• పాత సాఫ్ట్ వేర్ ద్వారానే ప్రారంభం
• రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి
• తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎట్టకేలకు హైకోర్టు అనుమతి లభించింది. కంప్యూటర్ ఆధారిత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పలు సూచనలు చేసింది. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఎటువంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:“ధరణి” పోర్టల్ ధనాధన్
రిజిస్ట్రేషన్ నిమిత్తం ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకునే విధానానికి అనుమతినిచ్చింది. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు న్యాయస్థానం సమ్మతిని తెలిపింది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్, కులం, కుటుంబసభ్యుల వివరాలు సేకరించమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదుపై హైకోర్టు సుధీర్ఘ విచారణ చేపట్టింది. ధరణి పోర్టల్ పై 5 అనుబంధ పిటీషన్లను పిటీషనర్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలుకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గడువును కోరారు. ధరణిపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 16 కు వాయిదావేసింది.