- కార్యకర్తలను పరామర్శించిన సంజయ్
- సీఐ, మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడిచేస్తామన్న బండి
బీజేపీ ఛలో జనగామ ఉద్రిక్తంగా మారింది. నిన్న (జనవరి 12) జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఛలో జనగామకు బీజేపీ పిలుపునిచ్చింది. పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలకు పరామర్శించేందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ చౌరాస్తా నుంచి ఆసుపత్రికి ప్రదర్శనగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
డీసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత:
ఆసుపత్రిలో బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన సంజయ్ వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బండి సంజయ్ జనగామ పోలీస్ స్టేషన్ నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లారు. డీసీపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు హఠాత్తుగా గేట్లు ఎక్కి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళన కారులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక
సీఐపై చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్:
బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జికి పాల్పడ్డ సీఐపైనా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఉంచి స్వామి వివేకానంద ఫ్లెక్సీలు తొలగించిన జనగామ మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేపట్టిన కార్యకర్తలపై విచక్షణ మరిచిపోయి పోలీసులు లాఠీఛార్జి చేశారని సంజయ్ ఆరోపించారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తాం:
రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు ఆపకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సీఎం ఫామ్ హౌన్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ యత్నం