- మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండా తొందరెందుకు?
- కోవాగ్జిన్ ను అనుమతించడంపై శశిథరూర్, జైరాంరమేష్, ఆనందశర్మ ఆక్షేపణ
- శాస్త్రపరమైన అంశాలపై రాజకీయం వద్దంటూ హర్షవర్థన్ వ్యాఖ్య
ఆదివారంనాడు ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికాకూ, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ కూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేయడంపైన రాజకీయ వివాదం తలెత్తింది. మూడో దశ పరీక్షలు పూర్తి కాకుండానే భారత్ బయోటెక్ ఉత్పత్తికి అనుమతించడం తొందరపాటు చర్య అంటూ కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, జైరాంరమేష్, శశి థరూర్ లు విమర్శించడాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సిగ్గుచేటంటూ ఖండించారు. దేశం ఏ ఘనకార్యం సాధించినా ప్రతిపక్ష నాయకులు గర్వపడరనీ, విమర్శిస్తూనే ఉంటారనీ బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా విరుచుకుపడ్డారు. ఈ వివాదం రాజకీయ నేతలకు మాత్రమే పరిమితం కాలేదు. పుణె లోని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా కూడా ప్రపంచంలో ఇంతవరకూ ప్రభావశీలమైన టీకాలుగా నిరూపించుకున్నవి ఫైజర్, మోడెర్నా, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్ మాత్రమే అంటూ ఆదివారంనాడు డ్రగ్ కంట్రోలర్ జనరల్ కోవాగ్జిన్ ని అనుమతించిన తర్వాత కూడా వ్యాఖ్యానించడం వివాదాస్పదం.
ఐసీఎంఆర్ సమర్థన
పూనావాలా అభిప్రాయానికి భిన్నంగా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పందించారు. కరోనా వైరస్ లోని స్ట్రయిక్ ప్రోటివ్ సహా చాలా భాగాల్లో జన్యుమార్పులు జరగడంతో కొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చిందనీ, నిర్జీవంగా మారిన పూర్తిస్థాయి వైరస్ తో కూడిన కోవాగ్జిన్ టీకా కొత్త స్ట్రయిన్ పైనా ప్రభావశీలంగా పనిచేస్తుందనీ ఆయన అన్నారు. నీళ్ళకంటే తక్కువ ధరకు టీకా మందు అందిస్తామని భారత్ బయోటెక్ ప్రకటించగా, తాను పేర్కొన్న మూడు టీకా మందులు తప్ప తక్కినవి నీళ్ళవంటివేననీ, వాటివల్ల ప్రయోజనం కానీ ప్రమాదం కానీ లేదనీ పూనావాలా ధ్వజమెత్తారు.
మొదట ఇచ్చేది కొవిషీల్డే
తొలివిడత కరోనా వ్యాక్సినేషన్ లో కొన్ని వారాలపాటు ఇవ్వబోయేది కొవిషీల్డ్ మాత్రమేనని దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా దేశంలో ప్రత్నామ్నాయ టీకాగా పని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కరోనా కేసులు పెరిగినా , కొత్త స్ట్రయిన్ లు పుట్టుకొచ్చినా అత్యవసర ప్రాతిపదికపైన కొవాగ్జిన్ ను వినియోగిస్తారని ఆయన వివరించారు.
Also Read : ఇది టీకానామ సంవత్సరం
తొందరపాటు చర్య: కాంగ్రెస్ నేతలు
కాగా, కొవాగ్జిన్ మూడో దశ పరీక్షలు పూర్తి చేసుకోలేదనీ, దానిని అనుమతించడం తొందరపాటు చర్య అనీ, ఆ టీకా వేయించుకున్నవారి ఆరోగ్యానికి ఎవరు పూచీపడతారనీ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఇది అపరిపక్వ చర్య అని అభివర్ణిస్తూ, ఈ అనుమానాస్పదమైన నిర్ణయంపైన కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్థన్ వివరణ ఇవ్వాలని వారు కోరారు. మూడో దశ పూర్తయిన తర్వాతనే అనుమతి మంజూరు చేయాలన్న అంతర్జాతీయ నిబంధనను ఎందుకు ఉల్లంఘించవలసి వచ్చిందో మంత్రి చెప్పాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అడిగారు. ఇటువంటి కీలకమైన అంశాలను రాజకీయం చేయవద్దంటూ మంత్రి కాంగ్రెస్ నాయకులను కోరారు. ఇవి బీజేపీ టీకా మందులనీ, తానైతే వాటిని విశ్వసించబోననీ సమాజ్ వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అద్భుతమైన టీకా మందు కనుగొన్న భారత్ బయోటెక్ ను అనుమానించవద్దు, అవమానించవద్దు అంటూ హర్షవర్థన్ ప్రతిపక్షాలను కోరారు.
టీకా మందు తయారు చేసే విధానం
ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంస్థలు కలసి రూపొందించిన కొవాషీల్డ్ వెక్టర్ తరహా టీకా మందు చింపాంజీల్లో జలుపు కలిగించే ఎడినో వైరస్ ను కరోనాలోని స్పైక్ ప్రొటీన్నుజోడించి అభివృద్ధి చేశారు. కొవాగ్జిన్ లో వైరస్ ను పూర్తిగా నిర్వీర్యం చేసి, దానిలోని జన్యుపదార్థాన్ని ధ్వంసం చేసి టీకా తయారు చేస్తారు. వీటిని ఇనాక్టివేటెడ్ వాక్సిన్ అంటారు. కరోనా కారకమైన సూక్ష్మజీవి పూర్తిగా నిర్వీర్యం కావడంతో అది మనిషి శరీరంలోకి వెళ్ళినా తన సంఖ్యను పెంచుకోలేదు. సూక్ష్మజీవుల ప్రవేశం వల్ల మనిషి శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇనాక్టివేట్ వ్యాక్సిన్ తో ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ రకం టీకా వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. టీకా ప్రభావం ఉన్నదో లేదో రెండో దశలో నిర్థారిస్తారు కనుక మూడో దశ ప్రయోగానికి అంత ప్రాధాన్యం లేదని వారి అభిప్రాయం.
Also Read : కోవాగ్జిన్, ఆస్ట్రాజనీకాలకు అనుమతి మంజూరు
డాక్టర్ ఎల్లా హర్షం
కోవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతి లబించడం పట్ల భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా హర్షం వెలిబుచ్చారు. ట్రయల్ప్ లో టీకా భద్రత, వివిధ వైరల్ ప్రొటీన్లపైన దాని ప్రభావశీలతకు సంబంధించిన సమాచారం సేకరించిన తర్వాతనే మందు ఉత్పత్తికి సన్నాహాలు చేశామని ఆయన చెప్పారు. ఈ టీకా మందు సురక్షితమైనదని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రధాని అభినందన
కరోనాపైన భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మకమైన మేలి మలుపు అని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. భారత్ ఆరోగ్యకరమైన, కోవిద్ రహితమైన దేశంగా మారడానికి చేస్తున్న ప్రయాణం దీంతో వేగవంతం అయిందని ఆయన అన్నారు. అహర్నిశలూ కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు అని ఆయన మెచ్చుకున్నారు. ‘కంగ్రాట్యులేషన్స్ ఇండియా‘ అంటూ ట్వీట్ పెట్టారు. ఈ టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. భారత్ బయోటెక్ కు రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అభినందనలు తెలిపారు.
Also Read : ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా
Also Read : భారత్ లో విజృంభిస్తున్న కరోనా స్ట్రెయిన్