- ఛలో రామతీర్థానికి మరోమారు బీజేపీ పిలుపు
- బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట
- సొమ్మసిల్లిన సోము వీర్రాజు
- రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు
విజయనగరం జిల్లా రామతీర్థం రాజకీయ రంగు పులుముకుంటోంది. రెండ్రోజుల క్రితం సోము వీర్రాజు అరెస్టుతో బీజేపీ ఆందోళనబాట పట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ రామతీర్థం ధర్మయాత్రకు మరోమారు పిలుపునివ్వడంతో నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామతీర్థం చేరుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహరావులను ర్యాలీగా బయలుదేరి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నంలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లు సొమ్మసిల్లిపడిపోయారు.
ఇది చదవండి: దేవాలయాలపై దాడులను ఉపేక్షించం-చంద్రబాబు
రాముడ్ని దర్శించుకు తీరతాం:
ఎలాంటి పరిస్థితులనైనా ఎదురొడ్డి రామతీర్థం ఆలయాన్ని సందర్శించి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రామతీర్థం జంక్షన్ దగ్గర బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ నేతలు చేపట్టిన ఛలో రామతీర్థం ర్యాలీలకు ఆందోళనలకు అనుమతిలేదని తెలిపినా బీజేపీ శ్రేణులు పట్టు వీడటంలేదని పోలీసులు తెలిపారు.
ఇది చదవండి: తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం
రామతీర్థం వద్ద, విజయనగరం డివిజన్ లో ఈ నెలాఖరు వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు గతంలోనే ప్రకటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రామతీర్థం కూడలి నుంచి దేవస్థానం వరకు, బోడికొండపై కోదండరాముని ఆలయం వద్ద పోలీసులు బలగారలు గస్తీ తిరుగుతున్నాయి. సీతారాముని పేట కూడలి వద్ద వాహనాలను దారిమళ్లిస్తున్నారు. కొండపైకి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటుచేశారు.
ప్రభుత్వం పక్షపాత ధోరణి:
టీడీపీ అధినేత చంద్రబాబును ఆలయం సందర్శించేందుకు అనుమతించిన ప్రభుత్వం బీజేపీ శ్రేణులను కొండపైకి వెళ్లకుండా అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని సోము వీర్రాజు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇది చదవండి: ఉద్రిక్తంగా బీజేపీ, జనసేన ఛలో రామతీర్థం