- సిరాజ్, నటరాజన్…ఇద్దరూ ఇద్దరే…!
క్రికెట్ కి, జీవితానికి దగ్గర సంబంధమే ఉంది. అవకాశాల కోసం కొందరు ఎదురుచూస్తూ ఉంటే…అవకాశాలే కొందరిని వెతుక్కొంటూ రావడం జీవితంలో మాత్రమే కాదు. క్రికెట్ లోనూ మనకు తరచూ కనిపిస్తూ ఉంటుంది.కొద్దివారాల క్రితమే ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్లో అంచనాలకు మించి రాణించడం ద్వారా భారతజట్టులో చోటుసంపాదించిన హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, తమిళనాడు మీడియంపేసర్ నటరాజన్ లను సైతం టెస్టు జట్టులో అవకాశం వెతుక్కొంటూ వచ్చింది. అయితే…ఈ ఇద్దరు యువఫాస్ట్ బౌలర్లు అవకాశం కోసం అసాధారణ త్యాగమే చేయాల్సి వచ్చింది.
తండ్రిమరణాన్ని దిగమింగిన సిరాజ్….
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సిరాజ్…అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ తండ్రి ఆటోడ్రైవర్,… తల్లి పాచిపనులుచేస్తూ ఇంతకాలమూ.. తమ కుటుంబాన్ని పోషించుకొంటూ వచ్చారు. అయితే….క్రికెట్ సంపాదనతో…ఇప్పటికే అమ్మను పని మాన్పించిన సిరాజ్…ఆస్ట్ర్రేలియా పర్యటనకు వెళ్ళిన సమయంలోనే తండ్రిని కోల్పోయాడు. కరోనా, క్వారెంటైయిన్ నిబంధనల కారణంగా స్వదేశానికి వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయాడు. తన ఉన్నతి కోసం పాటుపడిన తండ్రి మరణాన్ని దిగమింగుకొని ఆస్ట్ర్రేలియాలోనే ఉండిపోయాడు.ఆ త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా భారత టెస్టు జట్టులో చోటు సాధించాడు.
ఐపీఎల్ గత మూడుసీజన్లలో …హైదరాబాద్ సన్ రైజర్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లలో సభ్యుడిగా కోట్లరూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల విలువైన సలహాలు, సూచనలతో తన బౌలింగ్ ను అనూహ్యంగా మెరుగుపరచుకొన్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు సిరాజ్ కు ….2 కోట్ల 60 లక్షల రూపాయల ధర చెల్లిస్తే …బెంగళూరు 3కోట్ల రూపాయలకు పైగా ఇస్తోంది.
ఇది చదవండి: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు
సీనియర్ల గాయం జూనియర్లకు వరం
ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్లు గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో అందుబాటులో లేకపోడం 26 సంవత్సరాల హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కు వరంగా మారింది.దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో పాటు గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరపున సత్తా చాటుకోడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్ర్రేలియాతో కంగారూగడ్డపై జరుగుతున్న సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు ఎంపికయ్యాడు. వన్డే, టీ-20 సిరీస్ లకు మాత్రమే ఎంపికైన సిరాజ్ ను టెస్ట్ సిరీస్ కు సైతం కొనసాగించారు.గంటకు 140 కిలోమీటర్ల వేగానికి స్వింగ్ ను జోడించి బ్యాట్స్ మన్ ను కంగుతినిపించే సత్తా సిరాజ్ బౌలింగ్ లోఉంది.
అరుదైన ఘనత
ఆటోరిక్షా డ్రైవర్ కుమారుడి స్థాయి నుంచి భారత టెస్ట్ బౌలర్ స్థాయికి ఎదిగిన సిరాజ్.. టీమిండియా తరపున ఆడిన రెండవ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్. గతంలో సయ్యిద్ అబిద్ అలీ టీమిండియా తరపున ఫాస్ట్ బౌలర్‌గా ఆడాడు. అబిద్ అలీ 1966లో అడిలైడ్‌లో టెస్ట్ లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 55 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా తరపున టెస్టులకు ఆడుతున్న 298వ ప్లేయర్‌గా సిరాజ్ రికార్డుల్లో చేరాడు. మెల్‌బోర్న్ టెస్టు రెండుఇన్నింగ్స్ లోనూ కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా సిరాజ్ జట్టు విజయంలో తనవంతు పాత్ర నిర్వరించాడు.
నెట్ బౌలర్ నుంచి టెస్ట్ బౌలర్ గా…
తమిళనాడులోని ఓ రోజువారీ కూలీ కుటుంబం నుంచి భారత క్రికెట్ లోకి దూసుకొచ్చిన మరో యువఫాస్ట్ బౌలర్ నటరాజన్. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తరపున 2020 ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించిన యార్కర్ల కింగ్ నటరాజన్ భారతజట్టులో చోటు కోసం ఎంతో కాలం వేచిచూడాల్సిన అవసరం లేకపోయింది. ఆస్ట్ర్రేలియా పర్యటనలో భారతజట్టుకు నెట్ బౌలర్ గా సేవలు అందించిన నటరాజన్…కంగారూలతో టీ-20 సిరీస్ లో తనజట్టును విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర వహించాడు.
తన భార్య తొలికాన్పు సమయానికి స్వదేశానికి తిరిగిరావాల్సిన నటరాజన్ జట్టు అవసరాల కోసం ఆస్ట్ర్రేలియాలోనే ఉండిపోవడం కలసి వచ్చింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ తన తొలిబిడ్డ జననం కోసం జట్టును వీడి స్వదేశానికి తిరిగి వస్తే…అదే పరిస్థితిలో ఉన్న నటరాజన్ మాత్రం జట్టుతోనే ఉండిపోయాడు. నటరాజన్ త్యాగం, అంకితభావానికి తగిన ప్రతిఫలం అన్నట్లుగా…సిడ్నీటెస్టులో పాల్గొనే భారత తుదిజట్టులో చోటు దక్కింది.
అటు మహ్మద్ సిరాజ్, ఇటు నటరాజన్ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవారే. తల్లిదండ్రుల త్యాగాలతో అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగినవారే. తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు అవసరాలే ప్రధానమన్న లక్ష్యంతో త్యాగాలు చేసి తగిన ప్రతిఫలం పొందారు. చిరుప్రాయంలోనే భారతటెస్టు జట్టులో చోటు సంపాదించడం ద్వారా దేశంలోని వందలాదిమంది యువక్రికెటర్లకు మార్గదర్శకులుగా నిలిచారు.
ఇది చదవండి:కీర్తి శిఖరంపై క్రికెట్ వీరుడు సచిన్