- ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక
- జనవరి 11న నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక ఖరారైంది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరడంతో తన ఎమ్మెల్సీ పదవితోపాటు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేయడానికి షెడ్యూల్ విడుదల చేసింది. శాసన సభ్యుల కోటాకు చెందిన ఎమ్మెల్సీకి సంబంధించి ఈ నెల 11 న నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 18 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జనవరి 19న జరగనుంది. నామినేషన్లు ఉపసంహరణ జనవరి 21న జరగనుంది. పోలింగ్ ఈ నెల 28 న జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆశావహుల ఎదురుచూపులు:
ఎమ్మెల్సీ స్థానంపై అధికార పార్టీ నుంచి పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పోతుల సునీతకే మళ్లీ జగన్ అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఇటీవల మరణించిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎంపికలో పోతుల సునీతతో పాటు బల్లి దుర్గా ప్రసాద్ పేరు కూడా పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల కరోనాతో మృతిచెందిన చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు చల్లా భగీరథ రెడ్డికూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు నేతలు రేసులో ఉండటంతో వీరిలో ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఇది చదవండి: జగన్ ఫిర్యాదుపై జస్టిస్ రమణ స్పందన కోరిన సుప్రీం చీఫ్ జస్టిస్