• హైదరాబాద్ పాతబస్తీలో కాళిమాత భూ వివాదం
• కబ్జాకు గురవుతున్న దేవాదాయ భూములు
• విజయవాడలో సోము వీర్రాజు ధర్నా
తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ దూకుడుతో వ్యవహరిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని బీజేపీ అధికార పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. టీడీపీ హయాంలో కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను పునర్ నిర్మించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దీనికి వైసీపీ కూడా గట్టిగా బదులిస్తోంది. గత ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉందని ఆలయాలను కూల్చినపుడు మీరేం చేస్తున్నారని వైసీపీ విమర్శలు కురిపిస్తోంది. అటు తెలంగాణలో దేవాలయాల భూములు కబ్జాకు గురవుతున్నాయని బండి సంజయ్ ఆరోపిస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు.
సోము వీర్రాజు ధర్నా:
కూల్చిన ఆలయాలను పునర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రకాశం బ్యారేజి సమీపంలో శనీశ్వర ఆలయం వద్ద సోము వీర్రాజు కార్యకర్తలతో మెరుపు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాలపట్ల గౌరవం లేదని చర్చిలు, దర్గాలకు కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తూ ప్రజాధానాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. హిందూ దేవాలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల పేరిట ఆలయాలను కూల్చినపుడు గతంలో బీజేపీ లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆందోళనలు చేశారని సోము వీర్రాజు గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ప్రస్తుత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉండికూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వీర్రాజు విమర్శించారు.
వివాదంలో కాళిమాత భూములు
ఇక తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మంచి విజయాలను అందుకున్న బీజేపీ అదే పంథాను కొనసాగిస్తోంది. తెలంగాణలో దేవాదాయ భూములు అన్యాక్రాంత మవుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలోని కాళిమాత ఆలయ భూముల వివాదం స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ భూమి తనదంటూ ఓ వ్యక్తి పోలీసుల రక్షణతో ఫెన్సింగ్ వేస్తుండటంతో బీజేపీ నేతలు అడ్డుకున్నారు. నిర్మాణ పనులు చేపడుతున్నవారు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లు రువ్వుకోవడంతో బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆలయ భూములు కబ్జా చేస్తున్నారంటూ బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కబ్జాదారులకు పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. దీంతో అదనపు పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీజేపీ నేతలు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. నిర్మాణాలు చేపడుతున్న స్థలంలో దేవాదాయ భూమితో పాటు శ్మాశాన వాటిక స్థలం కూడా ఉందని పనులను వెంటనే నిలిపివేయాలని బండ్లగూడ తహసీల్దార్ ఫర్హీన్ షేక్ ఆదేశించడంతో గొడవ సద్దుమణిగింది.
బండి సంజయ్ హెచ్చరిక:
కాళీమాత భూ వివాదంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. పాతబస్తీలోని ఆలయాల భూములను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని బండి సంజయ్ అన్నారు. కాళీమాత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దేవాదాయ శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కబ్జాదారులకు కొమ్ముకాస్తోందన్న బండి సంజయ్ విమర్శించారు. దేవాదాయ భూములపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.