Sunday, December 22, 2024

ఆదర్శ దర్శకుడు `ఆదుర్తి`

తెలుగు సినిమా చరిత్రలో  ఆయనది ప్రత్యేక అధ్యాయం. సినిమా మీద ఆసక్తితో బొంబాయి చేరుకుని ఎడిటింగ్ లో ప్రావీణ్యం సంపాదించి దర్శకుడిగా ఎన్నో ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు అందించిన దర్శక చక్రవర్తి. ఆయనే ఆదుర్తి  వెంకట సత్య సుబ్బారావు అనే ఆదుర్తి సుబ్బారావు. చిత్రలోకానికి ఆదుర్తి. కొత్తదనాలు, అభిరుచులు, సాహసాలు, ప్రయోగాలు కలగలసిన మూర్తి ఆదుర్తి అని  చెప్పకుంటారు. ప్రయోగాలంటే ఇష్టం. సినిమా చిత్రీకరణను స్టూడియోలు దాటించింది ఆయనే. పాట రాయించుకోవడం, దానిని చిత్రీకరించడంలో, దృశ్యాన్ని ఊహించుకోవడంలో ఎంతో మనసు పెట్టే ఆదుర్తి `మనసు` సినిమాలకు  ఆద్యులయ్యారు.  `మూగ మనసులు`లో గోదావరి అందాలను ఆరబోసి  భావి దర్శకులకు  బాటలు వేశారు.`ఎన్నో ఆలోచించు. స్థిరంగా ఒకచోట కూర్చోకు. పరుగులుతియ్యి..కొత్త మనుషులు,మనసుల కోసం అన్వేషించు’ అనేవి వ్యక్తిత్వ లక్షణాలు. ప్రతిభా పాటవాలతో దూసుకువెళ్లారు. `ఆయన మంచి ఎడిటర్, దర్శకుడు అనడం కంటే మంచి ప్రేక్షకుడు. ప్రేక్షకులకు ఏమి కావాలో దాన్ని నటీనటుల ద్వారా అందజేయడంలో స్పెషలిస్టు…‘అంటారు  నటీమణి జమున. అటుఇటుగా రెండు దశాబ్దాల   దర్శకత్వ ప్రస్థానంలో సుమారు నాలుగున్నర  పదుల చిత్రాలు తీస్తే వాటిలో ఎన్నో  ఆణిముత్యాలు.

ఉత్తమ ఎడిటర్

వేదంలా ఘోషించే  గోదావరి తీరంలో 16 డిసెంబర్ 1922లో పుట్టిన అబ్బాయి సినిమా పట్ల ఆసక్తితో చదువును పక్కనపెట్టి బొంబాయి చిత్రసీమకు చేరారు. ఎడిటింగ్ లో తర్ఫీదు పొందారు. ప్రఖ్యాత నృత్యకళాకారుడు ఉదయ్ శంకర్ నిర్మించిన  నృత్య ప్రధాన చిత్రం `కల్పన`కు ఎడిటర్ గా పనిచేశారు. అలా ఎందరో గొప్ప దర్శకులు చిత్రాలకు ఎడిటర్ గా పనిచేస్తూ, ఎడిటింగ్ టేబుల్ మీదే దర్శకత్వంలోని మెళకువలు నేర్చుకున్నారు.దర్శకుడు అయిన తరువాత కూడా వ్యాసంగాన్ని వదలలేదు. తన సినిమాలకు పనిచేసే ఎడిటర్లకు ఆయన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడేవి. పనిభారం తగ్గించేవి. కూర్పు   సమయంలో దర్శకుడు ఎడిటర్ దగ్గర కూర్చుని తనకు కావలసిన రీతిలో చెప్పి చేయించుకోవడం సర్వసాధారణం.ఆదుర్తి ఎడిటర్ స్వత: ఎడిటర్ కనుక పని మరింత సులువయ్యేది. చిత్రనిర్మాణంలోని ప్రతి విషయం ఆయనకు కరతలామలకం.

ప్రతిభకు పట్టం                                                                       

ప్రముఖ దర్శకుడు  కె.ఎస్. ప్రకాశరావు దగ్గర ఆదుర్తి  సహాయ దర్శకుడిగా (దీక్ష-1951) పనిచేస్తున్పప్పుడు  ఆ పెద్దాయన ఆయనలోని స్పార్క్ (తళుకు) గమనించి  చిత్రీకరణ బాధ్యతను చాలా వరకు ఆయనకే వదిలేశారు.ప్రకాశరావు దర్శకత్వం వహించిన ’బాలానందం‘ చిత్రీకరణలోనూ పాలు పంచుకున్నారు. ఆదుర్తిలోని అలోచన, అవగాహన, హుషారు గమనించిన నిర్మాతలు ఎస్. భావనారాయణ, డీబీ నారాయణలు `అమర సందేశం‘తో  ఆదుర్తిని దర్శకుడిని (1954) చేశారు. తన పట్ల  తన గురువు చూపిన ఆదరణనే  శిష్యులకూ పంచారు. ప్రతిభను కనిపెట్టగల దిట్టగా పేరొందిన ఆయన, అనంతర కాలంలో `కళా తపస్వి`గా మన్ననలు అందుకుంటున్న కె.విశ్వనాథ్ కు తన`మూగమనసులు` రెండవ యూనిట్ కు దర్శకత్వ  బాధ్యతలు అప్పగించారు.సొంత చిత్రం `ఉండమ్మా బొట్టు పెడతా`కు దర్శకుడిని చేశారు.

 విజయాలు తనవి, అపజయాలు ఇతరులవి (సహాయకులవి) అనే మనస్తత్వం కాదు. విజయాలలో అందరూ భాగస్వాములే అనే భావన కలుగచేయడమే ఆయన ప్రత్యేకత. పనిలో ఏదైనా పొరబాటు జరిగితే అందుకు మొదట తననే బాధ్యులుగా చేసుకునేవారు తప్ప  సహాయకులను నిందించేవారు కాదు.  ఎవరైనా తన సహచరుల పొగుడుతుంటే ఆత్మసంతృప్తి పొందే వారట.

భగవంతుడు  భక్తి సులభుడైతే ఆదుర్తి మిత్రసులభుడు. ఎంత గొప్పవాడో అంత వినమ్రుడు.ఎంత తెలిసినవాడో అంత తెలుసుకోవాలనే తపన గలవాడు.కీర్తికాంత వరించినా/ఆర్తుల మరువనివాడు /స్ఫూర్తిని విడువని వాడు/ఆదుర్తి మా ఆదర్శమూర్తి` అన్నారు  దాశరథి.

దర్శకత్వ ప్రస్థానం

కేవలం 21 ఏళ్లలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మహాకవి క్షేత్రయ్య చిత్రం నిర్మాణంలో ఉండగా  కన్నుమూశారు. తెలుగులో 25 చిత్రాలకు గాను 13 శతదినోత్సవం, 4 రజ తోత్సవం చేసుకున్నాయి. నాలుగు చిత్రాలు రాష్ట్రపతి పురస్కారాలు, రెండు   రాష్ట్ర  ప్రభుత్వ నంది (ఒకటి స్వర్ణం)  బహుమతులు అందుకున్నాయి. హిందీ 10, తమిళంలో 9 చిత్రాలకు దర్వకత్వం వహించారు. తెలుగులో 9, హిందీలో  3 చిత్రాలు  సొంత నిర్మాణ సంస్థ తీశారు.

ప్రయోగశీలి

చిత్రాలలో పాత్రలే కనిపించాలి తప్ప నటులు, వారి ఇమేజ్ కాదన్నది  ఆదుర్తి గారి ప్రగాఢ  నమ్మకం. అప్పటికే అగ్రనటుడు అక్కినేని నాగేశ్వరరావును సావిత్ర పాత్రతో `ఏరా` అనిపించడం (మూగమనసులు), హాస్యనటుడిగా పేరున్న పద్మనాభంతో అదే చిత్రంలో మహానటి సావిత్రికి భర్తగా, అప్పట్లో వర్థమాన నటుడు శోభన్ బాబును సావిత్రికి భర్తగా నటింపచేసి, ఆయనతో సావిత్రిపై చేయిచేసుకునే  సన్నివేశాన్ని (చదువుకున్న అమ్మాయిలు) చిత్రీకరించడాన్ని సాహసంగా చెప్పు కునేవారు. `నేను చాలా గొప్ప దర్శకుడిని. నా మాట జవదాటకండి` అని ఆయన ఎన్నడూ అధికారాన్ని చెలాయించనట్లే, నటీనటులు ఆయన మనసెరిగి నటించారు. కనుకనే  ఆ చిత్రాలు`ఆపాత` మధురాలుగా మిగిలాయి.

చిత్రీకరణ సమయంలో వచ్చే మెరుపులాంటి ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టేవారు.ఆ రోజులలో ఆదుర్తిగారి సన్నివేశ, పాటల చిత్రీకరణకు  పెట్టిందిపేరు. పాటలు ఆయనాల తీయాలని చాలా మంది చెప్పుకునే వారట. అందుకే..`నేను పాట చిత్రీకరించాలనుకున్నప్పుడు ఆదుర్తిగారిని గుర్తు  గుర్తచేసు కుంటాను.ఆయనైతే ఎలా తీస్తారో ఊహించుకుని అలా చిత్రీకరించడానికి ఆలోచిస్తాను`అని రాఘవేంద్రరావు ఒక సందర్భంలో చెప్పారు.

