• శశికళ కరోనా సోకినట్లు నిర్థారించిన వైద్యులు
• విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శశికళ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బందిపడుతూ ఆసుపత్రిలో చేరారు. బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో ఆమెకు రెండు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించగా నెగటివ్ వచ్చింది. బౌరింగ్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆమెను విక్టోరియా వైద్యశాలలో చేర్పించారు. సిటీస్కాన్ పరీక్ష చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పాటు శశికళకు బీపీ, సుగర్ సమస్యలు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆమె ఆరోగ్యం క్షీణించిందని విక్టోరియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళుగా బెంగళూరులోని పరప్పణ ఆగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షాకాలం పూర్తికానున్న నేపథ్యంలో ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కానున్నట్లు ఆమె తరపు న్యాయవాది రాజా సెతురపాండియన్ వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగనున్న సమయంలో ఆమె జైలు నుంచి విడుదల కావడం తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చివేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇది చదవండి: జైలు నుంచి శశికళ విడుదల ఎపుడంటే…?