Sunday, January 5, 2025

రైతుల వెన్నుతట్టి వారి పక్షాన సుప్రీంకోర్టు నిలబడిన ఆ ఒక్క రోజు

తేదీ: జనవరి 11. స్థలం: సుప్రీంకోర్టు.

రైతులకు కొండంత బలం కలిగించే ధైర్యం ఇచ్చిన రోజు. మరునాడు ఆవిరైనా, ఆరోజు ఆశలకు కలిపించిన రోజు. మనమంతా తెలుసుకోవలసిన మాటలు. అడగవలసిన మాటలు.

రైతు సమస్యలమీద ఆందోళన చేస్తున్నవారితో చర్చలు జరిపేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసే ఆలోచనలోఉన్నామని  సుప్రీంకోర్టు జనవరి 11న విచారణ సమయంలో ప్రకటించినపుడు ఒక మంచి పరిణామమని అందరూ అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళన గురించి వ్యవహరించిన తీరు పట్ల ప్రధాన న్యాయమూర్తి శరద్ ఎ బాబ్డే నిరాశ ప్రకటిస్తే అది ప్రజల నిరాశకు ప్రతిబింబం అనుకున్నారు. చర్చలు విఫలం కావడం, రాష్ట్రాలు తిరుగుబాటు చేయడం, కొందరు రైతులు ఆత్మాహుతి చేసుకోవడం కలవరపెట్టాయని, ఆందొళనలో వృద్దరైతులు మహిళలు పిల్లలు ఉండడం వారు ఎముకలుకొరికే చలిలో కరోనా వ్యాధి వ్యాపించిన నేపథ్యంలో మన గణతంత్రదినోత్సవానికి ముందు రోజుల్లో బాధపడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేసినపుడు మానవత్వం ఇంకా ఉందని అనుకున్నాం. ‘‘ఇంకా ఏ వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదు. కాని మీరు వ్యవహరించిన తీరుపట్ల  తీవ్రంగా నిరాశ చెందాం.  మీరు సరైన సంప్రదింపులు జరపకుండా చట్టాలు చేశారు. ఫలితం రైతుల సమ్మె. నెలలనుంచి నడుస్తున్నది. ఏం చర్చలు నడుస్తున్నాయి. అసలేంజరుగుతున్నది, ఏం మాట్లాడుతున్నారు?’’  అని ప్రధాన న్యాయమూర్తి అటార్నీజనరల్ వేణుగోపాల్ ను, ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వ్యవహారాలు నడిపే సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారిని అడిగారు.

మీరు ఈ చట్టాలను ఆపకపోతే మేము ఆపాల్సి వస్తుంది అని కూడా ఆయన అన్నారు. ఒక దశలో వేణుగోపాల్ గారు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి తొందర పడకూడదని అన్నారు. దానికి ప్రధాన న్యాయమూర్తి.. మీకు ఎంతో సమయం ఇవ్వడం జరిగింది. మాకు ఓరిమి గురించి మీరు క్లాసు తీసుకోనవసరం లేదు… అని కోప్పడ్డారు కూడా.

ఇది చదవండి: సాగు చట్టాలతో రైతులకు తీరని నష్టం – రాహుల్ గాంధీ

న్యాయవాదులూ న్యాయమూర్తులూ

మేం చట్టాలు అమలు చేసి తీరతాం అని ప్రభుత్వం పక్షాన ఈ ఇద్దరు పెద్దలు వాదించారు. అప్పుడా న్యాయమూర్తి, ‘‘మీరు సమస్యలో భాగస్వాములా లేక పరిష్కారంలోనా? చర్చలు జరగడనికి వీలుగా చట్టాల అమలు నిలుపుచేయాలని  కదా మేమనేది, అయినా ఈ చట్టాలు ఉపయోగకరమని ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదు’’ అన్నారాయన. ఇవి పచ్చి వాస్తవాలు. ఈ పరిస్థితిలో చట్టాల రాజ్యంగ బద్ధత గురించి ఉత్తర్వులు జారీ చేయబోవడం లేదని అన్నారు.`

’’చర్చల్లో ఎవరూ ఈ చట్టాల్లో ఒక్క నియమమైనా రాజ్యాంగ వ్యతిరేకం అని వాదించలేదు. మీరు స్టే ఇస్తే అది చాల తీవ్రమైన నిర్ణయం అవుతుంది’’ అని వేణుగోపాల్ గారు సుప్రీంకోర్టును హెచ్చరించారు. ‘‘సారీ మిస్టర్ అటార్నీ జనరల్ మీరు (ప్రభుత్వం) బాధ్యతతో నిర్ణయం తీసుకోనందున మేం నిర్ణయం తీసుకోవలసి వస్తుండవచ్చు. మీరు పరిష్కారం సాధించలేకపోతున్నారు. కనీసం సమ్మెను పరిష్కరించాల్సిన బాధ్యత మీమీద ఉంది. మీరు అది చేయలేక పోతున్నారు‘‘ అని బాబ్డేగారు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది.

