ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికా. అందునా సుప్రీం కోర్టు, సెనెట్, ప్రతినిధుల సభ ఉండే మహాభవనం అమెరికాలోని “క్యాపిటల్”. అటువంటి భవనంపై దాడి జరిగింది. ట్రంప్ మద్దతుదారులు ఈ భవనాన్ని ముట్టడించి అల్లకల్లోలం చేశారు. ఛాంబర్ల లోనికి ప్రవేశించడానికి విఫలం యత్నం చేశారు. ఆందోళనకారులు – పోలీసుల మధ్య భీకరంగా పోరు జరిగింది. కాల్పులు జరిగాయి. ఈ ఘర్షణలో ఇంతవరకూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. లోపలున్న ఉభయ సభల సభ్యులు కొన్ని గంటలపాటు భయంతో బిక్కు బిక్కుమంటూ బతికారు.
రెండు శతాబ్దాలలో ఇదే ప్రథమం
రెండు శతాబ్దాల పైగా చరిత్ర కలిగిన క్యాపిటల్ భవనంపై ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారి. ప్రపంచమంతా ఈ సంఘటనకు విస్తుబోయింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే జో బైడెన్ గెలుపును ధృవీకరించే ప్రక్రియను అడ్డుకోవడం కోసం ట్రంప్ మద్దతుదారులు చేసిన పతాక స్థాయి ఆందోళనల ఫలితం. దాదాపు నాలుగు గంటలపాటు హింసాత్మక వాతావరణం నెలకొంది. సభ్యులు ఆత్మరక్షణ కోసం భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. అధ్యక్ష పీఠం నుండి దిగకుండా ఉండడానికి, జో బైడెన్ గెలుపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా డోనాల్డ్ ట్రంప్ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. గతంలో ఫలితాల సమయంలోనూ తన ఆందోళనకారులతో నానా యాగీ చేయించారు.
కుదురులేని మనిషి
ఒక్కొక్కసారి ఒప్పుకుంటున్నట్లు మాట్లాడారు. మళ్ళీ నాలుగురోజుల తర్వాత విరుద్ధంగా మాట్లాడుతూ తన ఓటమిని ససేమిరా అంగీకరించకుండా ట్రంప్ వ్యాఖ్యలు చేసేవారు. ఇదే తంతు ఇప్పటి వరకూ కొనసాగింది. మరో రెండు వారాల్లో, 20వ తేదీనాడు, కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ సింహాసనాన్ని అధిరోహించే సమయం ఆసన్నమైంది. దాన్ని ఎట్లాగైనా అడ్డుకోవాలన్నది ట్రంప్ పట్టుదల. అది నేడు పరాకాష్టకు చేరింది. తన మద్దతుదారులను ఎగేసి క్యాపిటల్ భవనంపై దాడికి దించారు.
ట్రంప్ వికృతరూపానికి పరాకాష్ఠ
ఆందోళనకారులు రెచ్చిపోయారు. అద్దాలు పగలగొట్టారు. ట్రంప్ టెంపరితనానికి, వికృతరూపానికి ఇది పరాకాష్ట. ఈ చర్యతో సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులు, కేబినెట్ కూడా అసహ్యయించుకునే పరిస్థితి వచ్చింది. క్యాపిటల్ భవనాన్ని కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నారు. మళ్ళీ ఉభయ సభల సంయుక్త సమావేశం ఆరంభమైంది. ఇప్పటికే జో బైడెన్ ఆధిక్యం నిరూపితమైంది. లాంఛనంగా ఉభయ సభలు సమావేశమై గెలుపును ధృవీకరించే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టారు.
బైడెన్ పట్టాభిషేకం లాంఛనమే
జో బైడెన్ అధ్యక్షుడుగా పీఠంపై కూర్చోడం ఇక లాంఛనమేనని అందరికీ తెలిసిందే. ఇంతలో ఈ ఉపద్రవం అమెరికాను కదిలించింది.తన వికృత చర్యలతో ఇప్పటికే ట్రంప్ చెడ్డపేరు మూటగట్టుకున్నాడు. నేటి ప్రతీకార చర్యతో,20వ తేదీ దాకా కూడా అధ్యక్షుడు స్థానంలో కూర్చోకుండా, దించే దుస్థితి తెచ్చుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పై వేటుకు రంగం సిద్ధమవుతోంది. వేటు అంశంపై కేబినెట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ ను అధ్యక్ష స్థానం నుంచి తొలగించడానికే ట్రంప్ కేబినెట్ కూడా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ పైన వేటు పడుతుందా?
పదవిలో ఉన్న అధ్యక్షుడిని తొలిగించడానికి అమెరికా విధానాల ప్రకారం రెండు మార్గాలు వున్నాయి. అభిశంసన తీర్మానం ఒకటి. రాజ్యాంగంలోని 25వ సవరణ అధికారం రెండవది. ఈ రెండింటిలో ఏది జరిగినా, కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకునేంత వరకూ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడి హోదాలో తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. రెండవ మార్గమైన 25వ సవరణ అధికారం విషయంపై కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం. పాలనపై ట్రంప్ నియంత్రణ కోల్పోయారని, అందుకే ఆయన్ను పదవి నుంచి తొలిగించాలని ఆయన సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు కూడా భావించడం అత్యంత అవమానకరమైన విషయం.
సొంత పార్టీలో చుక్కెదురు
జో బైడెన్ ఎన్నికను వ్యతిరేకించాలంటూ సొంత పార్టీ మద్దతును కూడగట్టుకొనే ప్రయత్నం చేపట్టిన ట్రంప్, దాన్ని పూర్తి స్థాయిలో సాధించలేక పోయారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానంటూ ట్రంప్ మాటలను కొట్టిపారేశారు. దీంతో అదే పార్టీకి చెందిన మైక్ పెన్స్ ప్రతిష్ఠ చిరస్థాయిగా నిలిచిపోతుంది.నేటి దుర్ఘటనతో ట్రంప్ పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది.గతంలో 2019లో ఉక్రెయిన్ అంశంలో ఒకసారి ట్రంప్ పై అభిశంసన తీర్మానం వచ్చింది. దిగువ సభలో డెమోక్రాటిక్ సభ్యుల బలం ఎక్కువ ఉండడం వల్ల అది నెగ్గింది.2020ఫిబ్రవరిలో రిపబ్లికన్స్ కు ఆధిపత్యం వున్న సెనెట్ లో అది వీగిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అటువంటిది కాదు.
స్వయంకృతాపరాధం
సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులు, డెమోక్రాటిక్ సభ్యులు ట్రంప్ పై వేటుకు ఓటు వేస్తున్నారు. మొత్తంమీద, ఘోరమైన అవమానకర పద్ధతిలో ట్రంప్ పెద్ద భంగపాటుతో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇది స్వయంకృత అపరాధం. అమెరికా చరిత్రలోనే మాయని మచ్చ. అమెరికాలో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కాలంలో తేలిపోతాయి. మితిమీరిన అహంకారం, అతి అధికార కాంక్షతో అధర్మ, ఆవేశ మార్గాలు ఎంచుకుంటే ఎంత పెద్ద నేతకైనా భంగపాటు తప్పదని ట్రంప్ తీరు గట్టిగా చెబుతోంది.