- పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఎస్ఈసీ నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎస్ఈసీ అప్పీల్ పై హైకోర్టులో రెండ్రోజుల క్రితం వాదనలు ముగిశాయి. అయితే తీర్పును రిజర్వులో పెట్టిన ధర్మాసనం ఈ రోజు వెలువరించింది. వాక్సినేషన్ కు ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకావని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికల నిర్వహణ అసాధ్యమని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఇక హైకోర్టు తీర్పు ఎన్నికల సంఘానికి అనుకూలంగా రావడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణపై దూకుడు ప్రదర్శించే అవకాశాలున్నాయి. కోర్టు తీర్పుపై ప్రభుత్వ వర్గాలు స్పందించాల్సిఉంది.
ఇదీ చదవండి:ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు:
హైకోర్టు తీర్పు నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించి తాజా పరిస్థితులపై చర్చించనున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్ఈసీ వెల్లడించారు. ఫిబ్రవరి 5,9,13,17 తేదీలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం