- మరో 6 నెలల్లో సింగరేణిలోని అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీ
- అర్హూలైన ఇంటర్నల్ కార్మికులకు భర్తీలో అవకాశం
- 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో సింగరేణి సి&ఎం.డి. ఎన్.శ్రీధర్
- కోవిడ్ నివారణ చర్యలపై ప్రశంసలు కురిపించిన గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు
రక్షణ పెంపుదల చర్యలకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యత నిస్తుందనీ, రక్షణ చర్యలపై ఖర్చుల విషయంలో ఎటువంటి పరిమితులూ పెట్టడం లేదనీ, కార్మికుల భద్రతకే అత్యధిక ప్రాదాన్యతనిస్తున్నామని సింగరేణి సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు.
హైద్రాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం (డిసెంబర్ 29వ తేదీ) నాడు నిర్వహించిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కాలరీస్ యాజమాన్య ప్రతినిధులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన పలు హామీలను ప్రకటించారు.
నియామకాలపై వివరణ
సింగరేణిలో చాలా గనుల్లో టెక్నికల్ స్టాఫ్, సూపర్ వైజర్లు, మెడికల్ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు, తదితర పోస్టులు వెంటనే భర్తీ చేయాలనీ, తద్వారా రక్షణతో కూడిన ఉత్పత్తి పెంచాలనీ యూనియన్లు చేసిన సూచనలపై ఆయన వివరిస్తూ గత అయిదేళ్ల కాలంలో డైరెక్టు రిక్రూట్ మెంట్, కారుణ్య నియామకం, ఇంటర్నల్ నియామకాల ద్వారా సుమారు 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను నింపామనీ, మరో 6 నెలల కాలంలో మిగిలిన అన్ని ఖాళీలు నింపడానికి రిక్రూట్ మెంట్ చేపట్టనున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే సింగరేణిలో కొత్తగా చేరిన యువ ఉద్యోగుల్లో మంచి విద్యార్హతలు గలవారు ఉన్నారనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించిన ప్రకారం కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులలో ఇంటర్నల్ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తామనీ తెలిపారు.
ఇది చదవండి: నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటుల నిర్మాణంపై సింగరేణి యోచన
సకల నిర్మాణాత్మక సలహాల అమలు
రక్షణ పెంపుదల కోసం కార్మిక సంఘాల వారు, డి.జి.ఎం.ఎస్. అధికారులు చేసిన పలు నిర్మాణాత్మక సూచనలు సలహాలు తూచ తప్పకుండా అమలు జరుపుతామనీ, మరోమారు డైరెక్టర్లు, సీనియర్ ఆఫీసర్లతో సమావేశమై తగిన కార్యాచరణ రూపొందిస్తామని సి&ఎం.డి. తెలిపారు. రక్షణ పరికరాల కొనుగోలు, రక్షణ చర్యల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేనేలేదని హామీ ఇచ్చారు. భారీ వాహానాల అపరేటర్లకు శిక్షణలో భాగంగా రెండు సిమ్యులేటర్సును, ఇతర శిక్షణ సామాగ్రిని సమకూర్చుకున్నామని తెలిపారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా సుమారు 60 వేల రాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు జరిపామనీ, పెద్ద ఎత్తున నివారణ చర్యలు చేపట్టిన ఫలితంగానే కోవిడ్ నుండి సింగరేణీయులు అత్యల్ప ఇబ్బందితో బయట పడ్డారనీ, దేశంలోని ఇతర సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా కోవిడ్ నివారణకు అత్యంత పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. కోవిడ్ నివారణ చర్యల్లో విశేష కృషి చేసిన సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ ను వైద్య శాఖ కృషిని ప్రశంసించారు. రానున్న కాలంలో ప్రైవేటు కంపెనీలు, విదేశీ బొగ్గుతో గట్టి పోటీ ఉండబోతోందనీ, సమిష్టి కృషితో నైపుణ్యాన్ని పెంచుకుంటూ, ఉత్పత్తి వ్యయం తగ్గించుకొంటూ పోటీలో నిలబడాలని పిలుపునిచ్చారు.