సర్కారీ సమర్థకులు సమ్మె ఆపగలరా

రైతులు రిపబ్లిక్ డే నాడు 200 ట్రాక్టర్లతో పరేడ్ లో చేరతామంటున్నారు అని వేణుగోపాల్ గారు అన్నారు. న్యాయవాది దుష్యంత్ దవే,‘‘ రైతులు ఆ మాట అనలేదని చెప్పారు. వేణుగోపాల్ గారూ ఈ రైతుల బంధువులు కూడా సైన్యంలో ఉన్నారు. వారు ఆ పని చేయరు. అసలు ఈ ప్రభుత్వం ప్రవర్తన ఏమిటో తెలియడం లేదు’’ అన్నారు. ‘‘హరియాణా ముఖ్యమంత్రి ప్రసంగించవలసిన సభావేదికను రైతులు ఏ విధంగా ధ్వంసం చేసారో చూడండి’’ అని వేణుగోపాల్ అన్నారు. చీఫ్ జస్టిస్ దానికి జవాబిస్తూ ‘‘మేం చట్టాలను ఉల్లంఘించే వారిని రక్షిస్తామనడం లేదు. అది లా అండ్ ఆర్డర్ కాపాడడం పోలీసుల పని. మేం గాంధీజీ తరహాలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాపాడతాం’’ అనిచెప్పారు. దేశంలో మెజారిటీ ఈ చట్టలు హానికరం కాదన్న వాదనను కొట్టివేస్తూ, ‘‘అయితే ఆ మెజారిటీ ఆలోచనలు రైతుల సమ్మెను ఎందుకు పరిష్కరించ లేకపోతున్నారని’’ అడిగారు. ఇది అడగవలసిన ప్రశ్న.

ఇది చదవండి: ట్రాక్టర్ ర్యాలీకి అనుమతిపై అధికారం పోలీసులదే

ఈ చట్టాలు గొప్పవని వాదించే పెద్దలు మేధావులు వెళ్లి రైతులకు తమకు కలిగిన ఆ జ్ఞానోదయం వారికి కూడా కలిగించాలి. అనుకూల టివి చానెల్స్ లో టివి ఆంకర్లు తమ పక్షాన వాదిస్తుంటే ఇవి రైతు వ్యతిరేక చట్టాలన్న వాడిని హేళన చేసే టివి చర్చావేదికలలో ఎవరైనా ఏమైనా మాట్లాడతారు. రైతులను నీటి ఫిరంగులతో కాకుండా తమ నోటి ఫిరంగులతో ఓడించి ఇంటికి పంపి వారు భారత రత్న బిరుదులు తీసుకోవచ్చు.

‘‘సుప్రీంకోర్టు చేతికి నెత్తురు అంటాలని అనుకోవడం లేదు. హింసలేకుండా బాధ్యత నిర్వహించాలి. మామూలు సంఘటన కూడా హింస ను రెచ్చగొట్టవచ్చు’’. అని ప్రధానన్యాయమూర్తి హెచ్చరించారు.  రైతులకు కూడా ఆయన ఒక మనవి చేసారు. మేం ఈ చట్టాలపై స్టే విధిస్తే మీరు రోడ్లమీంచి నిరసన ఆపేసి ఇంటికి వెళ్లాలని కాదు. మీరు నిరసన తెలుపుకోవచ్చు. విమర్శ గొంతు నులుముతున్నదనే నింద మాకొద్దు అనీ అన్నారు. అయితే చర్చలు జరుపుతున్నపుడు రైతు ఉద్యమకారులు కాస్త పక్కకు జరిపి రాకపోకలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

తుషార్ మెహ్తా విమర్శ

రైతు ఆందోళన విషయంలో కోర్టు కఠిన మైన వ్యాఖ్యలు చేసిందని మెహతా అన్నారు. కఠిన అని ఎందుకంటారు. ఏమాత్రం హానిలేని మాటలు ఇవి అని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. మా శక్తి మేరకు మేం ఎంత బాగా చేయగలమో అంతబాగా చేశాం అని మెహతా ప్రధానన్యాయమూర్తితో అన్నారు. ‘‘అవునవును మీరు ఎంత ఉత్తమంగా చేయగలరో అంతా చేశారు. కాని దాని ప్రభావం ఏదీ లేదు’’ అని బాబ్డే గారు అన్నారు. ఇది 11 వతేదీనాటి సర్వోన్నత న్యాయస్థానం విచారణలోజరిగిన వాదోపవాదాల వివరాలు.

