కోవిద్ ప్రజలకు ప్రాణాంతకమైన వ్యాధి అయితే రాజకీయ నాయకులుకు ఒక అవకాశం కూడా. కరోనా వైరస్ ను ప్రజలు ఎదుర్కొన్నారు. దాని బారిన పడి వేలమంది మరణించారు. ప్రధాని నరేంద్రమోదీ కొన్ని గంటలైనా వ్యవధి ఇవ్వకుండా లాక్ డౌన్ ప్రకటిస్తే ఉద్యోగాలు కోల్పోయిన వలస కార్మికులు సొంత ఊళ్ళకు కాలినడకన బయలు దేరి కొందరు మార్గమధ్యంలో మృత్యువాత పడ్డారు. మరికొందరు అష్టకష్టాలూ పడి తమ గ్రామాలకు చేరుకొని నిరుద్యోగులుగా బతుకులు వెళ్ళదీస్తున్నారు. వీరిని ఆదుకున్న ప్రభుత్వం లేదు. వీరి గురించి మాట్లాడిన ముఖ్యమంత్రికానీ, కేంద్రమంత్రికానీ లేరు. ప్రధానిసైతం వలస కార్మికుల యాతన గురించి పట్టించుకోలేదు. కరోనా కాటేసిన తర్వాత జరిగిన బీహార్ ఎన్నికలలో బీజేపీ గెలుపొందింది కనుక కరోనా సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు ఆమోదించారంటూ ‘ప్రధాన స్రవంతి’ మీడియా భజన చేస్తున్నది.
కరోనా ఒక అవకాశం
కరోనా వైరస్ కు విరుగుడుగా టీకా మందు ఉత్పత్తి చేసే అవకాశం ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారత్ కు ఎక్కువగా ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ మొదటినుంచి కృతనిశ్చయంతో ఉన్నారు. మాటిమాటికీ మన్ కీ బాత్ చెప్పడం, కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు సామాజికదూరం పాటించాలనీ, మూతులకు మాస్క్ ధరించాలనీ విజ్ఞప్తులు చేయడానికి టీవీ మాధ్యమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కోవిద్ పైన పోరాటానికి తాను నాయకత్వం వహిస్తున్నట్టు మోదీ ప్రజలను నమ్మించగలిగారు. భారత్ లో సహజమైన వాతావరణం, గాలి, వేడి కారణంగా కోవిద్ ప్రభావం పరిమితంగానే పని చేసిందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
Also Read : కొవాగ్జిన్ కోసం క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు
దృష్టి మరల్చడానికేనా?
కోవిద్ ను వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఆర్థికరంగంలో, వ్యవసాయరంగంలో తన వైఫల్యాలపైన ప్రజల దృష్టి పడకుండా జాగ్రత్తపడింది. కోవిద్ ను ఉపయోగించుకొని మూడు వ్యవసాయ బిల్లులకూ హడావిడిగా పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలు చేసింది. కోవిద్ ను అరికట్టడానికి టీకాలు తయారు చేసే హైదరాబాద్, పూణె కంపెనీలను సందర్శించడం కోసం ప్రధాని స్వయంగా యాత్ర చేసి కోవిద్ పోరాటంలో అందరికంటే ముందున్నాననే అభిప్రాయం, ముందున్నామనే అభిప్రాయం ప్రజలకు కలిగించారు. జనవరి 26వ తేదీ కల్లా కోవిడ్ పైన టీకా మందును భారత్ కంపెనీలు కనిపెట్టాలని ప్రభుత్వం కోరుకుంది. అందుకని కోవిషీల్డ్ ఉత్పత్తి చేయడానికి పుణె లోని సీరం ఇన్ స్టిట్యూట్ కూ, కోవాగ్జిన్ తయారు చేసేందుకు హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ కు అనుమతులను ఆదివారంనాడు ఆదరాబాదరాగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆప్ ఇండియా ఇచ్చివేశారు. దీనిని ఘనవిజయంగా ప్రధాని ట్వీట్ చేశారు. తన ‘మేడ్ ఇన్ ఇండియా’ విధానానికి ప్రతీకగా టీకా విజయాన్ని చాటుకుంటున్నారు.
పారదర్శకత లేకపోవడం ఆందోళనకరం
టీకా మందు తయారీని నియంత్రించవలసిన సంస్థలు పారదర్శకత లేకుండా వ్యవహరించడం, అత్యవసర పరిస్థితులలో వినియోగానికంటూ అనుమతులు మంజూరు చేయడం అంతర్జాతీయంగా అనుమానాలకు తావిస్తున్నది. కోవాగ్జిన్ కి మూడవ దశ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇవ్వడం పట్ల సందేహాలు వెలిబుచ్చిన కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరాంరమేష్ లను దాదాపు దేశద్రోహులుగా, భారత దేశం ప్రగతిని చూసి సహించలేని కుళ్ళుబోతులుగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. ఇటువంటి విషయాలలో ప్రజల విశ్వాసం చూరగొనాలంటే పారదర్శకత చాలా అవసరం.
Also Read : టీకాల అనుమతిపై రాజకీయ వివాదం
అమెరికాలో పాటించే పద్ధతితో పోల్చుకోవాలి
భారత్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ వ్యవహరించిన తీరుకూ అమెరికాలో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ),ఇంగ్లండ్ లోని నియంత్రణ వ్యవస్థలు పని చేస్తున్న తీరుకూ హస్తిమశకాంతరం ఉంది. ఫైజర్, మోడెర్నా మందులకు సంబంధించిన వివరాలను చర్చించే సలహాసంఘం సమావేశాన్ని అమెరికాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఆ తర్వాతనే ఎమర్జేన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ)కు అనుమతించారు. టీకా తయారు చేయడానికి శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధన, ఇతర కార్యక్రమాల వివరాలను సంపూర్ణంగా వెల్లడించారు. ఇంగ్లండ్ లో కూడా నియంత్రణ సంస్థ ఫైజర్, కోవిషీల్డ్ లకు అత్యవసర వినియోగం అనుమతి మంజూరు చేసే ముందు వాటి వివరాలను బహిరంగంగా చర్చించారు.
డాక్టర్ ఎల్లా ఆవేదన
కోవిషీల్డ్ టీకా మందును ప్రయోగాత్మకంగా 1,600 మందికి ఇంజక్షన్ చేశారు. ఈ టీకా ఎంతవరకూ భద్రమో తెలుసుకోవడం, దానికి ఎంత సామర్థ్యం ఉన్నదో పరిశీలించడం ఈ పరీక్ష ఉద్దేశం. భారత దేశంలో చేసిన ప్రయోగాల వివరాలను సేకరించవలసిన బాధ్యత సీరం ఇన్ స్టిట్యూట్ ది. ఆ పని చేయకుండా ఇంగ్లండ్ లో సేకరించిన డేటా ఆధారంగా అనుమతి మంజూరు చేయడం అక్రమం. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజనీకా కలిసి తయారు చేసిన కోవిషీల్డ్ కూ, భారత్ బయోటెక్ రూపొందిన కోవాగ్జిన్ కూ జనవరి ఒకటి, రెండో తేదీలలో భారత సాధికార సంస్థ అనుమతి మంజూరు చేసింది. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన టీకా మందు గురించీ, మూడవ స్థాయి ప్రయోగాల ఫలితాలు రాకమునుపే దానికి అనుమతి మంజూరు చేయడం గురించీ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. పూణె సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో పూనావాలా కూడా భారత్ బయోటెక్ టీకా నీటివంటిదేననీ, ప్రమాదకారి కాదనీ ఎద్దేవా చేశారు. మర్నాడు భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్లా కృష్ణ మీడియా గోష్ఠిలో తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చారు. తనకేమీ గేట్స్ ఫౌండేషన్ నుంచి నిధుల అందడం లేదనీ, సొంత ఖర్చుతో రెండు కోట్ల డోసుల టీకా మందు తయారు చేశామనీ, టీకా మందులు తయారు చేయడంలో తమ సంస్థకు ఉన్న అనుభవం ప్రపంచంలో మరే సంస్థకంటే తక్కువకాదనీ గెల్లా వ్యాఖ్యానించారు. ‘భారత ఫార్మా కంపెనీలకు తక్కువచేసి చూపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ భారత బయోటెక్ ఫైజర్ కంటే తక్కువేమీ కాదు. మేము ఇప్పటికే 16 వాక్సీన్లు తయారు చేశాం,’ అంటూ డాక్టర్ ఎల్లా సగర్వంగా చాటుకున్నారు. కొవాగ్జిన్ టీకా గురించి అనవసరమైన ఆందోళన వద్దనీ, తొలిటీకా తానే తీసుకుంటాననీ తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర హామీ ఇచ్చారు.
