- మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం జగన్
- 2లక్షల 49వేల యూనిట్ల పంపిణీ
- 1,869 కోట్ల రూపాల వ్యయం
- హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
మహిళా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న జగన్ సర్కార్ మరో అడుగు ముందు కేసింది. గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని మహిళలు తక్కువ పెట్టుబడితో ఆర్థిక సమృద్ధి సాధించేందుకు “జగనన్న జీవక్రాంతి” పథకాన్ని గురువారం సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు సీఎం తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల పంపిణీ
తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని సీఎం ప్రారంభించారు. పథకం కింద 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేస్తారు. 2లక్షల 49 వేల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు దాదాపు 1,869 కోట్లను ఖర్చు చేయనున్నారు. మూడు దశల్లో అమలు చేయనున్న పథకంలో మొదటి దశలో 2021 మార్చివరకు 20 వేల యూనిట్లు, రెండవ దశలో 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, తుది దశలో 2021 సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 99000 యూనిట్లను పంపిణీ చేయనున్నారు.
మహిళలకు ఆర్థిక భరోసా
అధికారం చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ సర్కార్ వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాథాన్యత నిస్తున్నారు. జగనన్న జీవక్రాంతి పథకాన్ని అమూల్ తో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాడి రైతులకు మహిళలకు ఆర్థికంగా చేయూత నిస్తుందని సీఎం అన్నారు. పశువుల సంరక్షణ బాధ్యత రైతు భరోసా కేంద్రాల పరిథిలో ఉంటుందని అన్నారు. పాడి పశువులకు వైఎస్సార్ సన్న జీవుల నష్ట పరిహారం పథకంతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు పశు కిసాన్ క్రెడెట్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పశువుల పెంపకంపై అవగాహన కల్పించేందుకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు
అనంతరపురంలో గొర్రెలు, మేకల పంపిణీ
జగనన్న జీవ క్రాంతి పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలోని నాయన పల్లి గ్రామం లో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ లబ్ధిదారులకు గొర్రెలు మేకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగనమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు.
పశుపోషణతో ఆర్థిక స్వావలంబన
వ్యవసాయంతో బాటు అనుబంధ రంగాలైన పశుపోషణ చేపట్టగలిగితే కరవు కాటకాలు వచ్చినా రైతు కుటుంబాలు ఆర్థికంగా ధీమాగా ఉంటాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. పాడి రైతులు, పశువుల పెంపకం దారులకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండదండలు అందిస్తుందని సీఎం తెలిపారు.
ఇదీ చదవండి:ఏపీలో 21న ‘శాశ్వత భూ హక్కు`పథకం
ఇదీ చదవండి:పాల వెల్లువ ద్వారా మహిళా సాధికారత దిశగా జగన్ సర్కార్