- నాలుగో ఇన్నింగ్స్ హీరో పంత్
నేడు భారత యువజన దినోత్సవం. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశంగా భారత్ ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతితెస్తున్న వారిలో యువకులు సైతం ఎందరో ఉన్నారు. క్రీడారంగంలోనూ అనధికారిక జాతీయక్రీడ క్రికెట్లోనూ స్ఫూర్తిదాయకమైన యువక్రీడాకారులకు కొదవ ఏమాత్రంలేదు. అలాంటి వారిలో యువవికెట్ కీపర్ – బ్యాట్స్ మన్, ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ గురించి మాత్రమే ముందుగా చెప్పుకోవాలి. సిడ్నీవేదికగా ఆస్ట్ర్రేలియాతోముగిసిన మూడోటెస్టు మ్యాచ్ లో హీరోచితంగా ఆడిన 22 సంవత్సరాల రిషభ్ పంత్ నెలకొల్పిన అరుదైన రికార్డులు అన్నీఇన్నీ కావు.
రచ్చగెలిచిన రిషభ్ ….
స్వదేశీ పిచ్ లపైన టన్నులకొద్దీ పరుగులు సాధించే భారత స్టార్ క్రికెటర్లు చాలామంది…విదేశీ స్వింగ్,బౌన్సీ పిచ్ లపైన తేలిపోతూ ఉంటారు. ఇంటగెలిచినా రచ్చగెలవలేక వెలవెలబోతున్నారు. అయితే…భారత యువఆటగాడు రిషభ్ పంత్ మాత్రం దానికి భిన్నంగా విదేశీ పిచ్ లపైన…అదీ అత్యంత క్లిష్టమైన నాలుగో ఇన్నింగ్స్ లో అత్యుత్తమంగా రాణిస్తూ పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకొన్నాడు.
సిడ్నీకింగ్……
ఆస్ట్రేలియాలోని ఫాస్ట్ ,బౌన్సీ పిచ్ లపైన టెస్ట్ క్రికెట్ ఆడటం అంటే కొమ్ములు తిరిగిన బ్యాట్స్ మన్ కైనా అసలుసిసలు సవాలే. అలాంటి వికెట్ల పైన బ్యాటింగ్ చేయడం,ప్రత్యర్థి బౌలర్లు విసిరే సవాళ్ళను దీటుగా ఎదుర్కొనడంలో రిషభ్ పంత్ తనకుతానేసాటిగా నిలుస్తున్నాడు.
ఇదీ చదవండి: సిడ్నీటెస్ట్ మూడోరోజున అశ్విన్ ప్రపంచ రికార్డు
సిడ్నీలో కొద్దిగంటల క్రితమే ఆస్ట్ర్రేలియాతో ముగిసిన మూడోటెస్టు ఆఖరి ఇన్నింగ్స్ లో రిషభ్ పంత్ చెలరేగిపోయాడు.కేవలం 118 బాల్స్ లో 12 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 97 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాగడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా రికార్డుల్లో చేరాడు. ఇప్పటి వరకూ భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. ఇప్పటి వరకూ కిర్మానీ 471 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా ఈ రికార్డును రిషభ్ తెరమరుగు చేయగలిగాడు.
నాలుగో ఇన్నింగ్స్ మొనగాడు….
ప్రస్తుత సిరీస్ లోని సిడ్నీటెస్ట్ నాలుగో ఇన్నింగ్స్ లో 97 పరుగుల స్కోరు సాధించడం ద్వారా…కంగారూగడ్డపై తన పరుగుల సంఖ్యను 512కు రిషభ్ పెంచుకొన్నాడు.
ఇదీ చదవండి:సిడ్నీటెస్ట్ సూపర్ డ్రా
తొలి ఇన్నింగ్స్‌లోనూ 36 పరుగులు చేసిన పంత్.. ఆస్ట్రేలియా వికెట్లపై 56.88 సగటు సాధించడం విశేషం. ఇక టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో తొలి రెండు స్కోర్లు సైతం రిషభ్ పంతవే. గతంలో 2018లో ఇంగ్లండ్ గడ్డపై 114 పరుగుల స్కోరు సాధించిన పంత్.. తాజాగా ఆసీస్‌పై 97 పరుగులు చేశాడు. అతని తర్వాత ఇంగ్లండ్‌పై 2007లో ధోనీ చేసిన 76 పరుగులు, 2016లో ఇంగ్లండ్‌పై పార్థివ్ పటేల్ చేసిన 67 పరుగులు ఉన్నాయి.
వాలీ హామండ్స్ ను మించిన పంత్….
ఆస్ట్ర్రేలియా వేదికగా పంత్ ఆడిన గత పది వరుసఇన్నింగ్స్ లో 25, 28, 36, 30, 39, 33, 159, 29, 36, 97 పరుగులు చేయడం విశేషం. అంతేకాదు…ఆస్ట్రేలియాలో 9 వరుస టెస్టు ఇన్నింగ్స్‌లో 25, అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా పంత్ నిలిచాడు. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఇన్నింగ్స్‌తోనే పంత్ ఈ రికార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ వాలీ హామండ్ పేరుతో ఉన్న రికార్డును సైతం పంత్ అధిగమించాడు.
వారేవ్వా! రిషభ్ పంత్…..
ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్ ల్లో అత్యుత్తమంగా రాణించిన విదేశీవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ మాత్రమే. రిషబ్ పంత్ బ్యాటింగ్ సగటు 56.88 గా నమోదయ్యింది. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఇంత సగటు సాధించిన వికెట్ కీపర్ మరొకరు లేరు. రెండేళ్ల క్రితం సిడ్నీ టెస్టులో 159 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన రిషభ్ పంత్ …. సిడ్నీలో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లో 146 సగటు సాధించడం మరో అరుదైనరికార్డుగా నిలిచిపోతుంది. వికెట్ కీపర్ గా అంతంత మాత్రంగా రాణిస్తున్న రిషభ్ పంత్ …దూకుడుగా ఆడే బ్యాట్స్ మన్ గా భారత క్రికెట్ కు వన్నె తెస్తున్నాడు. కేవలం 22సంవత్సరాల వయసులోనే ఇంతగా రాణిస్తున్నరిషభ్ కోట్లాదిమంది భారత యువకులకు నిజమైన ప్రతినిధి అనడంలో ఏమాత్రం సందేహంలేదు.
ఇదీ చదవండి: నేలవిడిచి సాములో భారత్ సరికొత్త రికార్డు