Sunday, December 22, 2024

బెంగాల్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ

బిజెపి ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేస్తూ, వరుస విజయాలు సాధిస్తూ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పై పెద్ద కన్నే వేసింది. ఇది ఇప్పుడు కొత్తగా మొదలైన ఆట కాదు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఇక్కడ పట్టు సాధించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ పెద్దలు -బెంగాల్ దీదీ మధ్య బిగ్ ఫైట్ సాగుతూనే ఉంది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి  తన చర్యలను మరింత వేగవంతం చేసింది. బిజెపి అగ్రనాయకుడు అమిత్ షా ఈ శని, ఆదివారల్లో రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు.

బీజేపీ ఎత్తుగడలు

పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, సమీక్షలతో పాటు ఎన్నికల వ్యూహ రచనలో భాగంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించే ఎత్తుగడలు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దృశ్యం మారుతోంది. బిజెపికి అనుకూల పవనాలు వీస్తున్నాయానే చెప్పాలి. అధికారంలోకి వచ్చినా రాకపోయినా, సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు, తృణమూల్ పార్టీకి చెందిన ప్రస్తుత శాసనసభ్యులను కూడా తమ వైపు తిప్పుకోవడంలో బిజెపి వేగం పెంచింది. ఇప్పటికే పలువురు నాయకులు తృణమూల్ ని వీడి, బిజెపి పంచన చేరారు. కొందరు ఆ బాటలో ఉన్నారు. మరి కొందరిపై  బిజెపి నేతలు ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తున్నారు.కీలక నేత సువేందు అధికారి తృణమూల్ ను వీడారు.

తృణమూల్ నుంచి రాజీనామాల పరంపర

అమిత్ షా పర్యటనలో భాగంగా సువేందు బిజెపి కండువా కప్పుకుంటారానే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. తృణమూల్ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలపై బిజెపి తొలిగురి పెట్టింది. గడచిన మూడు నాలుగు రోజుల్లోనే ముగ్గురు తృణమూల్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వారిలో జితేంద్ర తివారి, శీల్ భద్ర దత్తాలు ఉన్నారు. అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న రెండు రోజుల్లోనే తృణమూల్ నుండి మరిన్ని వలసలు వస్తాయని రాష్ట్ర బిజెపి అంచనా వేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు.పార్టీని వీడుతున్న వారిని కిషోర్ వారించే ప్రయత్నం చేస్తున్నా, ఆయన మాటలను వారు పెడచెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : చిక్కుల్లో మమత

ప్రశాంత్ కిశోర్ మంత్రాంగం ఫలించేనా?

ఈసారి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మంత్రాగం ఏ మేరకు పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితుల్లోనే బెంగాల్ రాజకీయ పరిణామాలు సాగుతున్నాయి. పార్టీ వీడిన సువేందు అధికారి తృణమూల్ లో అగ్రనేత. రెండు దశాబ్దాలుగా దీదీతో కలిసి నడుస్తున్నారు. 2007లో నందిగ్రామ్ ఉద్యమాన్నిముందుకు నడిపింది వీరి కుటుంబమే. 2011లోవామపక్ష ప్రభుత్వం కూలిపోవడానికి ఈ ఉద్యమం ప్రధాన ప్రభావం చూపించింది. జంగల్ మహల్ ప్రాంతం సిపిఎంకు కంచుకోట. ఈ కోటను కూల్చి, తృణమూల్ వైపు తిప్పడంలో సువేందు  అధికారి కుటుంబం పాత్ర చాలా కీలకమైంది. తృణమూల్ అధికారంలోకి రావడానికి సువేందు పోషించిన పాత్ర చాలా గొప్పది. నందిగ్రామ్ ఉద్యమంలో కీలక భూమిక పోషించి, దీదీ గెలుపుకు ముఖ్య సూత్రధారిగా నిలిచారు. ఇటువంటి సువేందు అధికారి పార్టీని వీడడంతో, మమతాబెనర్జీకి కుడిచేయి పడిపోయినట్లయింది. ఈ వలసలు ఇంతటితో ఆగేట్టు కనిపించకపోవడంతో దీదీ తలపట్టుకొని కూర్చున్నారు.

అభిషేక్ బెనర్జీ ఆధిపత్య ధోరణి

తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం ఎక్కువ అవ్వడం, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోక్యం పెరగడం కూడా  ముఖ్య కారణాలుగా ప్రచారంలో ఉంది. మమతా బెనర్జీ పాలనపై  ప్రజావ్యతిరేకత (anti incumbency) కూడా  అలముకుంది. బిజెపి ఆకర్ష్ పథకం ఎలాగూ ఉంది. ఈ పరిణామాల్లో, అగ్రనేత సువేందు అధికారి అసంతృప్తి ప్రభావం ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుందనే విశ్లేషకుల అభిప్రాయం.ఇతని ప్రభావం దాదాపు 40నియోజకవర్గాలపైగా  ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

సువెందు బీజేపీలో చేరతాడా, సొంత కుంపటి పెట్టుకుంటాడా?

సువేందు బిజెపిలో చేరుతాడా? కొత్త పార్టీ స్థాపిస్తాడా? ఇంకా తేలాల్సివుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా దీదీకి నష్టం జరగడం ఖాయమానే చెప్పాలి. సువేందును ఆహ్వానించడానికి బిజెపి సిద్ధంగా ఉంది. తాజాగా మరో ఘటన జరిగింది. సువేందు రాజీనామాను పశ్చిమబెంగాల్ స్పీకర్ బిమన్ బెనర్జీ ఏవో కారణాలు చూపించి తిరస్కరించారు. పార్టీని వీడాలని బలమైన నిర్ణయం తీసుకున్న సువేందుపై దీని ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు.ఈ నిర్ణయాన్ని ఆపడానికి  స్పీకర్ ద్వారా మరో ప్రయత్నం జరుగుతున్నట్లుగానే భావించాలి. చరిత్రను గమనిస్తే, నిన్నమొన్నటి  వరకూ బెంగాల్ లో బిజెపి ప్రభావం తక్కువే. గత కొన్నేళ్లుగానే పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలనే దూకుడులో బిజెపి ఉంది.

ముకుల్ రాయ్ తురుపు ముక్క

తృణమూల్ పార్టీ దాదాపు దశాబ్దంగా అధికారంలో ఉంది. బిజెపి 2సీట్ల దశ నుండి 2019ఎన్నికల్లో 18లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది.పార్టీలో కీలకనేత, ద్వితీయ స్థానీయుడిగా చెప్పుకోనే ముకుల్ రాయ్ కూడా ఎప్పుడో (2017) బిజెపి కండువా కప్పుకున్నాడు. రేపటి ఎన్నికల్లో బిజెపి ఇతన్ని ట్రంప్ కార్డ్ గా వాడుకుంటుందనే ప్రచారం ఉంది. ఇతనికి మంచి వ్యూహకర్తగానూ పేరుంది. ఇతను బిజెపిలోకి జంప్ అయినప్పుడు తనతో పాటు సౌమిత్ర ఖాన్, అనుపమ్ హజ్రా వంటి నేతలను కూడా లాక్కెళ్లాడు. ఇటువంటి పరిణామాలెన్నో తృణమూల్ కు నష్టాన్ని చేకూర్చాయి. బిజెపి దూకుడు -తృణమూల్ ఎదుర్కొంటున్న కష్టాల మధ్య ఈసారి జరిగే బెంగాల్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. దీదీ అధికారాన్ని కోల్పోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. మొత్తం మీద  బెంగాల్ గడ్డపై బిజెపి పట్టు బిగిస్తోంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles