- బీహార్ అసెంబ్లీ, రాజస్థాన్, జీహెచ్ఎంసీ, కేరళ స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం
- ఎన్నికల్లో విధులకు వైద్య ఆరోగ్య సిబ్బంది అవసరం లేదు
- వాక్సినేషన్ తేదీలు ఖరారు కాలేదన్న ఎస్ఈసీ
కరోనా వాక్సినేషన్ కు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డంకి కాబోవని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, రాజస్థాన్, కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ ఉదహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోందని ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిబ్బందిని కేటాయించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిడ్ దాఖలు చేసింది. దీనికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాక్సినేషన్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన జాతీయ విధి విధానాలు కూడా ఖరారు కాలేదని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు అవసరం లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఎన్నికల ప్రధానాధికారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు
కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ:
స్థానిక ఎన్నికలకు సహకరించాలని కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ హైకోర్టులో ధిక్కరణ పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడంలేదని తెలిపారు. ఎస్ఈసీ రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిస్పందన సరిగా లేదని పిటీషన్ లో తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని నిమ్మగడ్డ హైకోర్టును కోరారు.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమన్న ఏపీ ప్రభుత్వం
కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్నికలకు ఏర్పాట్లు:
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. అత్యంత ఎక్కువ జనభా కలిగిన హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకున్నట్లు నిమ్మగడ్డ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరిచారు. బీహార్ లో కొవిడ్ కారణంగా శాసన సభ ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు అంగీకరించని విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ఎన్నికల షెడ్యూల్, నిర్వహణకు ఏర్పాట్లు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
ఎస్ఈసీ విధుల్లో ప్రభుత్వ జోక్యం అనవసరం:
ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు పేర్కొన్న సంఘటనను ఎస్ఈసీ ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 14 కింద పిటీషన్ దాఖలు చేసే హక్కు లేదని ఆ ఆర్టికల్ వ్యక్తులకు వర్తిస్తుంది కాని ప్రభుత్వాలకు కాదని ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిడ్ లో స్పష్టం చేసింది.
ఇది చదవండి: స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు