తెలుగు నేలను ఒక ఊపుఊపేసిన సంచలన సాంఘిక నాటకం “చింతామణి”. సాంఘిక నాటకాలలో ఇంత ప్రసిద్ధమైన నాటకం ఇంకొకటి లేనేలేదని చెప్పాలి. ఈ నాటకం పుట్టి ఇప్పటికి 100 ఏళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు వాడవాడలా మళ్ళీ ప్రదర్శనలు జరుపుకుంటోంది. 1923 నాటికే 446 సార్లు ప్రదర్శన చెంది, అప్పటికే పెద్ద రికార్డు సృష్టించింది. 1923లో కాకినాడకు చెందిన సుజన రంజనీ ప్రచురణ సంస్థ ఈ నాటకాన్ని ముద్రించింది. ఈ వందేళ్ళల్లో ప్రపంచంలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ కొన్ని వేల ప్రదర్శనలకు నోచుకొని, అనంతమైన కీర్తిని అక్కున చేర్చుకున్న అద్భుతమైన నాటకం.
మహాకవి కాళ్ళకూరి
ఆధునిక యుగంలో మహాకవి శబ్దవాచ్యులలో కాళ్ళకూరి నారాయణరావు తొలివరుసకు చెందినవారు. “మహాకవి”కాళ్ళకూరిగానే సుప్రసిద్ధులు. కేవలం నాటక రచయితయే కాదు. బహుకళాప్రపూర్ణుడు. సంఘసంస్కర్త, మొట్టమొదటి ప్రచురణ కర్త, హరికథకుడు, కవి, నటుడు, నాటకకర్త, పత్రికాధిపతి. మనోరంజని అనే పత్రికను నడిపాడు. నాటి సమాజంలో ఉన్న దురాచారాలను ఎత్తి చూపించి, నాటకాలుగా మలచి, ప్రదర్శించడమే కాక, సంఘ సంస్కరణను ఆచరణలోనూ చూపించిన మహనీయుడు కాళ్ళకూరి నారాయణరావు. ఆ కాలంలో కులాంతర వివాహం చేసుకోవడమంటే పెద్ద సాహసం. కళావంతురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనతో తనను కులం నుండి వెలివేసినా లెక్కచేయని సాహసి, కవితారూప తపస్వి, బహుప్రతిభా తేజస్వి.
దురాచారాలే నాటకరాజాలు
సంఘంలోని దురాచారాలను నాటకరాజాలుగా సృష్టించారు. చింతామణి, వరవిక్రయం, మధుసేవ మొదలైనవి అజరామరమైనవి. వీటిలో నవీన కాలంలో మిగిలిన నాటకాలు మరుగునపడి, చింతామణి ఒక్కటే మణిద్వీపమై విరాజిల్లింది. వేశ్యావృత్తి వల్ల పాడైపోయిన కుటుంబాలు, దెబ్బతిన్న సామాజిక సంస్కృతి, మృగ్యమైన మానవ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, మార్పును అభిలషిస్తూ, నేనుసైతం అంటూ కాళ్ళకూరి నాటక రచన రూపంలో ఉద్యమం ప్రారంభించారు. ఇది పద్యనాటకం. అద్భుతమైన సంభాషణలు, పరమ రసాత్మకమైన పద్యాల పుష్పగుచ్చంలా చింతామణిని దృశ్యకావ్యంగా నిర్మించిన తీరు, ఆ శైలి అన్యులకు అసాధ్యమనే చెప్పాలి.
ఆధారం ‘లీలాశుకచరిత్ర’
ఈ నాటకం సంస్కృతంలోని “లీలాశుక చరిత్ర” ఆధారంగా రచించాడు.ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, భవానీశంకరం, శ్రీహరి, చిత్ర పాత్రలు ప్రధానమైనవి. ప్రధానంగా బిల్వమంగళుడు-చింతామణి చుట్టూ ఈ నాటకం తిరుగుతుంది. చింతామణి మోజులోపడిన బిల్వమంగళుడు తండ్రిని, భార్యను నిర్లక్ష్యంచేస్తాడు. సర్వ ఐశ్వర్యములను కోల్పోతాడు. చివరకు తండ్రిని, భార్యను కూడా కోల్పోతాడు. శ్రీకృష్ణుడు చింతామణికి కలలో కనిపిస్తాడు, దానితో ఆమెలో వైరాగ్య భావం కల్గి, సన్యాసినిగా మారుతుంది. భార్య మరణం, చింతామణి వైరాగ్యంతో బిల్వమంగళుడిలో కూడా గొప్ప పరివర్తన వస్తుంది. సోమదేవ మహర్షి పిలుపుతో ఆశ్రమ స్వీకారం చేసి, లీలాశుక యోగీంద్రుడుగా మారుతాడు.
శ్రీకృష్ణకర్ణామృతం
శ్రీకృష్ణ కర్ణామృతం అనే పరమాద్భుతమైన సంస్కృత సుశ్లోకమహితమైన రచన చేస్తాడు. ఇదీ, సూక్ష్మంగా “చింతామణి”నాటక కథ. వందేళ్ల నాటి తెలుగు వ్యావహారిక భాషలో పద్యాలు, సంభాషణలతో కాళ్ళకూరి నారాయణరావు సుందర సుమధుర సాంఘిక దృశ్యకావ్యంగా (నాటకం) తీర్చిదిద్దాడు. కానీ, తదనంతరం, కొందరు ఈ నాటక సంభాషణలను అశ్లీలంగా మార్చి ప్రదర్శించడం ప్రారంభించారు. దీని వల్ల ఈ నాటకం జనంలోకి బాగా వెళ్ళింది. కానీ, వీరి వల్ల అపకీర్తి మూటగట్టుకుంది. ఒరిజినల్ గా కాళ్ళకూరి నారాయణరావు రాసిన సంభాషణలు వేరు -తర్వాత మారిపోయిన మాటలు పూర్తిగా వేరు. సంభాషణలే కాక, ప్రదర్శనలోనూ రికార్డింగ్ డాన్స్ లను మించిపోయేట్టుగా జుగుప్సాకరంగా మార్చివేశారు.
హాస్యం శ్రుతిమించి అశ్లీలం
దీని వల్ల చాలా చోట్ల ప్రదర్శనలపై నిషేధం విధించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.సుబ్బిశెట్టి, శ్రీహరి, చిత్ర పాత్రలు మరింత ఘోరంగా మారిపోయాయి. హాస్యం శృతి మించి, అంతటా అశ్లీలం ఆవహించింది.ఈ హోరులో ఉదాత్తమైన బిల్వ మంగళుడు పాత్ర కూడా కొట్టుకుపోయింది. భవానీశంకరుడు, చింతామణి పాత్రల స్థాయి దిగజారిపోయింది.కొందరు పెద్ద నటులు ఈ నాటకం వేయడానికి కూడా భయపడి దూరమై పోయారు. సభ్య సమాజం కూడా నాటకానికి సుదూరమైపోయింది. అంత గొప్ప నాటకంలో చోటుచేసుకున్న విషాదం ఇది. ఐతే, అప్పుడప్పుడూ, అక్కడక్కడా, కొందరు మాత్రం కాళ్ళకూరి నారాయణరావు రాసిన నాటకాన్ని యధాతధంగా ప్రదర్శించి, ఆ గౌరవాన్ని కాపాడుతున్నారు.
రెండు సినిమాలు
“చింతామణి”ని సినిమా గానూ నిర్మించారు. 1933లో మొట్టమొదటగా కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో, పులిపాటి వెంకటేశ్వర్లు, దాసరి రామతిలకం ప్రధాన పాత్రలుగా తెలుగులో వచ్చింది. 1956లో పి.ఎస్. రామకృష్ణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రలుగా భరణి స్టూడియోస్ బ్యానర్ పై సినిమాగా నిర్మించారు. స్టేజ్ నాటకం విజయవంతమైనంతగా, సినిమాలు హిట్ అవ్వలేదు.బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి మహానటుల వల్ల స్టేజ్ నాటక ప్రదర్శనలు ఈ నాటకాన్ని ఒక ఊపు ఊపేశాయు. చింతామణి పాత్రలో హొయలు, ఒయ్యారాలతో బుర్రావారు నటిస్తూ ఉంటే చూసి తీరాల్సిందే.
కొప్పరపు కవుల ప్రశంస
ఈ మహారచన చేసిన ‘మహాకవి’ కాళ్ళకూరి నారాయణరావు 28 ఏప్రిల్ 1871 నాడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం దగ్గర మత్స్యపురిలో జన్మించారు. 1927,జూన్ 27న మరణించారు. ఎక్కువగా కాకినాడలో ఉన్నారు. వీరు రాసిన చిత్రాభ్యుదయం, పద్మవ్యూహం కూడా గొప్ప రచనలు.” ఏది? యేదీ? మరియొక్క మారనకపోరే పద్యమున్ విన్న, యే పదమున్ విన్న! ” అంటూ మహాకవులైన కొప్పరపు కవులు కూడా కాళ్ళకూరి నాటక శిల్పాన్ని బహుధా శ్లాఘించారు. సామాన్యులు సైతం ఒన్స్ మోర్ అంటూ… పద్యాలను, సంభాషణలను అడిగిమరీ చెప్పించుకున్నారు. నవ్యనాటకమణి “చింతామణి” ఎప్పటికీ చిరంజీవిగా నిలుస్తుంది.