- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంకల్పం
- వేతనాలు పెంచాలనీ, ఉద్యోగ విరమణవయస్సుపెంచాలనీ నిర్ణయం
- 9,36,976 మందికి లబ్ధి
- ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి సత్వర చర్యలు
- అన్నిరకాల, అన్ని స్థాయిలలో ఉద్యోగులకూ మేలు
- నూతన సంవత్సర కానుకలుగా కేసీఆర్ నిర్ణయాలు
(సకలం ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణలో ప్రభుత్వోగులందరికీ జీతాలు పెంచాలనీ, ప్రమోషన్లు ఇవ్వాలనీ, దాని ఫలితంగా ఏర్పడిన ఖాళీలను పూరించాలనీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నిర్ణయించారు. మొత్తం 9,36, 976 మంది ఉద్యోగులకు ముఖ్యమంత్రి మంగళవారంనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల లబ్ధి కలుగుతుంది. వీరిలో అన్ని రకాల ఉద్యోగులూ, అన్ని స్థాయిలలోనివారూ ఉంటారు.
అంగన్ వాడీ వర్కర్లూ, హోంగార్డులూ, వర్క్ చార్జుడ్ ఉద్యోగులూ, డెయిలీ వేజెస్ ఉద్యోగులూ, పార్ట్ టైం, ఫుల్ టైం తాత్కాలిక ఉద్యోగులూ, కాంట్రాక్టు ఉద్యోగులూ, ఆశ వర్కర్లూ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులూ, తదితన సమస్త ఉద్యోగులందరినీ ముఖ్యమంత్రి సంకల్పించిన నూతన సంవత్సర కానుక అందుతుందని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
పదవోన్నతులూ, సానుకూల బదిలీలూ
వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని కూడా నిర్ణయించారు. ఈ విషయంలో సూచనలు చేసేందుకూ, ఉద్యోగులకు సంబంధించిన ఇతర విషయాలలో సలహా చెప్పేందుకూ ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ లతో ఒక కమిటీని నియమించారు. సర్వీసు నిబంధనలను సడలించడం వంటి అంశాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అంశాలన్నిటిపైనా అధ్యయనం చేయడానికీ, ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపడానికి, ప్రభుత్వానికి సముచితమైన సలహాలు ఇవ్వడానికి ఈ కమిటీ పని చేస్తుంది. జోనల్ విధానంలో ప్రస్తుతం ఎదుర్కొన్న చిక్కులను అధిగమించడం ఏట్లాగో కూడా ఈ కమిటీ సూచిస్తుంది.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర గొప్పది : కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ప్రముఖ పాత్ర పోషించారనీ, టీఎన్ జీవో పేరుతో తెలంగాణ ఉద్యోగుల ఉనికిని అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో కాపాడారనీ కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పత్రికా ప్రకటన తెలిపింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన వెంటనే 42 శాతం ఫిట్ మెంట్ ఉద్యోగులకు మంజూరు చేశారు. తాత్కాలిక ఉద్యోగులుగా వివిధ రంగాలలో పనిచేస్తున్నవారి సర్వీసులకు క్రమబద్దీకరించారు. వారి వేతనాలు ఇప్పుడు పెంచవలసి ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు.
అవిభక్త రాష్ట్రంలో వివాదాల కారణంగా ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యపడలేదనీ, ఇప్పుడు చాలావరకు సమస్యలు పరిష్కారమైనాయి కనుక ప్రమోషన్లకు అడ్డంకి తొలగిపోయిందనీ కేసీఆర్ అన్నారు. ప్రమోషన్ల విషయం వెంటనే తేల్చి నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని శాఖలలో డీపీసీలను నియమించాలని చెప్పారు.
ఉద్యోగ విరమణ చేసినవారికి సముచితమైన వీడ్కోలు
ముప్పయ్ అయిదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి ఉద్యోగం విరమించిన ఉద్యోగులకు సముచితరీతిలో వీడ్కోలు పలకాలని ముఖ్యమంత్రి అదికారులకు చెప్పారు. ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసిన రోజునే అతడికి రావలసిన బెనిఫిట్స్ అన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగం చేస్తూ మరణించినవారి కుంటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం జరిగినందుల అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ విషయంలో ఇక జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను కోరారు.