందుకే పార్టీ వ్యవస్థను ఐదో అంగంగా పరిగణిస్తారు. అలాగే ప్రజాచైతన్యం, పౌరుల హక్కులు, సమాంతర లేదా ప్రతికూల అభిప్రాయాలు చెప్పే సిటిజన్ యాక్టివిజాన్ని ఆరో అంగంగా భావిస్తాం.
నిరసన వేదికలు
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్, మద్రాసులోని మెరీనా బీచ్, హైదరాబాదులోని ఇందిరాపార్కు, విజయవాడలో స్వరాజ్యమైదాన్ వంటివి నిరసనవేదికలు, ప్రతిఘటన స్వరవాహికలు. 2017 అక్టోబరులో జంతర్ మంతర్ వద్ద ఇలాంటి అవకాశం లేకుండా రద్దు చేశారు. దీనిని జాతీయ మానవహక్కుల కమీషన్ (NHRC) దృష్టికి తెస్తే – 2018 ఏప్రిల్ లో ఎన్ హెచ్ ఆర్ సి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి సూచించింది. అంటే ప్రతిఘటన స్వరాలకు, సమాంతర అభిప్రాయాలకూ గౌరవం ఇవ్వడమే కాదు రాజ్యాంగం వేదికను కల్పిస్తోంది. అంతటి ఉత్కృష్టమైన దృష్టితో రాజ్యాంగం రూపకల్పన చేయబడింది. అయితే రాజ్యాంగం అమలు అయ్యాక స్వాతంత్ర్య భావన, సమదృష్టి, ఉదారవాదం, భవిష్యత్ దృష్టి పెరిగాయా? తరిగాయా? నిజానికి జాతీయోద్యమ స్ఫూర్తి రాజ్యాంగానికి పునాదులు వేసింది. దిశానిర్దేశనం చేసింది.
కాశీనాధుని, గాడిచర్ల
ఒక మందుల కంపెనీ యజమాని తన స్వదేశానికి తిరిగి వెడుతూ, సంస్థను యోగ్యుడైన ఉద్యోగికి అప్పజెప్పాడు. ఆ యువకుడు మందులు అనేవి మనుషుల ఆరోగ్యమే కాదు, సమాజపు దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి కూడా పనిచేయాలని భావించారు. కనుకనే ఔషధ వాణిజ్యం చేస్తూనే తెలుగు వారపత్రికను మరాఠి ప్రాంతంలో ప్రారంభించారు. చాలామంది మాట్లాడటానికి భయపడే యువకుడికి సంపాదకత్వం అప్పచెప్పి, దినపత్రికగా మార్చి, తెలుగుకు కేంద్రస్థానమైన మద్రాసుకు మార్చాడు ఆ మహానుభావుడు. ఆయనే కాశీనాథుని నాగేశ్వరరావు. ఆ సంపాదకుడే గాడిచర్ల హరిసర్వోత్తమరావు.
ఆంధ్రపత్రిక చారిత్రక పాత్ర
అలా 1914 ఏప్రిల్ 1న ఆంధ్రపత్రిక డైలీ మద్రాసులో మొదలై, తెలుగువారి చైతన్యానికి కేంద్రస్థానమైంది. 1915 ఉగాదికి తెలుగు ప్రముఖులు ఒకచోట కలవడానికి కారణమైంది. ఫలితంగా 1916 ఏప్రిల్ 3 ఉగాదికి చెన్నపురి ఆంధ్రమహాసభ శ్రీకారం చుట్టుకుంది. దీనికి కేంద్ర బిందువు కాశీనాథుని నాగేశ్వరరావూ, ఆయన ఆంధ్ర పత్రికా! గ్రంథాలయం; విజ్ఞాన సముపార్జన; వ్యాయామక్రీడలు; వాణిజ్యవ్యాపార పారిశ్రామిక అభివృద్ధి మొదలైనవి లక్ష్యాలు! బాగా సాగి మొదలై, విబేధాలలో 1922లో ఈ సంస్థ మూతబడినపుడు రికార్డులు, ఇతర సామాగ్రి భద్రపరుచబడింది ఆంధ్రపత్రికాకార్యాలయంలోనే! మళ్ళీ బొబ్బిలి రాజా, మాదిరెడ్డి కాంతారావు నాయుడు వంటివారు ఈ ఇరు సంఘాలని కలపాలని ప్రయత్నించారు. చివరకు 1929లో ముత్తా వెంకటసుబ్బారావు ప్రయత్నాలు ఫలించి మరలా తెలుగువారు ఏకమయ్యారు.
