కాంగ్రెస్ అసమ్మతి నేతలతో సోనియా గాంధీ భేటీ ముగిసింది. పార్టీ నేతలతో నాలుగు గంటలపాటు జరిగిన సుధీర్ఘ భేటీలో సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను సోనియాకు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా రాహులకు బాధ్యతలు అప్పగించే విషయంపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కొత్త సంవత్సరంలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సీనియర్ నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధిష్ఠానానికి లేఖలు రాయడం పట్ల సమావేశంలో సీనియర్ నేతలు విచారం వెలిబుచ్చారు. పార్టీలో సీనియర్ నేతల ధిక్కార స్వరాలు, రాజీనామాలు తిరుగుబాట్లు అనంతరం తొలిసారి భేటీ అయింది.
మొదలైన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ
పార్టీ కోసం పనిచేసేందుకు ఏ బాధ్యతనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ తన సమ్మతిని తెలియజేశారని సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ బన్సాల్ తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవితో సహా సంస్థాగత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోందని పవన్ బన్సాల్ స్పష్టం చేశారు. దీనికోసం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పనిచేస్తోందన్నారు. అసమ్మతి నేతలతో సహా పార్టీ నేతలెవరికీ రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. ఇక పార్టీని దేశ వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేయనున్నట్లు బన్సాల్ తెలిపారు. పార్టీలో పెండింగులో ఉన్న అంశాలపై త్వరలో నిర్వహించే చింతన్ శిబిర్ లో చర్చిస్తామన్నారు.
ఇదీ చదవండి: అసమ్మతి నేతలతో సోనియా భేటి