ఎటూ గాని తీర్పు

మరునాడు 12న సుప్రీంకోర్టు అటు ప్రభుత్వం మనసు దోచుకుని ఇటు రైతుల హృదయంలో తిష్టవేసే అద్భుతమైనదనుకుని ఒక తీర్పు చెప్పింది.  మూడు వ్యవసాయచట్టాల అమలును తాత్కాలికంగా నిలిపి వేశారు. తరువాత చర్చలకోసం నలుగురు ప్రముఖులతో ఒక కమిటీ వేశారు. ఈ నలుగురు ప్రముఖులు ఈ మూడు చట్టాలు ఎంతో మేలైనవని ఇదివరకే ప్రకటించి ప్రభుత్వానికి అండగా నిలబడిన వారు. ప్రభుత్వం చాలా సంతోషించవలసి ఉంటుంది. వీరి పేర్లు ప్రకటించే ముందు సుప్రీంకోర్టు వీరి ఆలోచలేమిటో గమనించిందోలేదో, వీరు చాలా బహిరంగంగా మీడియాలో కార్పొరేట్ వ్యవసాయ వ్యాపార లావాదేవీలను సమర్థించిన వారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదని మనం అనుకోవాలి. అంతకు ముందు రోజు ఆశలు రేకెత్తించిన సుప్రీంకోర్టు మానవతా పూర్వకమైన వ్యాఖ్యానాలన్నీ ఈ కమిటీ సభ్యులు ఇదివరకే ప్రభుత్వ సానుకూల ప్రకటన చేసిన వారని తెలియడంతో నిరాశ కలిగించాయి. 

ఇది చదవండి: సాగు చట్టాల అమలుకు సుప్రీంకోర్టు బ్రేక్

ఆర్ ఎస్ ఎస్ వారి స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్ కూడా ఆందోళన కారులు అడిగిన సవరణలు అడుగుతున్నారు. ఇదేదో సమ్మెను లోపలనుంచి దెబ్బతీసే అంతర్గత ద్రోహం అయి ఉంటుందని ఆందోళన కారులు అనుమానించారు. అదే రీతిలో సుప్రీంకోర్టు కూడా ఈ అధికార పక్ష సభ్యుల కమిటీ వేయడంతో వారిలో మరిన్ని అనుమానాలు చెలరేగాయి. సుప్రీంకోర్టు ఒక్క రోజు కిందట కలిగించిన నమ్మకాలు సన్న గిల్లాయి. రాజ్యాంగ బద్ధమా కాదా అని చట్టాలను సత్వరమే విచారించి ఉంటే బాగుండేది.  సుప్రీంకోర్టు తన విద్యుక్తధర్మాలలో ఒకటైన న్యాయనిర్ణయం చేస్తే, సమ్మె చేయాల్సిన అవసరమే రైతులకు ఉండకపోవచ్చు. ప్రభుత్వ చట్టాలు చర్యలు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు కూడా ఎంతోసాహసంతో తీర్మానిస్తే తమ భవిష్యత్తును రోడ్డు మీదే తేల్చుకొనేందుకు రైతులు ఆలోచించవచ్చు. కాని రైతు వ్యతిరేక అభిప్రాయాలున్న వ్యక్తులను నిపుణులుగా భావించి కమిటీని వేయడం ద్వారా ఈ కమిటీని బహిష్కరించడానికి రైతులకు ఒక కారణాన్నిఅందించినట్టయింది. రైతులకు ఈ కమిటీ ద్రోహం వంటిదని వారు వ్యాఖ్యానించారు కూడా. ఎటూకాని నిర్ణయాలవల్ల విశ్వసనీయత తగ్గి, ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇన్ని చెప్పి మనం చివరకు ఏం సాధించినట్టు.

న్యాయస్థానాలు తమకు రాజ్యాంగం విధించిన విధి నిర్వహణకు పరిమితం కావడం మంచిది. ఇప్పడికే అత్యవసరమైన అంశాలపై అనవసరమైన జాప్యం చేసి, న్యాయం అంటే అది అందని అంతులేని కథే అనే అనుమానాన్ని పెంచి పోషిస్తున్నాం. రాజకీయంగా చేయవలసిన పరిష్కారాలు ప్రభుత్వాలే చేయాలి.  చిన్నకారు రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదే. రైతుల మధ్దతు బాధ్యతను వారు వదిలేస్తే దాన్ని కోర్టులు పట్టించుకోవడం సరైన విథంగానే అనిపిస్తుంది. కాని కోర్టులు పరిపాలించడం సాధ్యం కాదు. కమిటీలు వేయడం ప్రభుత్వాల పని. కనుక ఈ విధంగా కమిటీలు వేయడం విమర్శలకు గురైంది. ఇది ఒక తప్పుడు సంప్రదాయంగా మిగిలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమయింది.

