- ఎన్నికల ముంగిట మమతకు ఎదురుదెబ్బలు
- పార్టీని వీడుతున్న సీనియర్ నేతలు
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తృణమూల్ కాంగ్రెస్ లో అసమ్మతి స్వరం మరింత పెరుగుతోంది. ఇటీవలే రవాణా మంత్రిగా ఉన్న సువేందు అధికారి రాజీనామా చేసి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సువేందు గురువారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పార్టీలో మరికొందరు నేతలు సువేందు బాటలో నడిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తృణమూల్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ అసన్ సోల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సంస్థాగత సమస్యలను హైకమాండ్ పరిష్కరించలేక పోతున్నందున పదవికి రాజీనామా చేసినట్లు తివారి తెలిపారు. అసన్ సోల్ ను స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇదే బాటలో బరాక్ పోర్ ఎమ్మెల్యే శీల్ భద్ర దత్తా తృణమూల్ కు రాజీనామా చేసి ఈ మెయిల్ ద్వారా మమతకు పంపారు. ప్రజల మద్దతుతో గెలిచాను కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని ఆయన తెలిపారు. మరో సీనియర్ నాయకుడు దీప్తంగ్షు చౌదరి కూడా దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
ఇది చదవండి: పశ్చిమబెంగాల్ పోరు : బీజేపీ, తృణమూల్ ఆరోపణల యుద్ధం
కమలం చెంతకు అసంతృప్త నేతలు:
అసెంబ్లీ ఎన్నికల ముంగిట పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వైదొలగడం మమతకు తలనొప్పిగా మారుతోంది. అదే సమయంలో ప్రత్యర్థి బలహీనతలను సొమ్ము చేసుకుంటూ రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ అత్యంగా వేగంగా పావులు కదుపుతోంది. తృణమూల్ కు రాజీనామా చేసిన సువేందు అధికారి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే మమతకు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పీకే అండతో హ్యాట్రిక్ కొడతామనుకుంటున్న మమతకు సొంత పార్టీ నేతల నిర్వాకంతో తీరని నష్టం వాటిల్లుతోంది. లోలోపల తెలియన ఆందోళన వెంటాడుతున్నా పైకి మాత్రం ధీమాగా కనిపిస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు మమత ప్రయత్నిస్తున్నారు.
ఇది చదవండి: బెంగాల్ ప్రిపోల్ సర్వేలో మమతకు ఎదురుదెబ్బ
ముకుల్ రాయ్ జోస్యం:
తృణమూల్ నేతల రాజీనామాల పట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పతనానికి ఎమ్మెల్యేల రాజీనామాలు నాంది అన్నారు. త్వరలోనే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మరికొందరు నేతలు పార్టీని వీడతారని జోస్యం చెప్పారు.
ఇది చదవండి:`బంగా`లో రాజకీయ కాక