కరీంనగర్ లోని మారుమూల గ్రామమైన వంగరలో పుట్టి, అంచెలంచెలుగా దేశం గర్వించే ప్రధానిగా ఎదిగిన మహోన్నతుడు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయననే మనం ప్రేమగా పిలుచుకునే పివి. చక్కని పంచెకట్టుతో తెలుగుదనం ఉట్టిపడేది. ఆయన మృధు స్వభావి. మౌనంగా ఉంటూ ఎంతో అవసరమైతేనే పెదవి విప్పివారు కాదు. అట్లాగని మెతక మనిషి కూడా కాదు.
వారసత్వ పాలనకు పేరుపడిన పార్టీలో ఏ అండా, ఎజెండా లేకుండా స్వయంకృషితో ఎదిగిన మేధావి. సహనశీలి. దేశాన్ని ఆర్ధిక రంగంలో పరుగులు పెట్టించినా, ప్రపంచవేదికలపైన భారత కీర్తిని బావుటా ఎగురవేసినా అది పూర్తిగా ఆయన ఘనతే. జీవిత చరమాంకంలో ప్రతికూల పవనాలు చికాకు పరిచినా, తనను ఇబ్బందిపెడుతున్న వారు ఎవరో తెలిసినా, వారిని పల్లెత్తుమాట అనకుండా మౌనంగానే సహించిన మహాముని, రాజకీయ భీష్ముడు.పివి రాజకీయంలో చెప్పదగిన అంశాలు అనేకం ఉన్నాయి.
ముఖ్యంగా మూడు అంశాలు
- రాష్ట్ర విద్యామంత్రిగా, కేంద్ర మానవ వనరుల మంత్రిగా, విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు.
- దేశ ప్రధానిగా మరణావస్థలో ఉన్న ఆర్ధిక వ్యవస్థకు ప్రాణం పోసిన సంస్కరణల రూపశిల్పి.
- ప్రధానిగా భారత విదేశాంగ విధానంలో ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని ఆవిష్కరించిన దార్శనికుడు.
ఈ మూడు సంస్కరణల వల్ల ఆయా రంగాల్లో గొప్ప పరివర్తన సంభవించింది. రాష్ట్ర విద్యామంత్రిగా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను, కేంద్ర మానవవనరుల మంత్రిగా జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను నెలకొల్పిన ఘనత పివీదే. ఈ సంస్కరణలవల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్ధినీ, విధ్యార్ధులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. మూడు ప్రాంతాల్లో మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఈ స్కూళ్ళలో ఉత్తీర్ణులైనవారి కోసం నాగార్జునసాగర్ లో జూనియర్, డిగ్రీ కళాశాల స్థాపించడం ద్వారా మూడు ప్రాంతాల్లోని నివశించే తెలుగువారి మధ్య సమైక్యత సాధించడానికి పివి కృషి చేశారు.
Also Read : బలగం లేని బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ
భూసంస్కరణలు, ముల్కీ నిబంధనలు
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయించిన విధంగా భూ సంస్కరణలను, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ముల్కీ నిబంధనలను అమలుచేయడానికి ప్రయత్నించి భూస్వాముల ఆగ్రహాన్ని చవిచూసి, ఆపై ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన పివి కాంగ్రెస్ అధిష్టానంలో ముఖ్య భూమికను నిర్వహించారు. ఆయన చదివి, సవరించి, ఖరారు చేయకుండా ఒక్క నివేదిక కానీ, ఒక్క తీర్మానం కానీ ఏఐసిసి విడుదల చేసేది కాదు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు నమ్మినబంటుగా పనిచేశారు.
పివి 1973లో ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలిగిన అనంతరం రాష్ట్ర రాజకీయాలనుంచి నిష్ర్కమించి, జాతీయ రాజకీయాలపై ధృష్టి సారించారు. 1977లో తొలిసారిగా ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అనేకమార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచినా ఆయన కేంద్రంలో ఎన్నో పదవులు వరించాయి. కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిగా, విదేశీ వ్యవహారాలు, హోంశాఖ, రక్షణశాఖ, చివరకు ప్రధానిగా ఆయన పనిచేశారు. పంజాబ్ లో పడగవిప్పిన వేర్పాటువాదాన్ని అదుపుచేయడంలో పివీ అద్భుతమైన రాజకీయ పరణతిని ప్రదర్శించారు.
ఆర్థిక సంస్కరణల పితామహుడు
భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు పివీ. ఆయన ఉన్నతస్థాయి దౌత్యవేత్తకూడా. అంతర్జాతీయ పరిణామాలపై ఆయనకున్న అవగాహన అపారం. కాలంతోపాటు పెరుగుతున్న చైనా ప్రాముఖ్యాన్ని గుర్తించిన దూరదృష్టి ఆయన సొంతం. ‘లుక్ ఈస్ట్’ పాలసీని ఆయనే రూపొందించారు. దేశం ఆర్ధిక స్వావలంబన సాధించడానికి మూలకారకుడు మన తెలుగువాడు. ముప్పయ్ ఏళ్ల క్రితం అగమ్యగోచరంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్థని సంస్కరించి ఒక స్థిరమైన గమ్యానికి చేర్చిన ద్రష్ట మన పివి నరసింహారావు. ఇందిర గరీబీ హఠావో నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను తలకెత్తుకున్న సర్కారు ఆర్ధిక రంగంలో చతికిలపడిపోయింది. ప్రభుత్వ పరిశ్రమలు ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఆర్ధిక సరళీకృత విధానాలను అమలుచేయాలని ప్రయత్నించినా అది అరకొర ప్రయత్నంగానే మిగిలిపోయింది. అనంతరం చంద్రశేఖర్ ప్రభుత్వం ఒక పెను సంస్కరణల పరంపర అమలు చేయాలనే సంకల్పం తీసుకొని అటువైపుగా అడుగులు వేసింది. కానీ అంతలోనే అది కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణ కారణంగా కూలిపోయింది. లండన్ బ్యాంక్ లో బంగారం తాకట్టుపెట్టి అప్పుతెస్తే కానీ దిగుమతులకు చెల్లించే విదేశీమారక ద్రవ్యం ఉండేది కాదు. దేశ ఆర్ధిక వ్యవస్థ మనుగడ సాగించలేక కూలబడటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి.
Also Read : తెలుగు నేల కీర్తి పాములపర్తి
చైనాలో 1978లోనే డెంగ్ ఆర్థిక సంస్కరణలను పెద్ద ఎత్తున అమలుచేసి విజయాలు సాధించాడు. దక్షిణాఫ్రికా సైతం సంపద సృష్టిలో ముందంజ వేసింది. ఈ నేపథ్యంలో ప్రధానిగా అధికారం చేపట్టిన వెంటనే పివి మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేరేందుకు ఒప్పించారు. పివి సంకల్పించి రూపకల్పన చేసిన ఆర్థిక సంస్కరణలను మన్మోహన్ సింగ్ అమలుచేశారు.
ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు
నత్త నడకన నడుస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు ప్రసాదించి చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాల సరసన కూర్చొండబెట్టిన ఘనత పివిదే. తాను తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నా ఎలాంటి ప్రచారాన్ని కోరుకోలేదు. విదేశాంగ విధానంలో చాలాకాలంగా నిర్లక్ష్యం చేసిన ఆగ్నేయాసియా దేశాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకొని వ్యాపారాభివృద్ధికి బాటలు వేసిన ‘లుక్ ఈస్ట్’ పాలసీ పివి దూరదృష్టికి నిదర్శనం. నెహ్రూ, ఇందిరవంటి ప్రధానులు ఇరుగుపొరుగు దేశాలతో స్నేహసంబంధాలను పెంపొందించుకోవలసిన అవసరాన్ని విస్మరించారు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు పివి నిర్మించారు. ఫలితంగా ఈ రోజు ఆసియన్ దేశాలతో భారత వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది.
బాబ్రీ విధ్వసం చెరగని చేదు జ్ఞాపకం
1992 డిసెంబర్ 6 భారత చరిత్రలో చెరగని చేదు జ్ఞాపకం. అదే బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన రోజు. మసీదు విధ్వంసం జరుగుతుందని నిఘా వర్గాలు ముందే హెచ్చరించినా, పివి అప్రమత్తం కాలేదనీ, కేంద్ర బలగాలను వినియోగించలేదనీ రాష్ట్రపతి పాలన విధించలేదనీ ఆయనపై అనేకమంది ఆరోపణలు చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసంపై దర్యాప్తు జరిపిన లెబ్రహన్ కమీషన్ పివీని నిర్దోషిఅని తేల్చినా, పార్టీ సహచరులు మాత్రం ఆయనపై అదేపనిగా ఆరోపణలు చేయడం శోచనీయం. బిజేపి, విశ్వహిందూ పరిషత్ ఇతర సంస్థల కుట్ర ఫలితంగా జరిగిన విధ్వంసానికి బాధ్యుడిగా పివిని నిలబెట్టడం కాంగ్రెస్ పార్టీకీ ఎన్నికల దృష్ట్యా అవసరమైంది.
రావలసిన ఖ్యాతి రాలేదు
చేసిన గొప్పపనులకు రాలసిన ఖ్యాతి రాకపోగా, ఆయన హయామంలో సంభవించిన దురదృష్టకరమైన పరిణామాలకు ఆయన్ను పూర్తిగా బాధ్యుడిని చేయడం చరిత్రను వక్రీకరించడమే. దీనిని సరిచేయవలసిన బాధ్యత భావి తరాలపైన ఉన్నది.
పివి బహుభాషావేత్త. 16 భాషలను అనర్గళంగా మాట్లాడగలిగేవారు. కవిసమ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత విశ్వనాథసత్యనారాయణ రచించిన వేయి పడగలు నవలను సహస్ర ఫణ్ పేరుతో హిందీలోకి ఆయన చేసిన అనువాదం విమర్శకుల ప్రసంశలందుకుంది.
సుదీర్ఘ రాజకీయ జీవితం
సంక్షోభ సమయాలను అత్యంత సమర్ధంగా ఎదుర్కోగలరని ఆయనకు పేరు. ఐదు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన పీవీ క్రియాశీల రాజకీయాలనుంచి వైదొలిగారు. 2004 డిసెంబర్ 9న ఆయనకు గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్సిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు. 14 రోజుల తరువాత 83 ఏళ్ల వయసులో ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రజల సందర్శన కోసం ఆయన భౌతికకాయన్ని ఏఐసిసి కార్యాలయంలోకి కూడా కాంగ్రెస్ అధిష్టానం అనుమతించలేదు. ఎన్నో సంక్షోభ సమయాలను అధిగమించిన ఒక తెలుగువాడికి అవమానం జరిగిందని భావించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పివి భౌతికకాయన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
గొప్ప ప్రధాని పివి దేశానికి దిశా నిర్దేశం చేసారు. ఆయన్ను స్మరించుకోవడం, ఆయన జీవితం నుంచి స్పూర్తి పొందడం ఈ జాతికి, భావితరాలవారికి ఎంతో అవసరం.
శశిథరూర్ చే పీవీ స్మారకోపన్యాసం 23న
పీవీ స్మారకోపన్యాసాలను ప్రసిద్ధ పాత్రికేయుడు, సకలం సంపాదకులు కె. రామచంద్రమూర్తి 2012 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రఖ్యాత రచయిత, తిరువనంతపురం నుంచి మూడు సార్లు లోక్ సభకు ఎన్నిక అవుతూ వస్తున్న మాజీ కేంద్రమంత్రి డాక్టర్ శశిథరూర్ పీవీ వర్థంతినాడే స్మారకోపన్యాసం చేస్తున్నారు. ఈ ఉపన్యాసాన్ని సకలం ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ప్రారంభంకానుంది. ఈ కింది ఫేస్ బుక్ లింక్ లో కూడా వీక్షించవచ్చు.