- భారతజట్టుపైన గాయాలపిడుగు
- బ్రిస్బేన్ టెస్ట్ కు రిజర్వ్ ఆటగాళ్లతోనే పోరు
ఆస్ట్ర్రేలియాలో భారతజట్టు రెండుమాసాల పర్యటన ముగియక ముందే…ఆటగాళ్ల గాయాల చిట్టా మ్యాచ్ మ్యాచ్ కూ పెరిగిపోతూ వస్తోంది. బ్రిస్బేన్ వేదికగా ఈనెల 15న ప్రారంభంకానున్న కీలక ఆఖరి టెస్టు బరిలోకి స్ట్రయిక్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లేకుండానే దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గల్ఫ్ దేశాలు వేదికగా జరిగిన 7వారాల ఐపీఎల్ తర్వాత…ఆస్ట్ర్రేలియా రెండు మాసాల పర్యటనకు వెళ్లిన భారతజట్టు కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ఇప్పటికే ప్రధాన ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ,భువనేశ్వర్ కుమార్ గాయాలతో జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు.
ఇదీ చదవండి: టెస్టు క్రికెట్లో రికార్డుల రిషభ్
ఆస్ట్ర్రేలియాతో జరిగిన వన్డే, టీ-20 సిరీస్ లను మిశ్రమఫలితాలతో ముగించిన భారతజట్టు నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో మాత్రం గాయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అడిలైడ్ ఓవల్ లో ముగిసిన డే-నైట్ టెస్ట్ తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయంతో వైదొలిగాడు. ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ ముగియక ముందే మరో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ సైతం గాయం పాలయ్యాడు.
సిడ్నీటెస్టులో ముగ్గురికి గాయాలు…
సిడ్నీ వేదికగా హోరాహోరీగా సాగిన మూడో టెస్టును ఫైటింగ్ డ్రాగా ముగించిన భారత్ మరో ముగ్గురు కీలకఆటగాళ్ళను కోల్పోవాల్సి వచ్చింది. స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎడమచేతి బొటనవేలు చిట్లడంతో ఆఖరిటెస్టుకు దూరమయ్యాడు. మ్యాచ్ ను డ్రాగా ముగించడంలో కీలకపాత్ర వహించిన హనుమ విహారీ సైతం తొడకండరాల గాయంతో కనీసం నాలుగువారాలపాటు ఆటకు దూరంకాక తప్పదని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. అంతేకాదు…భారత తురుపుముక్క ,యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా సైతం గాయాల జాబితాలో చేరిపోయాడు. బుమ్రా ఉదరభాగం కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు, సిరీస్ లోని ఆఖరి టెస్టులో పాల్గొనే అవకాశంలేదని టీమ్ వర్గాలు ప్రకటించాయి.
ఇదీ చదవండి: సిడ్నీటెస్ట్ సూపర్ డ్రా
రిజర్వ్ ఆటగాళ్లతోనే….
టెస్ట్ సిరీస్ కే కీలకంగా మారిన నిర్ణయాత్మక ఆఖరిటెస్టులో భారతజట్టు….ఇప్పటి వరకూ బెంచ్ కే పరిమితమైన నటరాజన్, శార్దూల్ ఠాకూర్, అంతంత మాత్రం ఫామ్ లో ఉన్న మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహాలలో ముగ్గురికి తుదిజట్టులో అవకాశం కల్పించనుంది.
ఫాస్ట్ బౌలర్ల స్వర్గంగా పేరుపొందిన బ్రిస్బేన్ గబ్బాలో భారత్ కు నామమాత్రపు రికార్డు మాత్రమే ఉంది. అలాంటి పిచ్ పైన జరిగే డూ ఆర్ డై టెస్టులో భారత్ పూర్తిస్ధాయి జట్టు లేకుండానే పోటీకి దిగాల్సిరావడం కెప్టెన్ అజింక్యా రహానేకు కత్తిమీద సామే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇదీ చదవండి: భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్