పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. సచిన్ టెండూల్కర్ బాల్యంలోనే క్రికెట్ బ్యాట్ తో తళుక్కున్న మెరిశాడు. మెరిసి ఆగిపోలేదు. అప్పటి నుంచీ కాంతులీనుతూ దేదీప్యమానంగా దినదినప్రవర్థమానమై ప్రకాశిస్తూనే ఉన్నాడు. టెండూల్కర్ 1989 నవంబర్ లో కరాచీలో పాకిస్తాన్ తో ఆడిన భారత జట్టులో తొలిసారి టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన భారతజట్టులో ఆడి కొన్ని శతాకాలు సాధించి క్రికెట్ పండితులను ఔరా అనిపించాడు. అప్పుడే అతడు ప్రపంచ మేటి క్రికెటర్ గా భాసిల్లుతాడని ప్రవీణులు జోస్యం చెప్పారు.
ఔరా అనిపించిన టెండూల్కర్
ఎంత మేటి ఆటగాడైనా ఆటకంటే చిన్నవాడే. కానీ టెండూల్కర్ కి మాత్రం క్రికెట్ కు ఎంత జనాదరణ ఉన్నదో అతడికీ అంతే ఆదరణ ఉంది. అతడు వేరు క్రికెట్ వేరు అనే అభిప్రాయం అతడికి లేదు. ఇతరులకు అటువంటి అభిప్రాయం కలగనివ్వడు. అతడు క్రికెట్ ను ప్రేమిస్తాడు, క్రికెట్ ను శ్వాసిస్తడు, క్రికెట్ ను జీవిస్తాడు. ఫుట్ బాల్ లో పీలే కంటే క్రికెట్ లో సచిన్ కు ఎక్కువ పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. టెస్ట్ జీవితం ఆరంభించిన తర్వాత టెండూల్కర్ విశ్రమించలేదు. వెనక్కు తిరిగి చూడనూ లేదు. టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని చాముండీశ్వరనాథ్ ద్వారా అభివృద్ధి చేస్తున్నాడు.
శిఖరాలను అధిరోహించిన వీరుడు
సచిన్ పొట్టివాడైనా గట్టివాడని నిరూపించుకున్నాడు అనతికాలంలోనే. గురుదేవుడు ఆచ్రేకర్ శిక్షణలో అగ్రశ్రేణి క్రికెటర్ గా ఎదిగాడు. పదహారేళ్ళప్పుడే రంగప్రవేశం చేశాడు. గురువుకి చివరి వరకూ భక్తిప్రపత్తులతో మసిలాడు. ప్రపంచ క్రికెట్ వీరుల జాబితాలోకి ఎక్కి గబగబా పైకి ఎగబాకాడు. సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ, యువరాజ్ తో స్నేహంగా ఉండేవాడు. సీనియర్స్ గావస్కర్, ద్రాడిడ్, గుండప్ప విశ్వనాథ్, రవిశాస్త్రి, బిషన్ సింగ్ బేడీ వంటి వారిపట్ల గౌరవభావం ప్రదర్శించేవాడు. 2012 నాటికి వంద సెంచరీలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్ లో శతశతకాలు సాధించిన మొదటి బ్యాట్స్ మన్ గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. పరుగులంటే లెక్కలేదు. వన్ డే ఇంటర్నేషనల్ లో రెండు వందల పరుగులు చేయడం అసాధ్యమనే నమ్మకాన్ని పటాపంచలు చేశాడు 2008లో. గ్వాలియర్ లో దక్షిణాఫ్రికా జట్టుపైన ఆడుతూ ద్విశతకం అలవోకగా బాదేశాడు. 2011లో ప్రపంచ కప్ ను తనకు ఇష్టమైన వాంఖెడే స్టేడియంలో గెలిచిన భారత జట్టులో ముఖ్యుడు. అంతకు పూర్వం అయిదు ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్న ధీరుడు. ఆ విధంగా తన సొంతగడ్డపైన ప్రపంచకప్ కలను సాకారం చేసుకున్నాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకున్నాడు. దానికి కొన్ని గంటల ముందే అతడికి భారత దేశంలోని అత్యున్నత సివిలియన్ అవార్డు ‘భారతరత్న’ను ప్రదానం చేశారు. అనంతరం రాజ్యసభను అలంకరించాడు. పద్మవిభూషణ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వంటి అనేక పురస్కారాలు స్వీకరించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) క్కికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు.
సచిన్ రమేశ్ టెండూల్కర్ ఇండియన్ బ్యాటింగ్ కు రెండు దశాబ్దాలపాటు కొండంత అండగా నిలిచాడు. 27 మే 2017లో ‘సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్‘ అనే డాక్యూడ్రామాను విడుదల చేశారు. జేమ్స్ ఎర్క్ సన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ చిత్రానికి నిర్మాత రవి భాగ్ చడ్కా. సచిన్ భార్య డాక్టర్ అంజలి. కొడుకు అర్జున్ మొన్ననే ముంబయ్ జట్టు 22మంది సభ్యులలో ఒకడుగా ఎంపికైనాడు. ఆల్ రౌండర్ గా పేస్ బౌలర్, బ్యాట్స్ మన్ గా రాణిస్తున్నాడు.
సారా కూడా డాక్టరే
సచిన్ కూతురు పేరు సారా. సారా తల్లి అంజలి పోలికలతో పుట్టింది. తల్లి లాగే ఆమె కూడా మెడిసిన్ చదువుకుంది. ముందు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువకొని, ఆ తర్వాత లండన్ యూనివర్శిటీలో (యూఎల్ సీ) మెడిసిన్ చదివింది. 12 అక్టోబర్ 1997లో 23 ఏళ్ళ కిందట ముంబయ్ లో పుట్టిన సారాకు పుస్తకాలు చదవడం, బాలీవుడ్ సినిమాలు చూడటం, సంగీతం వినడం ఇష్టం. 2018 జనవరిలో ఒక రోజు కొల్ కతా నుంచి ఒక ఆగంతుకుడు టెండూల్కర్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ కి పాతిక విడతల ఫోన్ చేసి సారా…సారా అంటూ పలవరించాడు. తాను సారాను ప్రేమిస్తున్నాననీ, పెళ్ళి చేసుకుంటాననీ, లేకపోతే కిడ్నాప్ చేస్తానంటూ వాగాడు. ముంబయ్ పోలీసులు 32 ఏళ్ళ దేబ్ కుమార్ మెయితీని అరెస్టు చేసి కేసులు పెట్టారు. సారా మెడిసిన్ ప్రాక్టీసు చేస్తున్నది. 24 సెప్టెంబర్ 1999న అర్జున్ జన్మించాడు. అతడు మొదటి నుంచి తండ్రి అడుగులలో అడుగులు వేస్తూ క్రికెట్ నేర్చుకున్నాడు. అతడు కూడా అక్కలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకున్నాడు. బ్రిటిష్ క్రికెటర్ల చేత అర్జున్ కి సచిన్ శిక్షణ ఇప్పించాడు. భవిష్యత్తు అర్జున్ దే.
Also Read : సచిన్ వారసుడు వచ్చేశాడు