- ఆందోళన కలిగిస్తున్న అశ్విన్ ఫిట్ నెస్
- పేస్ బెర్త్ కోసం శార్దూల్ తో నటరాజన్ పోటీ
బ్రిస్బేన్ టెస్ట్ సమీపిస్తున్న కొద్దీ భారత ఆటగాళ్ల గాయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అరడజనుమంది కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైన నేపథ్యంలో స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిట్ నెస్ సైతం అనుమానాస్పదంగా మారింది.
వెన్నెముక నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించి… సిడ్నీటెస్టును డ్రాగా ముగించడంలో ప్రధానపాత్ర వహించిన అశ్విన్…మరికొద్దిగంటల్లో ప్రారంభంకానున్న ఆఖరి టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చునని…ఒకవేళ అశ్విన్ వెన్నెముక నొప్పితో జట్టుకు దూరమైతే…అతని స్థానంలో తమిళనాడుకే చెందిన మరో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకోడం ఖాయమని భావిస్తున్నారు.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో స్పెషలిస్ట్ బౌలర్ గా పేరుపొందిన సుందర్ కు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. 532 పరుగులు సాధించడంతో పాటు…30 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. ఎడమచేతివాటం బ్యాట్స్ మన్ గాను, ఆఫ్ స్పిన్ బౌలర్ గాను జట్టుకు సుందర్ సేవలు అందించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న సుందర్ ఇప్పటికే టీ-20 క్రికెట్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సైతం పాల్గొనే అవకాశం సుందర్ కోసం వేచిచూస్తోంది.
Also Read : దేశవాళీ టీ-20 క్రికెట్లో రికార్డుల మోత
మరోవైపు…పేస్ బౌలింగ్ బెర్త్ కోసం శార్ధూల్ ఠాకూర్, యార్కర్ల కింగ్ నటరాజన్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసే సమయానికి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో…బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరిగే ఆఖరిటెస్టు… ఇరుజట్లకూ ‘డూ ఆర్ డై’గా మారింది.