Also Read : ఇది టీకానామ సంవత్సరం
కోవీషీల్డ్ విషయంలోనూ అనుమానాలు
కోవీషీల్డ్ ని అనుమతించిన తీరు కూడా అమోమయంగానే ఉన్నదని వెల్లూరు లో వెల్ కం ట్రస్ట్ రీసెర్చె లాబోరేటరీలో ప్రొఫెసర్ గా, కోవిడ్ ను ఎదుర్కోవడంలో సంసిద్ధ సంస్థల సమన్వయ సంస్థ ఉపాధ్యక్షురాలు డాక్టర్ గగన్ దీప్ కాంగ్ వ్యాఖ్యానిస్తున్నారు. రెండు టీకా మందులనూ ఆమోదించిన తీరు తనకు అయోమయంగా కనిపిస్తున్నదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ప్రయోగించిన పదజాలంపట్ల డాక్టర్ కాంగ్ అభ్యంతరం చెప్పారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు కూడా డీసీజీఐ అధిపతి.
ట్రయల్స్ పూర్తి కాకుండానే అనుమతా?
‘‘ కొవీషీల్డ్ వాక్సీన్ ను ఆమోదిస్తూ వారు ఉపయోగించిన భాషను నేను అర్థం చేసుకోగలను. కానీ కొవాగ్జిన్ ను అనుమతిస్తూ ప్రయోగించిన భాష చాలా సంక్లిష్టంగా ఉంది. క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న వాక్సీన్ (కొవాగ్జిన్)ని అనుమతించడం తన పెక్కు దశాబ్దాల అనుభవంలో ఎన్నడూ చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. డీసీజీఐ డాక్టర్ సొమానీ జనవరి 3న కొవాగ్జిన్ కి అనుమతి మంజూరు చేస్తూ వాడిన పదజాలం క్యూడ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019లో ఎక్కడా లేదని అన్నారు. రెండు టీకా మందుల సామర్థ్యం, ఇమ్యూనిటీ గురించి ప్రవీణుల బృందం పరిశీలించింది. మ్యూటాంట్ స్ట్రెయిన్ ఇన్ ఫెక్షన్ వచ్చినవారికి ఇచ్చేందుకు ఈ టీకా మందును వినియోగించే విషయం ప్రవీణుల బృందం అధ్యయనం చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న టీకా మందుకు ఉన్నదున్నట్టు వినియోగించేందుకు ఎట్లా అనుమతిస్తారంటూ డాక్టర్ కాంగ్ ప్రశ్నించారు. ‘‘రెండు టీకాలకూ అనుమతిస్తూ చూపించిప పరిమితమైన డేటా (వివరాలు) కూడా సంతృప్తికరంగా, పారదర్శకంగా లేదు,’’ అని ఆమె స్పష్టం చేశారు.
Also Read : కోవాగ్జిన్, ఆస్ట్రాజనీకాలకు అనుమతి మంజూరు
సయోధ్య కుదిరిందా? ఎవరైనా కుదుర్చారా?
