196 కోట్లతో వేలం బడ్జెట్
భారత్ వేదికగా వచ్చేనెలలో జరిగే ఐపీఎల్ -14 వేలం కార్యక్రమాన్ని ముందుగా ప్రకటించిన కార్యక్రమం కంటే వారంరోజులు ఆలస్యంగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్-2021 సీజన్ కోసం వివిధ ఫ్రాంచైజీలు తుదిజట్ల కూర్పు పనిలో పడ్డాయి. అందులో భాగంగానే వివిధజట్లు ప్రధానఆటగాళ్లను ఉంచుకొని అంచనాలకు తగ్గట్టుగా రాణించని ఆటగాళ్ళను వదిలించుకొన్నాయి. ఇప్పటికే ఆయా జాబితాలను వెల్లడించాయి.
ఐపీఎల్ బోర్డు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 11న వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే..తాజాగా వేలం నిర్వహణ ఒక వారం పాటు వాయిదా పడనుందని బీసీసీఐవర్గాలు అంటున్నాయి. ఐపీఎల్ పాలకమండలి కొద్దిరోజుల్లో వేలం కొత్తతేదీని ప్రకటించనుంది. అంతేకాదు ఐపీఎల్ వేలానికి వేదికను సైతం బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంది.
ఇదీ చదవండి:తండ్రి సమాధి వద్ద సిరాజ్ భావోద్వేగం
ఈ ఏడాది వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తమ అవసరాలకు తగిన ఆటగాళ్ల కోసం రూ.196కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాయి. ఫిబ్రవరి 18న మినీవేలం నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంది. గత సీజన్ ఐపీఎల్ ను కరోనా కారణంగా గల్ఫ్ దేశాలలోని అబుదాబీ,దుబాయ్, షార్జాలోని ఖాళీ స్టేడియాలలో నిర్వహించారు. అయితే…ప్రస్తుత 2021 సీజన్ పోటీలను మాత్రం స్వదేశీవేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇంగ్లండ్ తో ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభంకానున్న మూడంచెల టెస్ట్, వన్డే,టీ-20 సిరీస్ లు విజయవంతమయితే ఐపీఎల్ ను సైతం స్వదేశంలోనే నిర్వహించడానికి మార్గం సుగమమవుతుంది. స్టీవ్ స్మిత్,గ్లేన్ మాక్స్ వెల్, షెల్డన్ కోట్రెల్, షేన్ వాట్సన్, లాసిత్ మలింగ లాంటి ఖరీదైన విదేశీ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే వదిలించుకొన్నాయి.
ఇదీ చదవండి:స్వస్థలాలకు చేరిన క్రికెట్ హీరోలు