హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్ )వ్యవసాయ చట్టాలపైన స్వరం మార్చారు. వచ్చే సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పబోదని స్పష్టిం చేశారు. ఆదివారంనాడు అధికారులతో జరిపిన సమావేశంలో కేసీఆర్, ప్రభుత్వం రైస్ మిల్లర్ కాదనీ, దాల్ మిల్లర్ కూడా కాదనీ వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటి వరకూ కేసీఆర్ రైతుల ఉద్యమాన్ని సమర్థించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలిపారు.
భారీగా నష్టబోయిన ప్రభుత్వం
కోవిద్ మహమ్మారి కారణంగా ఈ యేడాది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి కనీస మద్దతు ధరకు రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసిందనీ, ఇందులో రూ. 7,500 కోట్లు నష్టపోయిందనీ చెప్పారు. కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యం అంతకంటే తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చిందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఈ సంవత్సరానికే పరిమితమనీ, వచ్చే సంవత్సరం ఉండబోవనీ అన్నారు.
ప్రభుత్వం వ్యాపారసంస్థ కాదనీ, వచ్చే సంవత్సరం నుంచి ధాన్యాల విక్రయ, క్రయాలను పర్యవేక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించబోదనీ స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం నుంచి కొనుగోలు కేంద్రాలు ఉండబొవని చెప్పినట్టు కొన్ని వార్తాసంస్థల భోగట్టా. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వచ్చే సంవత్సరం నిర్వహించబోవడం లేదని స్పష్టం చేశారు.వరి ధాన్యం, పెసలు, కందులు, ఇతర తృణదాన్యాలు ఈ సంవత్సరం కొనుగోలు చేసింది.