అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఏబీవీ దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారంనాడు విచారణ జరిపింది. తొందరపడి ఏబీవీని అరెస్టు చేయరాదని పోలీసులకు ఉన్నత న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో కొన్ని పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయనీ ఆరోపిస్తూ, తనను బాధ్యుడిని చేస్తూ అరెస్టు చేయాలనీ, ఆ తర్వాత తనను మరోసారి సస్పెండ్ చేయాలనీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తున్నదని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.
ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం
అసలు కేసు నమోదు కాకుండానే అరెస్టు చేస్తారంటూ ఆరోపణ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేయడం అన్యాయమని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.
ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు ఇటీవల రాసిన ఒక లేఖలో ఏబీవీ ప్రభుత్వం ఏదో ఒక కారణంపైన తనను అరెస్టు చేసి 48 గంటలు రిమాండ్ లో ఉంచి, ఆ కారణంపైన సస్పెండు చేయాలనే దురాలోచన చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం అక్రమం జరిగినట్టు వాదిస్తున్న అక్రమం జరిగే అవకాశమే లేదనీ, కొనుగోలు చేశామని చెబుతున్న పరికరాలు కొనుగోలు చేయలేదనీ, ప్రభుత్వం ఒక్క రూపాయ కూడా ఖర్చు చేయలేదనీ, ఒక్క రూపాయ ఎవరి జేబులోకీ వెళ్ళలేదనీ, ప్రభుత్వం పనికట్టుకొని తనను అవమానిస్తున్నదనీ, వేధిస్తున్నదనీ ఏబీవీ తోటి అధికారికి రాసిన లేఖలో ఆవేదన వెలిబుచ్చారు.
ఇది చదవండి: న్యాయం చేయండి : ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కు ఏబీవీ లేఖ