కరోనా మహమ్మారి మరో ప్రజాప్రతినిధిని పొట్టనపెట్టుకుంది. ఎమ్మెల్సీ వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శ్వాసతీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవడంతో ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇది చదవండి:
రాజకీయ ప్రస్థానం:
1948 ఆగస్టు 27 న జన్మించిన రామకృష్ణారెడ్డి 1983లో కర్నూలు జిల్లా పాణ్యంనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో డోన్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశంతో రాజకీయప్రస్థానం ప్రారంభించిన రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్, వైసీపీలో కొనసాగుతూ వచ్చారు. టీడీపీ హయాంలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ శాసనమండలికి పంపారు. రామకృష్ణారెడ్డి మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. రామకృష్ణారెడ్డి భౌతికకాయానికి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇది చదవండి: తూ. గోదావరిలో యూకే కరోనా స్ట్రెయిన్