• 2:1 మెజారిటీతో తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
• కాలుష్యాన్ని తగ్గించాలని కేంద్రానికి సూచన
• హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తప్పనిసరన్న సుప్రీం
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త పార్లమెంటుతో పాటు, సచివాలయం నిర్మాణానికి ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం 2-1 తేడాతో కేంద్ర ప్రభుత్వ వాదనకు మద్దతు తెలిపింది. ప్రాజెక్టు డిజైన్ పై కేంద్ర ప్రభుత్వ వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సక్రమంగానే జరిగినట్లు న్యాయస్థానం తెలిపింది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలు:
అయితే ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఇందుకు గాను స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్ గన్ లను ఉపయోగించాలని ఆదేశించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాలకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి అని వెంటనే అనుమతులు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.
ఇది చదవండి: సరికొత్త పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్పూర్తికి నూతన భవనం ప్రతీక కావాలి
సెంట్రల్ విస్టాను వ్యతికేకిస్తూ పిటీషన్లు:
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్తా ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలు పిటీషన్ల్ దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్ట్ డిజైన్ స్థలం కేటాయింపు వంటి అంశాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం గతంలోనే విచారణ చేపట్టింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. కేంద్ర ప్రభుత్వ వాదనలతో జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ మహేశ్వరీ ఏకీభవించగా జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు. దీంతో 2-1 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పును ఈ రోజు వెలువరించింది.అయితే సుప్రీంలో విచారణ పెండింగులో ఉండగానే సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. తుది తీర్పు వచ్చేదాకా ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని స్పష్టం చేసింది. దీంతో గత సంవత్సరం డిసెంబరు 10న ప్రధాని మోదీ సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన మాత్రమే చేశారు.
జాతీయత ఉట్టిపడేలా నిర్మాణాలు:
పార్లమెంటు భవనాన్ని ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తూ అణువణువూ భారతీయత ఉట్టిపడేలా నిర్మాణ ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. లోక్ సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా కానుంది.
ఇది చదవండి: సెంట్రల్ విస్టా ఆధునిక వసతుల కలబోత