- దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు
- ఈ నెల 12న టోల్ ప్లాజాల వద్ద ఆందోళన
- 14న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- అమిత్ షాతో నరేంద్ర సింగ్ తోమర్ భేటి
- రాష్ట్రపతిని కలిసిన విపక్ష పార్టీల సభ్యులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల సవరణలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాన్ని ఆపేదిలేదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే సవరణలతో రైతులకు ఒరిగేదేమీ లేదని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనలు ఉధృతం చేస్తామన్న రైతులు
తమ న్యాయబద్ధమైన ఆందోళనలకు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. దేశం లోని అన్ని జిల్లా, మండల కేంద్రాలతోపాటు, రాష్ట్రాల రాజధానులలో నిరంతరాయంగా ఆందోళనలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 12 వతేదీన దేశంలోని అన్ని టోల్ ప్లాజాలవద్ద ఆందోళనలకు దిగనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఆందోళనల్లో భాగంగా ప్రజా ప్రతినిధుల ఇళ్లను సైతం ముట్టడిస్తామన్నారు. డిసెంబరు 14న దేశవ్యాప్త ఆందోళనలకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
అమిత్ షాతో తోమర్ చర్చలు
అయితే వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదించిన సవరణలను రైతుసంఘాలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అమిత్ షా నివాసానికి చేరుకున్నారు.
రాష్ట్రపతి భవన్ చేరుకున్న విపక్ష సభ్యులు
మరోవైపు విపక్ష పార్టీలకు చెందిన నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేత సీతారం ఏచూరి, సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా, డీఎంకే నేత టీకేఎస్ ఎలన్ గోవన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లో రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. 14 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
Also Read:రైతు సంఘాలకు చట్ట సవరణలపై ప్రతిపాదనలు పంపిన కేంద్రం