Friday, November 22, 2024

దుబ్బాక: ఇద్దరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో ప్రవేశం

దుబ్బాక ఉపఎన్నికలలో ప్రచారం జోరందుకున్నది. గెలుపై ధీమాతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శ్రేణులు ముందుకు దూసుకొని వెడుతుంటే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా సమధికోత్సాహంతో పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్ ను లెక్కచేయకుండా నాయకులూ, కార్యకర్తలూ మూకుమ్మడిగా ప్రచారంలోకి దిగారు. అనూహ్యంగా దుబ్బాక ఎంఎల్ ఏ సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం చెందడంతో ఈ ఉప ఎన్నికల అవసరం ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డి, బొంపల్లి మనోహరరావు తెలంగాణ ఆర్థికమంత్రి టి. హరీష్ రావు సమక్షంలో శుక్రవారంనాడు టీఆర్ ఎస్ లో చేరారు. వీరిద్దరూ తమతమ స్థాయిలో పార్టీ టిక్కెట్టుకోసం ప్రయత్నించినవారే. వారితో పాటు అనేకమంతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అధికారపార్టీలో చేరిపోయారు. ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ ప్రభ వెలిగిపోతోంది.

తెలంగాణ రాష్ట్రం యావత్తూ ఎన్నికల సందడితో సతమతం అవుతోంది. శుక్రవారంనాడే నిజామాబాద్ ఎంఎల్ సీ ఎన్నిక జరుగుతోంది. మహబూబ్ నగర్, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ, నల్లగొండ, వరంగల్లు, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఎంఎల్ సీ ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ సిటింగ్ అభ్యర్థిగా విద్యాసంస్థల అధిపతి పల్లా రాజేశ్వరరెడ్డి మళ్ళీ పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. నల్లగొండ-వరంగల్లు-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారు. వామపక్షాలు ఏమి చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.

దుబ్బాకలో హోరాహోరీ

అన్నిటి కంటే ఎక్కువ సందడి శాసనసభ ఎన్నికలలోనే ఉండటం సహజం. దుబ్బాకలో పోటీ హోరాహోరీగా సాగుతోంది. హరీష్ రావు అధికారపార్టీ ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కిరాయి నేతలతో ప్రచారం సాగిస్తున్నారంటూ హరీష్ ఆరోపించారు. పరాయి లీడర్లూ, కిరాయి మనుషులతో ప్రచారం సాగుతోందని విమర్శనాస్త్రాలు సంధించారు. దుబ్బాక టీఆర్ ఎస్ అభ్యర్థి, రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పట్ల చులకనభావంతో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మహిళాలోకానికి ముందు క్షమాపణ చెప్పి, తర్వాతనే ప్రచారానికి రావాలంటూ హరీష్ సవాలు విసిరారు. ‘మహిళలను కించపచడమే సంస్కృతా?’ అని ఉత్తమ్ ను ప్రశ్నించారు. గురువారంనాడు సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ లో జరిగిన పెద్ద ఎన్నికల సభలో హరీష్ ప్రసంగించారు. ‘ప్రతి  గల్లీలో, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురుతోంది, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన పరాయి నాయకులూ, కిరాయి మనుషులూ చేసేది ఏమీ లేక కొండపోచమ్మ ప్రాజెక్టు తిలకించి జన్మధన్యమయిందని అనుకొని వెళ్ళిపోతారంటూ హరీష్ చమత్కరించారు.

బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ఆరోపణపైన పార్టీ నుంచి బహిష్కరించిన తోట కమలాకరరెడ్డి మిరుదొడ్డిలో విలేఖరులతో గురువారంనాడు మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి రఘునందన్ నీతిమంతుడని లేఖ ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఆర్సీపురం పోలీసు స్టేషన్ పరిధిలో రఘునందన్ పైన కేసు ఉన్నమాట వాస్తవం కాదా అని అడిగారు. కేసులు లేవని చెప్పే ధైర్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఉన్నదా అని ప్రశ్నించారు.

దుబ్బాక నుంచే విజయపరంపర: ఉత్తమ్

దుబ్బాక నుంచే విజయపరంపర కాంగ్రెస్ కు ప్రారంభం అవుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాక తీర్పులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కి కనువిప్పు అవుతుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ దక్షిణ యూపీ (ఉత్తర ప్రదేశ్)ని తలపిస్తున్నదనీ, బంగారు తెలంగాణ కాస్తా దక్షిణ యూపీని అనుసరిస్తున్నదనీ ఏఐసీసీ తెలంగాణ ప్రతినిధి మణిక్కం టాగోర్ వ్యాఖ్యానించారు.

నేడో, రేపో హైదరాబాద్ కు సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికీ దిల్లీలోనే ఉన్నారు. పార్లమెంటు సమావేశాలలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 10న దిల్లీ వెళ్ళిన సంజయ్ అస్వస్థతకు గురై అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు సంజయ్ బాగా కోలుకున్నారనీ, శని లేదా ఆదివారంనాడు ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తారనీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగానే, దుబ్బాక అభ్యర్థి రఘునందనరావు. ఎంఎల్ సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలుసుకుంటారు.  తర్వాత ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

వేగం పెంచిన హరీష్

దుబ్బాకలో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత హరిష్ రావుకే ముఖ్యమంత్రి అప్పగించారు. రామలింగారెడ్డి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచార రంగంలో హరీష్ ప్రవేశించారు. ప్రచారవేగాన్ని పెంచివేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించే లోపు హరీష్ ఒక విడత నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. అయన ప్రచారం ఒక ఎత్తూ, తక్కిన పార్టీల నాయకులందరి ప్రచారం ఒక ఎత్తుగా సాగుతోంది.  గ్రామాలలో ప్రజలు ఐచ్ఛికంగా సుజాతకే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. దుబ్బాకలో పోలింగ్ రోజు వరకు పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాకలో కనిపిస్తారనీ. ఆ తర్వాత కనిపించరనీ హరీష్ అన్నారు.

శోకంలో ఉన్న మహిళకు ఓదార్పునిస్తూ అన్నగా ధైర్యాన్నిస్తానని నేనంటే, మహిళలకు సత్తా లేదన్నట్టుగా టీఆర్ ఎస్ అభ్యర్థి సుజాతను ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానించడం దారుణం,’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. దుబ్బాకలో బీజేపీ ప్రభావం లేదనీ, ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనేననీ మాజీ లోక్ సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles