- రైతు సంఘాలతో అమిత్ షా చర్చలు విఫలం
- ఆందోళన కొనసాగిస్తున్న అన్నదాతలు
- చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతులు
ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 14 వ రోజుకు చేరుకున్నాయి కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లోని సింఘు, టక్రీ రహదారులపై వేలాదిమంది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. . చలిని సైతం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో రైతులు పట్టిన పట్టు వీడటంలేదు. రహదారులపైనే వంటా వార్పు చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు.
విఫలమైన చర్చలు
మరోవైపు వ్యవసాయ చట్టాలపై కేంద్ర హోమంత్రి అమిత్ షా రైతు సంఘాల నేతలతో నిన్న జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు పట్టుబడటంతో అందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. కేవలం కొన్ని సవరణలకు మాత్రమే అమిత్ షా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై త్వరలో తాడో పేడో తేల్చుకోవాలని రైతు సంఘాల నేతలు కూడా పట్టుదలతో ఉన్నారు.
Also Read: ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్
ప్రతిపాదనలను పంపిన కేంద్రం
అయితే సవరణలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు పంపింది. దీనిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపి నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలకు అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. సవరణల జాబితాపై సింఘు సరిహద్దుల్లో దాదాపు 40 రైతు సంఘాల నేతలు సమావేశమై చర్చించనున్నారు. అనంతరం తదుపరి కార్యాచరణను రైతులు ప్రకటించనున్నారు.
రాష్ట్రపతితో భేటీ కానున్న ప్రతిపక్షాలు
మరోవైపు మోడీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రైతులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు, ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం నేత ఏచూరి సీతారాం, సీపీఐ నాయకుడు రాజా, డీఎంకే నేత ఎలన్ గోవన్ రాష్ట్రపతితో భేటీ కానున్నారు. రైతుల సమస్యలను చర్చించి వారికి పరిష్కారం చూపాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నారు.
Also Read:రైతు వ్యతిరేక బిల్లే కాదు, ప్రజా వ్యతిరేక బిల్లు అని ఎందుకు అనకూడదు?