ఆలు

అక్కినేని నాగేశ్వరావు, ఆదుర్తి సుబ్బారావు జంటకు `అ,ఆ`లు అని ముద్దు పేరు. ఈ జంట ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించింది. అక్కినేని భాగస్వామిగా ఉన్న అన్నపూర్ణ పిక్చర్స్ కు ఆదుర్తి ఆస్థాన దర్శకుడు లాంటి వారు.ఆ సంస్థ నిర్మించిన చిత్రం `డాక్టర్ చక్రవర్తి` రాష్ట్ర ప్రభుత్వ తొలి నంది  పురస్కారాన్ని అందుకుంది. కుటుంబ కథాచిత్రాలలో మేటి అనిపించుకున్నఆ నటదర్శక ద్వయం  కళాత్మక విలువలతో కూడిన చిత్రాలు నిర్మించాలన్న సంకల్పంతో `చక్రవర్తి చిత్ర` స్థాపించి  రెండు చిత్రులు  `సుడిగుండాలు, మరో ప్రపంచం` తీసింది. అవి విమర్శ కుల నుంచి మన్ననలు పొందాయి తప్ప  సొమ్ము చేసుకోలేకపోయాయి. ఏటికి ఎదురీది చేయి కాల్చుకుని అలాంటి ప్రయోగాలకు స్వస్తి పలికింది.

కొత్తవారితో…..

కొత్త వాళ్లతో  సినిమాలు తీయాలన్న  ఊహ, ప్రయోగాత్మక చిత్రాలన్న లక్ష్యాన్ని నిజం చేశారు. అనంతర కాలంలో ధర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్,పి.వెంకటేశ్వరరావు, విజయచందర్, మాడా,పుష్పకుమారి, సుకన్య,సంధ్యారాణి, మంజుల,జరీనావహాబ్, సోమూదత్,చందావర్కర్  తది తరులు ఆయన బడిలో అక్షరుల దిద్దినవారే.కొత్త నటీనటుల్లో బెరుకు పొగొట్టేం దుకు  వారిని పిక్నిక్ లకు, సముద్రతీరానికి తీసుకువెళ్లి  సరదాగా గడిపేవారు. ఆయా నటీనటులు ఇప్పటికి వాటిని గుర్తు చేసుకుంటుంటారు.`ఆడుతూ పాడుతూ పనిచేయడం, చేయించుకోవడం ఆయనకొక్కరికే సాధ్యం. దర్శకుడిగా ఆయనకుండే  ధైర్యం మరెవరిలోనూ చూడలేదు` అంటారు విశ్వనాథ్.

వర్ధమాన నటుల పట్ల, తనను నమ్ముకున్న వారి పట్ల  ఆయనకు గల ప్రేమాభిమానాలకు ఒక ఉదాహరణ చెబుతారు. కృష్ణ, రామ్మోహన్ నాయకులుగా  నలుపు తెలుపులో ప్రారంభించిన `తేనెమనసులు`చిత్రం  ఆరురీళ్లు చూసిన పంపిణీదారులు కృష్ణను తీవ్రంగా విమర్శిస్తూ, ఆయనను  తీసేయయని సలహా ఇచ్చారట. దానికి `నా పేరు, డబ్బు పోతే పోనీయండి. కృష్ణ  జీవితాన్ని  మాత్రం పాడు చేయలేను` అంటూ చిత్రాన్ని రంగుల్లో తీసి ఔననిపించారు.

 `కొత్తవారితో విజయవంతమైన చిత్రాలు నిర్మించవచ్చని రుజువు చేసి మా అందరికీ మార్గదర్శకుడైన అభిమాన దర్శకులు, గురుతుల్యులు ఆదుర్తి సుబ్బారావు… `అంటూ అప్పటి వర్థమా దర్శకుడు దాసరి నారాయణరావు తన `స్వర్గం-నరకం` చిత్రాన్ని అంకితమిచ్చారు.

జైహింద్

నినాదం ఆదుర్తికి ఇష్టమట. అది సెంటిమెంట్ కూడా అంటారు. సినిమాల ముగింపులో `మంగళం, శుభం,సమాప్తం `లాంటి వాటిని  ఇష్టపడేవారు కాదు. `జైహింద్`అనే  వేయించేవారు. అందులో దేశభక్తి కూడి ఇమిడి ఉందని భావన కావచ్చు.

తీరని కోరిక

ఎన్నో గొప్ప సినిమాలు అందించిన ఆదుర్తికి `మహాభారతం, విశాల నేత్రాలు` చిత్రాలు తీయాలన్నది ఆయనకు ఎంతో ఉండేది.`మహాభారతం` స్క్రీన్ ప్లే  `పౌరాణిక బ్రహ్మ` కమలాకర కామేశ్వరరావు గారితో రాయించి, యాక్షన్  పార్ట్ ను కేఎస్ఆర్ దాసుతో తీయించి, తాను  డ్రామాకు తాను దర్శకత్వం వహించాలన్నది ఆయన కోరిక.   అది నెరవేరకుండానే 53వ ఏట (1 అక్టోబర్ 1975) అనారోగ్యంతో `తెర`మరుగయ్యారు దర్శక చక్రవర్తి ఆదుర్తి.

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles