• తెలంగాణలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ
• బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి సోదరుడు
• శ్రీవారి సమక్షంలో మనసులో మాట చెప్పిన రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురుకానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. ఎప్పటినుండో పీసీసీ పీఠంపై కన్నేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్ఠానం నాన్చుడుధోరణితో వ్యవహరిస్తుండటంతో వెంకటరెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం వైఖరితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ తో చేరేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో రాను రాను కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోతుండటంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీతో కలిసివెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకే భవిష్యత్ ఉందని గతంలో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కొన్ని కారణాలతో ఆలస్యమయింది.
ఇది చదవండి: టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై దిల్లీలో సమాలోచనలు
నల్లగొండ జిల్లాలో కీలకనేత:
అయితే కొత్త సంవత్సరం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో బీజేపీ చేరే అవకాశంఉందని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా తాను మాత్రం ఖచ్చితంగా బీజేపీలో చేరతానని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది చదవండి: రాష్ట్ర కాంగ్రెస్ లో రసవత్తర రాజకీయం
రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మార్పు:
కాంగ్రెస్ అధ్యక్ష పీఠంకోసం సోదరుడు చేస్తున్న ప్రయత్నాలపై అధిష్ఠానం ఎటూ తేల్చకపోవడం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతుండటంతో రాజగోపాల్ రెడ్డి పార్టీందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు సోదరుడు వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికోసం ప్రయత్నాలు చేస్తుంటే…రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇది చదవండి: రేవంత్ చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ రాజకీయం