త్వరగా న్యాయనిర్ణయం చేయగలరా

ఈ వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం అనడానికి బలీయమైన వాదనలు ఉన్నాయి. రాష్ట్రాలకు కేటాయించిన ప్రత్యేక అంశాలలో వ్యవసాయం ఒకటనీ, దానిపైన కేంద్రం అధికారాలు చలాయించడానికి వీల్లేదని, పార్లమెంటు చట్టాలుచేయరాదని కనుక ఈ చట్టాలు రాజ్యాంగవిరుద్ధం అని కొట్టివేయాలని కూడా పిల్ పిటిషన్లు ఉన్నాయి. ఆ పిటిషన్లు వెంటనే ఎందుకు విచారించరు. ఈ యాభైరోజుల ముందే వాటి విచారణకు స్వీకరిస్తే ఈ పాటికి వాదోపవాదాలు ముగిసి ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకమనే వాదాన్ని అంగీకరించి ఆ విధంగా తీర్పు చెప్పగలిగితే రైతుల ఆందోళనలకు శాశ్వత పరిష్కారం లభించేది కదా?

ఇది కేవలం చట్టాలకు సంబంధించిన సమస్య కాదు. ఈ ప్రభుత్వం ప్రజానుకూలంగా ఉందా లేదా అనే అనుమానాలకు సంబంధించిన సమస్య.

ఇది చదవండి: సర్కార్ కు సుప్రీంకోర్టు దారి చూపుతుందా?

రైతులు ఖలిస్తానీయులా?

ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై అవాస్తవ నిందలు వేయడం అధికార పార్టీలకు అలవాటు. ఇప్పడి అధికార పార్టీలకు అది కీలకమైన విధానం. చివరకు ఆందోళన చేస్తున్నరైతులలో ఖలిస్తానీయులు ఉన్నారని అటార్నీ జనరల్ అనడం ఒక దారుణమైన పరిణామం. ఎప్పుడో అంతమైన ఖలిస్తాన్ ఉద్యమం రైతు చట్టాలతోబయపడితే మనకున్న ప్రభుత్వం సమర్థతను మనం మెచ్చుకోవలసిందే.  మనదేశ రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కాస్త  మనసున్న మనిషివలె మాట్లాడారు. దేశం పట్ల రైతుల ప్రేమను శంకించడానికి వీల్లేదన్నారాయన. అటార్నిజనరల్ గారు అది విని ఉండకపోవచ్చు. అయితే ఆ మేరకు ప్రమాణ పత్రం వేయండి అని సుప్రీంకోర్టు అటార్నీజనరల్ కు సూచించింది. కోర్టు తమ విధుల్లో ఇచ్చిన ఆదేశాలను పాటించవలసి ఉంటుంది. అట్లా కాకుండా మేం కమిటీ వేసాం వారి దగ్గరకు వచ్చి మీరు మీ సమస్యలను పరిష్కరించుకోండి అనేరకం ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం ఉండదు. ఇప్పుడు పక్షపాతపూరితులైన సభ్యులతో వేసిన కమిటీని బహిష్కరిస్తామని రైతులు చెప్పారు. ఈ కమిటీలో ఉండబోనని ఒక సభ్యుడు చెప్పాడు. ఇప్పుడు ఆ సభ్యుడిపైన, ఈ రైతులపైన కోర్టు ధిక్కారం కేసులు నడిపి జైలుకు పంపుతారా? లేకపోతే అమలు కాని ఆదేశాలను ఉపసంహరించుకుంటారా? రెండూ జరగకపోవచ్చు.

ఇది సంక్షేమ వివాదం

ఇది రాజ్యాంగ వివాదం కాదు. కాని ఇప్పుడు రాజ్యాంగ వివాదం అయింది. చేశారు. వ్యవసాయానికి చట్టాలు అవసరం లేదు. కాని చేసారు. వ్యవసాయానికి సాయం అవసరం, ఆ సాయం ఇన్నాళ్లూ చేసారు. ఇప్పుడు ఆ సాయం చేయబోమని, సాయం చేసే చట్టాలు చెల్లబోవని చట్టాలు చేసారు. ఆ చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేదు., అది రాష్ట్రాల అధికారం అంటే కేంద్రం వినడం లేదు. కరోనా వైరస్ కాలంలో తెచ్చిన ఆర్డినెన్సును అనుమానాస్పదమైన రీతిలో చట్టాలుగా మార్చి జనం మీద రుద్దడం ఏం న్యాయం?

ఇది చదవండి: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles