- కలిసొచ్చిన కరోనాకాలం
- పెరిగిన నియంత్రణ, పేస్-స్వింగ్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి కరోనా కాలం ఓ పీడకలగా, చేదుఅనుభవంగా నిలిస్తే… భారత యువఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు మాత్రం కలిసొచ్చిన కాలంగా నిలిచింది. గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో సభ్యుడిగా అంచనాలకు మించి రాణించిన సిరాజ్ ఆ తర్వాత మరివెనుదిరిగి చూసింది లేదు.
విరాట్ అండదండలతో
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కొహ్లీ ప్రోత్సాహం తోనే ఇంతవరకూ వచ్చానని, కొహ్లీ భాయి సలహాలు, సూచనలు, ప్రేరణ మరువలేనని సిరాజ్ చెబుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా సిరాజ్ చరిత్ర సృష్టించాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ దారుణంగా విఫలం కావడంతో.. బెంగళూరు పేస్ ఎటాక్ కు కీలకమయ్యాడు.
Also Read : యువక్రికెటర్లకు నజరానాల వెల్లువ
వినూత్న సాధనతో
కరోనా కాలంలో క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోడంతో లభించిన విరామసమయాన్ని సిరాజ్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. ఇంటిపట్టునే ఉండకుండా సింగిల్ స్టంప్ లక్ష్యంగా ఉంచి సాధన చేశాడు. గంటలతరబడి నెట్ ప్రాక్టీసులో పాల్గొనడం ద్వారా లైన్ అండ్ లెంత్ పై నియంత్రణ సాధించగలిగాడు.
హైదరాబాద్ అండర్ -23 జట్టుకు సిరాజ్ ప్రాతినిథ్యం వహించిన సమయంలో సాదాసీదా బౌలర్ గా ఉండేవాడని, బౌలింగ్ లో వేగంగా ఉన్నా నియంత్రణ, స్వింగ్ ఉండేవి కావని హైదరాబాద్ మాజీ పేస్ ఆల్ రౌండర్ జ్యోతిప్రసాద్ గుర్తుచేసుకొన్నారు.
Also Read : సొంతూర్లో నటరాజన్ కు జనరథం
అయితే…తమ సలహాలు, సూచనలతో కరోనా విరామసమయాన్ని సిరాజ్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడని, ఇప్పుడు సిరాజ్ అంతర్జాతీయ శ్రేణి బౌలర్ గా మారిపోయాడని చెప్పారు.
బౌలింగ్ కోచ్ దే ఈ ఘనత
ముడివజ్రం లాంటి సిరాజ్ ను భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సానబెట్టి రాటుదేల్చారని భారత ఫీల్డింగ్ కోచ్,హైదరాబాద్ మాజీ క్రికెటర్ ఆర్. శ్రీధర్ అభిప్రాయపడ్డారు. సిరాజ్ లోని బలాలు,బలహీనతలను సమగ్రంగా పరిశీలించిన బౌలింగ్ కోచ్ అరుణ్…అత్యుత్తమ స్థాయిలో శిక్షణ ఇచ్చారు. దీనికితోడు…బీసీసీఐ చొరవతో ఏడాదిపాటు రంజీట్రోఫీలో పాల్గొనకుండా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందటం కూడా సిరాజ్ కు బాగా కలసి వచ్చింది.
ప్రస్తుతం సిరాజ్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలుగుతున్నాడు. బంతిని ఇరువైపుల స్వింగ్ చేయటం ద్వారా నాణ్యమైన బౌలర్ గా రాటుదేలగలిగాడు.
ఐపీఎల్ టు ఆస్ట్రేలియా టూర్
ఐపీఎల్ 13వ సీజన్లో అంచనాలకు మించి రాణించన సిరాజ్ …ఆ వెంటనే ప్రారంభమైన ఆస్ట్ర్రేలియా సిరీస్ కు సైతం ఎంపికయ్యాడు. కంగారూ టూర్ లో అందివచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగాడు. మెల్బోర్న్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సిరాజ్ కీలకవికెట్లు పడగొట్టడం ద్వారా అందరి దృష్టి ఆకర్షించాడు. ఆ తర్వాత జరిగిన సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో సైతం సిరాజ్ చెలరేగిపోయాడు.
Also Read : తండ్రి సమాధి వద్ద సిరాజ్ భావోద్వేగం
ఫాస్ట్ బౌలర్ల స్వర్గం బ్రిస్బేన్ గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. మిస్టర్ డిపెండబుల్ లబుషేన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాథ్యూవేడ్, స్టార్క్, హేజిల్ వుడ్ ల వికెట్లు పడగొట్టాడు. మొత్తం 19.5 ఓవర్లలో 73 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. మూడు టెస్టులు, ఆరు ఇన్నింగ్స్ తో కూడిన తన కెరియర్ లో సిరాజ్ కు ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి.
హేమాహేమీల సరసన సిరాజ్
బ్రిస్బేన్ టెస్టుమ్యాచ్ ల్లో 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ ఇరాపల్లి ప్రసన్న, లెఫ్టామ్ స్పిన్నర్ బిషిన్ సింగ్ బేడీ, పేస్ బౌలర్లు మదన్ లాల్, జహీర్ ఖాన్ ఉన్నారు. 2021 సీజన్ టెస్టుమ్యాచ్ లో 5 వికెట్లు సాధించడం ద్వారా సిరాజ్ సైతం ఆ నలుగురు హేమాహేమీల సరసన నిలువగలిగాడు. 1968 సిరీస్ లో ప్రసన్న, 1977లో బేడీ, మదన్ లాల్, 2003లో జహీర్ ఖాన్ గబ్బా వేదికగా 5 వికెట్లు సాధించిన భారత బౌలర్లుగా ఉన్నారు.
అంతేకాదు…సిరీస్ లోని ఆఖరి మూడుటెస్టులు ఆడిన సిరాజ్ మొత్తం 13 వికెట్లు పడగొట్టడం ద్వారా బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు. అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు చారిత్రాత్మక విజయంలో సిరాజ్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు.
Also Read : స్వస్థలాలకు చేరిన క్రికెట్ హీరోలు
26 ఏళ్ల సిరాజ్ మరింత నిలకడగా రాణించగలిగితేనే భారత టెస్టుజట్టులో తన స్థానం పదిలం చేసుకోగలుగుతాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ముంబై ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ల నుంచి సిరాజ్ కు రానున్న కాలంలో గట్టిపోటీ ఎదురుకానుంది. సవాళ్లను ఎదుర్కొనడం తనకు ఎంతో ఇష్టమని చెప్పే సిరాజ్ ఇకముందు కూడా ఇదేజోరు కొనసాగించాలని కోరుకొందాం.