- అధ్యక్ష ఎంపికపై మాణికం ఠాగూర్ ముమ్మర కసరత్తు
- రేసులో పెరుగుతున్న పోటీ
- అధిష్ఠానంతో సత్సంబంధాలు నెరపుతున్న నేతలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇపుడా పదవిని ఆశిస్తున్న ఆశావహుల జాబితా భారీగానే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి ద్వారా నేర్చుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎంపికా? ఎన్నికా?
గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరి పేరును సూచిస్తే ఆవ్యక్తిని ఏఐసీసీ ప్రతినిధి అధ్యక్షుడిగా ప్రకటించేవారు. పార్టీ నేతలు అధిష్ఠానం ఆదేశాలను శిరసావహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇపుడు గతానికి కాస్త భిన్నంగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. మాణికం ఠాగూర్ మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో అధ్యక్ష అభ్యర్థి ఎవరనే అంశంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. విచిత్రం ఏమిటంటే ప్రతి నాయకుడు ఒకరిద్దరు నాయకులకు మద్దతు తెలపాల్సింది పోయి ఎవరికి వారే అధ్యక్ష పదవికి తానే సరైన అభ్యర్థినని తన పేరునే అధ్యక్ష పదవికి సూచిస్తున్నారు.
ఏకాభిప్రాయం కత్తి మీద సాము
గత ఆరేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటములను చవిచూస్తున్న పార్టీకి అధ్యక్ష ఎన్నికకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఏకాభిప్రాయ సాధనలో భాగంగా మాణికం ఠాగూర్ పలువురు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీనేతలు మాత్రం తమ తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నపుడు ఆ పదవిని నేనేందుకు ఆశించకూడదు అంటూ ఓ సీనియర్ నేత మాణికం ఠాగూర్ ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేను మంచి వక్తనని రెండు మూడు జిల్లాలలో తనకు పలుకుబడి ఉందని చెప్పడమే కాకుండా అధిష్ఠానంతో తనకు సత్సంబంధాలు మెండుగా ఉన్నాయని కాబట్టే అధ్యక్ష పదవిని తాను కూడా ఆశిస్తున్నానని చెప్పినట్లు సమాచారం.
అధ్యక్ష రేసులో పెరుగుతున్న పోటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలంటే అధిష్ఠానం అశీస్సులు తప్పనిసరిగా ఉండాలి. అధ్యక్షుడి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డితో పాటు మధిరకు చెందిన భట్టి విక్రమార్క, మంథనికి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. శ్రీధర్ బాబు తండ్రి దివంగత డి శ్రీపాదరావు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. తండ్రి కాలం నుండి అధిష్టానంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కులాల వారీగా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని అధ్యక్షుడిగా చేస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ సామాజిక వర్గ నేతలను పార్టీలోనే కొనసాగేలా ఒప్పించవచ్చు. అధిష్ఠానంతో సత్సంబంధాలు నెరుపుతున్న మధుయాస్కీ, జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్ లు అధ్యక్ష పదవి తమ పేర్లు ప్రతిపాదించనప్పటికీ అధిష్ఠానం ఆ పదవిని కట్టబెడితే తీసుకునేందుకు వీరంతా ముందు వరుసలో ఉంటారు. జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి కష్ట సమయాలలో పార్టీని ఆదుకోవడానికి ఎపుడూ ముందుంటారు. అందుకు కావాల్సిన ఆర్థిక వనరులు కూడా ఆయనకు ఉన్నట్లు సమాచారం. మాజీ డిప్యుటీ సీఎం దామోదర రాజనర్శింహ కూడా అధిష్ఠానం పిలిచి పదవినిస్తే పార్టీని నడపడానికి సంకోచించకుండా ముందుకు వస్తారు.
అధ్యక్ష అభ్యర్థికి నిబద్ధత అవసరం
కాంగ్రెస్ లో ఇప్పటికీ నాయకుల కొరత లేదు. కాకపోతే బీజేపీ నేతలలో ఉన్న నిబద్ధత మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలలో కనిపించదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న బీజేపీని, తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ ని ధీటుగా ఎదుర్కొని తెలంగాణలో పార్టీకి జవసత్వాలు నింపాలంటే కొత్త అధ్యక్ష అభ్యర్థికి నిస్వార్థం, నిబద్ధత మెండుగా గల నేత ఖచ్చితంగా అవసరం.
రేవంత్ కింకర్తవ్యం?
రాహుల్ తో మెరుగైన సత్సంబంధాలు కలిగిన రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి ఊపిరులూది నేతలందరిని కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకపోతే ఆయన తన రాజకీయ భవితవ్యం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. అసలే వరుస అపజయాలతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ మరో సవాలు కానుంది.
ఇదీ చదవండి: తెలంగాణ పీసీసీపై తర్జనభర్జన