ఇది చదవండి: రాజకీయ రణ’తంత్రం’ గా మన ప్రజా ‘గణతంత్రం’!
చెన్నపుర ఆంధ్రమహాసభ
చెన్నపురి ఆంధ్రమహాసభ కొనసాగింది. ఆంధ్రప్రాంతం, రాయలసీమ నాయకులు 1937 నవంబరు 14న కాశీనాథుని నాగేశ్వరరావు మైలాపూరులోని శ్రీభాగ్ భవనంలో సమావేశమయ్యారు. చర్చల తర్వాత నవంబరు 16న ఒక ఒప్పందానికి వచ్చారు. అదే శ్రీభాగ్ ఒప్పందం. మరుసటి సంవత్సరం ఏప్రిల్ 11న కాశీనాథుని నాగేశ్వరరావు కనుమూసినా నేటికీ ‘శ్రీభాగ్ ఒప్పందం’ చర్చలలో ఉంది, దిశానిర్దేశనం చేస్తోంది.
‘ఆంధ్రపత్రిక’ కాశీనాథుని నాగేశ్వరరావు, గృహలక్ష్మి కె.ఎన్.కేసరి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికను ప్రారంభించిన వరదరాజులు నాయుడు – అంతా తెలుగు వారు అయినటువంటి వాణిజ్యవేత్తలు, ఔషధాల తయారీదారులు. వారు వాణిజ్యంలో గడిచిన లాభాలాను ఐచ్ఛికంగా సమాజ సర్వతోముఖాభివృద్ధికి పత్రికల కోసం ఖర్చుపెట్టారు. వీరిలో వాణిజ్య దృష్టికన్నా, సామాజిక దృష్టి ఎక్కువ వుంది. కనుకనే వారికి గౌరవం ఉంది, వారి పత్రికలకూ మన్నన ఉంది. ఈ పత్రికలే కాదు ఆ సమయంలో సాగిన పత్రికలన్నీ గొప్ప పత్రికలుగా కీర్తిపొందాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా పత్రికారంగానికి పుట్టుక, వృద్ధి ఇంత ఉజ్జ్వలంగా లేదు. ఎటువంటి రాజ్యాంగం లేని రోజుల్లో కేవలం జాతీయోద్యమం స్ఫూర్తితో ఈ మహనీయులు పత్రికలు నడిపి స్వరాజ్యం రావడానికి దోహద పడ్డారు.
గమ్యం కన్నా గమనం ప్రధానం
అప్పట్లో గమ్యం కన్నా గమనం కీలకమైంది. వ్యక్తికన్నా సమాజం కీలకంగా పరిగణించబడింది. కట్టడి, చట్టం అనేవి బయటి నుంచి కాకుండా వ్యక్తి అంతః చేతన నుంచి బయలుదేరి ప్రతీక్షణం మనుషులకు సవ్యమైన మార్గంలో పెట్టాయి. అదినేడు కొరవడింది. కనుకనే రాజ్యాంగానికి కారణభూతమైన ఆరు అంగాలు విమర్శలకు లోనవుతున్నాయి. పైకి చెప్పే నియమాలు, చేసుకునే ప్రచారాలను దాటి మనం నడిచే దారిని మనసా, వాచా, కర్మణా సవ్యంగా మలుచుకుని సాగితే అదే రాజ్యాంగస్ఫూర్తి!
రాజ్యాంగం లేని రోజుల్లో ఉన్న జాతీయ స్ఫూర్తి నేడు మనకు అవసరం. ఆ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రూపొందించుకుని స్ఫూర్తిని వదిలివేసి దేశం, సమాజం పతనమవుతోంది. తక్షణ అవసరం కల్తీలేని అర్థవంతమైన స్ఫూర్తి. ఇదే రాజ్యాంగ స్ఫూర్తికి మరింత కాంతిని ఇస్తుంది.
(గణతంత్ర దినోత్సవం సందర్భంగా)