తగ్గిన ప్రమాదాలు, పెరిగిన ప్రమాణాలు
సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత 3 ఏళ్ల కాలంలో పరిశీలిస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కార్మికులకు నాణ్యత గల బూట్లు, హెల్మెట్లకు కొరత ఏమిలేదని తెలిపారు. అన్ని రకాల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరామ్ మాట్లాడుతూ సమావేశంలో సూచించిన రక్షణ చర్యల అమలుకు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ముందుకు పోతామన్నారు. ప్రమాదాల నివారణకు సింటార్సు సంస్థ సహకారంతో సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 822 మందికి రక్షణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. డైరెక్టర్ (ఇ&ఎం) డి.సత్యనారాయణరావు మాట్లాడుతూ గనుల్లో, కాలనీల్లో లైటింగ్ మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామనీ, కాలనీలలో లైటింగ్ మెరుగుదలకు 22 వేల ఎల్.ఇ.డి. లైట్లు కొనుగోలుచేసి అమర్చుతున్నామని పేర్కొన్నారు. టెక్నికల్ స్టాఫ్, సూపర్ వైజర్లు మరియు ఇంజనీరింగ్ అధికారులకు ఎక్ట్రికల్స్ పై ప్రత్యేక శిక్షణకు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఇది చదవండి:131 వ ఏట అడుగుపెట్టిన సింగరేణి
కోవిద్ నివారణ: యాజమాన్యానికి కార్మిక సంఘాల ప్రశంస
గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు బి.వెంకట్రావ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మేము ఆశించిన దానికన్నా మిన్నగా యాజమాన్యం చర్యలు తీసుకొన్నదని ప్రశంసించారు. త్రైపాక్షిక రక్షణ సమావేశం ప్రతీ 6 నెలల కొకసారి తప్పక నిర్వహించాలని కోరారు. జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఊహించని ప్రత్యేక ప్రమాదాలపై లోతైన విశ్లేషణ జరగాలనీ, యువ కార్మికుల్లో విద్యార్హతలు గల వారిని తగిన పోస్టుల్లో భర్తీ చేయాలన్నారు. ప్రాతినిధ్య సంఘం ఏ.ఐ.టి.యు.సి. ప్రధాన కార్యదర్శి సీతారామయ్య మాట్లాడుతూ గనులలో సేఫ్టీ అధికారులు కార్మికులతో నిరంతరం రక్షణపై అవగాహన కల్గిస్తూ ఉండాలనీ, అది ఈ మధ్య లోపించిందన్నారు. ఓ.సి. గనుల్లో లైటింగు పెంచాలనీ సూచించారు. సి.ఎం.ఓ.ఎ.ఐ. ప్రధాన కార్యదర్శి ఎన్.వి.రాజశేఖర్ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడానికి అధికారుల నుండి కావలసిన పూర్తి సహకారాన్ని అందిస్తామని వివరించారు.
లోపాల సవరణకు సూచనలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి.జి.ఎం.ఎస్. అధికారులు డాక్టర్ కౌశిక్ సర్కార్, టి.శ్రీనివాస్, మిశ్రా, ఎస్.ఎస్.సోని, మహ్మాద్ నియాజి, కె.విజయ కుమార్, ఎస్.పుట్టారాజు, ఎస్.రత్నాకర్, ఎన్.బాలసుబ్రహ్మాణ్యం, సంజయ్ కుమార్ జిమ్మేడి, ఎం.రఘు, వెంకటారంగారవ్ గోవిందరాజు, రవీంద్ర బొంత లు వారు గనులలో పర్యటించినప్పుడు గుర్తించిన లోపాల గురించి చెబుతూ తగిన సూచనలు చేశారు.
ఇది చదవండి:కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఆందోళన
మరణించిన కార్మికుల కుటుంబాలకు సంతాపం
జి.ఎం. (సేఫ్టీ) .వెంకటేశ్వర్ రెడ్డి సమావేశానికి స్వాగతం పలికారు. 2017లో సీరియస్ గాయాలు 219 జరగగా 2020లో ఇది 95కు తగ్గాయనీ, రిపోర్టబుల్ గాయాలు 2017లో 357 ఉంటే అవి ఈ ఏడాదికి 101కి పడిపోయాయనీ వివరిస్తూ రక్షణ కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల మృతి చెందిన కార్మికులకు సమావేశం సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించింది. జి.ఎం. సేఫ్టీ (బ్లెంపల్లి రీజియన్) బళ్ళారి శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో జి.ఎం. (సి.డి.ఎన్.) .రవిశంకర్, జి.ఎం. పర్సనల్ (ఐ.ఆర్. & ఆర్.సి.) ఎ.ఆనందరావు, లు పాల్గొన్నారు. వివిధ ఏరియాల నుండి జనరల్ మేనేజర్లు, కార్మిక సంఘాల నాయకులు మరియు ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఇది చదవండి:సింగరేణి కార్మికులకు తొలి విడత కొవిడ్ వాక్సిన్ ఇవ్వాలి