‘నేనైతే భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాను వేయించుకోను,‘అంటూ ‘ది వైర్ ’కోసం కరన్ థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ప్రముఖ శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ వ్యాఖ్యానించారు. కోవాగ్జిన్ తయారు చేయడానికి భారత్ బయోటెక్ వేసుకున్న ప్రణాళిక లోపరహితమైనది. కానీ మూడవ దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే కోవాగ్జిన్ అనుమతించడం ఆక్షేపణీయమనీ ఆమె వ్యాఖ్యానించారు. సీరం ఇన్ స్టిట్యూట్ కు చెందిన పూనావాలాతో, భారత్ బయోటెక్ సీఎండి డాక్టర్ ఎల్లా తో దిల్లీ నుంచి ఎవరో మాట్లాడినట్టు ఉన్నారు. ఒకరినొకరు విమర్శించుకోకుండా ఒక్క మాటపైనే నిలబడి దేశప్రతిష్ఠను కాపాడమని ఎవరో చెప్పి ఉంటారు. ఆదివారంనాడు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ నీళ్ళతో సమానమేనంటూ పరోక్షంగా వ్యాఖ్యానించిన పూనావాలా, ‘నాకు బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి డబ్బు రావడం లేదంటూ ఎత్తిపొడిచిన డాక్టర్ ఎల్లా మంగళవారం ఉదయానికల్లా సంతోషంగా సంయుక్త ప్రకటన జారీ చేయడం విశేషం.
దిల్లీ ఆరాటం
టీకా మందుల తయారీ, పంపిణీ, నిర్వహణ ద్వారా పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతున్న ప్రధాని మోదీ, ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ లు రెండు ఉత్పత్తి కంపెనీల ఉన్నతాధికారుల మధ్య సయోధ్య కుదర్చడంతో కృతకృత్యులైనారనే చెప్పాలి. అందరూ అడుగుతున్నది పారదర్శకత పాటించాలనే. ఇప్పటికైనా పారదర్శకంగా ఉండమనీ, డేటా అంతా వెల్లడించడమనీ రెండు కంపెనీలకూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పాలి. ఏ సంస్థ ఏ టీకాకు కితాబు ఇచ్చినా చివరికి ప్రజలకు ఏ టీకాపైన నమ్మకం ఉంటే ఆ టీకానే వేయించుకుంటారు. అమెరికా, ఇంగ్లండ్ లో శాస్త్రజ్ఞులూ, అధికారులూ పాటించిన పారదర్శకతను భారత శాస్ట్రజ్ఞులూ, అధికారులూ పాటించాలని డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. టీకా మందుల సామర్థ్యం మీద, భారత్ బయోటెక్, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనీకా లు డేటాను వెల్లడించాలి. ప్రజలను ఒప్పించాలి.
చైనాకీ, భారత్ కీ తేడా లేదా?
భారత్ లో అనుమతులను హడావిడిగా మంజూరు చేయడాన్ని ప్రపంచం ఎట్లా చూస్తుంది? చైనా, రష్యాలలో టీకా మందు తయారు చేసినట్టే భారత్ లోనూ పారదర్శకత లేకుండా, డేటా వెల్లడించకుండా తయారు చేస్తున్నారని పరిగణిస్తారా? ఇండియాలోనే ఈ రెండు టీకాలు ఉపయోగిస్తే ఇతర దేశాలు పట్టించుకోవు. కానీ ఇతర దేశాలకు ఈ టీకాలను పంపినప్పుడు ఆ దేశాలు ఈ టీకాల ప్రయోగాలు ఎన్ని దశలలో ఎంత సమర్థంగా సాగాయో తెలుసుకుంటాయి. లోగడ భారత్ బయోటెక్ తయారు చేసిన ఒక టీకా మందును విదేశాలు బహిష్కరించాయని గగన్ దీప్ కాంగ్ అన్నారు. సాధికారిక సంస్థలు ఆమోదించిన పద్ధతి వెనుక రాజకీయపరమైన ఒత్తిడి ఉన్నదా అనే అనుమానం పీడిస్తూనే ఉంటుంది.
Also Read : ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా