- జనవరి 19న మరోసారి భేటీ
- చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధమన్న తోమర్
- ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన రైతు సంఘాలు
సాగు చట్టాలపై రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తొమ్మిదో సారి జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. రైతుల తరపున 41 రైతు సంఘాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే చట్టాల రద్దుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు అభ్యంతరం ఉన్న అంశాలపై సవరణలకు ఎల్లప్పుడూ సిద్ధమని కేంద్ర మంత్రులు చెబుతున్నారు.
ప్రభుత్వం కక్షసాధింపుచర్యలపై రైతుల అసహనం:
చర్చల సందర్భంగా హర్యానా, పంజాబ్ రైతులపై దర్యాప్తు ఏజెన్సీలు పలు కేసులు బనాయిస్తున్న అంశాన్ని రైతుల సంఘాల నేతలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఓ వైపు చర్చలు జరుగుతున్నా ఎన్ఐఏతో దాడులు, రైతు ఆందోళనల్లో ఉగ్రమూకలు ప్రవేశించారని ఆరోపణలు చేయడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లాంటి చర్యలపై రైతు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
19న మరోసారి భేటి:
చర్చలు నిర్ణయాత్మకంగా జరగలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 19న మరోసారి చర్చలు జరపనున్నట్లు తోమర్ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా టీకాల పంపిణీకి సర్వం సిద్ధం