హైదరాబాద్ : తెలుగు వెలుగు, అందాల నటుడు, మేటి రాజకీయ నాయకుడు నందమూరి తారకరామారావు 25వ వర్థంతిని ఈ రోజు (జనవరి 18) జరుపుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబునాయుడు. నారా లోకేష్, బాలకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసినితో పాటు ఇతర కుటుంబ సభ్యులు నెక్లెస్ రోడ్డులోని ఎన్ టి ఆర్ ఘాట్ ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.
ఎన్ టి ఆర్ గా ప్రసిద్దుడైన నందమూరి అందగాడు సినిమా నటుడుగా తిరుగులేని ఖ్యాతి గడించారు. పౌరాణికాలలో ఆయనకు ఎదురు లేదు. ప్రపంచ సినిమాలో పౌరాణిక, జానపద పాత్రలలో ఎన్ టి ఆర్ ని మించిన నటుడూ, నిర్మాత మరొకరు లేరు. సాంఘిక చిత్రాలలోనూ తన సత్తా నిరూపించుకున్నారు. పాతాళభైరవి, మాయాబజార్, మల్లీశ్వరి, నర్తనశాల వంటి చిత్రాలు వంద మేటి ప్రపంచ చిత్రాలలో నమోదైనాయి. రాముడుగా, కృష్ణుడుగా, వేంకటేశ్వరస్వామిగా అద్భుతంగా నటించి తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకున్నారు ఎన్ టీ ఆర్.
అందుకే, ఆయన నటనకు విరామం పలికి రాజకీయరంగంలో ప్రవేశించినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1982లో స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మాసాలలోనే అధికార పట్టం కట్టారు. 1984లో పదవి కోల్పోయినా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం నిర్వహించి నెలలోగా అధికారంలోకి తిరిగి వచ్చారు. 1985లో ఇందిర హత్య ఫలితంగా ఆమెకు అనుకూలంగా దేశవ్యాప్తంగా ప్రభంజనం వీస్తున్నప్పటికీ శాసనసభను రద్దు చేసి ఎన్నికలు జరిపించి అపూర్వమైన విజయం సాధించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల 1989లో ఓడిపోయినప్పటికీ 1995లో అఖండ మెజారిటీ సాధించి మరల అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. 1983లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. ప్రకటించినవన్నీ నిజాయితీగా అమలు చేశారు. 1994లో తన కుటుంబాన్నీ, పార్టీలోని కొందరు బలవంతులైన నాయకులనూ ధిక్కరించి తన నిర్ణయం ప్రకారం లక్ష్మీపార్వతి అనే ఒక సామాన్యురాలిని పెళ్ళి చేసుకున్నారు. ఆమెతో కలసి ఎన్నికల ప్రచారం చేశారు. సభలలో ఆమె చేత మాట్లాడించారు. ప్రజలు జేజేలు పలికారు. అద్భుతమైన విజయం అందించారు.
ఇది చదవండి: నందమూరి తారక రామారావు – ఒక చరిత్ర
లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా అభివర్ణిస్తూ ఆమె పైన పత్రికలు దాడి చేశాయి. తెలుగుదేశం పార్టీలో కుటుంబం, అసమ్మతివర్గం నారా చంద్రబాబునాయుడు నాయకత్వం కిందికి వచ్చాయి. లక్ష్మీపార్వతి ఆధిక్యాన్ని తొలగించాలనే నెపంతో మొదలైన అసమ్మతి కార్యకలాపాలు ఎన్ టి ఆర్ ని గద్దె దించే వరకూ వెళ్ళాయి. 1 సెప్టెంబర్ 1995న నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. పార్టీలో అత్యధికులను తనవైపు తిప్పుకున్నారు. పదవి కోల్పోయిన ఎన్ టిఆర్ కొన్ని మాసాలలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో గెలిచి తానేమిటో నిరూపించుకోవడానికి సన్నాహాలు చేస్తున్న దశలో, విజయవాడలో మహాసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో హైకోర్టు తీర్పులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. అన్ని ప్రతికూల పరిణామాల నడుమ నిలువెత్తు మనిషి గుండె పోటుతో 18 జనవరి 1996న కుప్పకూలారు. నటరత్న, తెలుగువారి ఆత్మగౌరవానికి ఆనవాలు, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు ఎన్ టి రామారావు శాశ్వతంగా కన్నుమూసి జనవరి 18నాటికి పాతికేళ్ళు. ఈ సందర్భంగా సభలూ, సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం ప్రయత్నిస్తున్నది. ప్రతి తెలంగాణ జిల్లాలో టీడీపీ కార్యకర్తలు అన్నదానం చేయాలంటూ ఎల్ రమణ పిలుపు నిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాయకత్వంలో ఎన్ టి ఆర్ వర్దంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.