కోటి రతనాల వీణ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా గోదావరి తీరం శ్రీలక్ష్మీనర సింహ దివ్య పుణ్యక్షేత్రం. ధర్మపురిలో వేద పురాణ జ్యోతిష, సంగీత, సాహిత్య కళా రంగాలకు చెందిన పండితులు, విద్వాంసులు, ఆధ్యాత్మిక వేత్తలు జన్మించి ఆఖండ కీర్తి ప్రతిష్టలు గడించారు. జీవితాంతం భాగవత చింతనతోనే గడుపుతూ 5 దశాబ్దాలుగా పలు వేదికలపై అద్భుత ప్రవచనాలు చేసిన మహానుభావుడు, కర్మ యోగి గుండి రాజన్న శాస్త్రి. ఆబాల గోపాలాన్ని పరవశింపజేసే శాస్త్రి ప్రవచనాలకు దేశవిదేశీయులు సైతం అభిమానులయ్యారు. అపరశుక, వాల్మీకి, వ్యాసునిగా ప్రసిద్ధిగాంచిన ఆయన పాలరాతి విగ్రహాన్ని ధర్మపురిలో నెలకొల్పారంటే శాస్త్రి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
జీవిత విశేషాలు
గుండి లక్ష్మీనరసింహ ఘనాపాటీ, లక్ష్మీ నర్సమ్మ దంపతులకు 9 డిసెంబర్ 1898లో జన్మించిన శాస్త్రి గుండి పాపయ్యశర్మకు దత్త పుత్రుడయ్యాడు. ఉర్దూ మాద్యమంలో ప్రాథమిక విద్య, సంస్కృతాంధ్ర భాషల్లో పాండిత్యం వొఝల హన్మంతయ్య సిద్ధాంతి వద్ద లీలావతి గణితం, లౌకిక విద్యలు, తండ్రి వద్ద వేదాధ్యయనం మంథెన గట్టు కృష్ణమూర్తి వద్ద వేదాంగాలు, ఉపనిషత్తులు, ప్రస్తాన త్రయం, శాస్త్రాధ్యయనం, ఇతిహాస పురాణాదులలో శిక్షణ పొందారు. భార్య పేరు గుండమ్మ, ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె కలిగారు. భాగవత, శ్రీవైష్ణవ సంప్రదాయాని అనుగుణంగా ముకుందుడు, రఘురాముడు, అచ్యుతుడు, గోవిందుడు, హరిప్రియ అని నామకరణాలు చేశారు. మూర్తీభవించిన భాగవతంగా పేరొందిన నవయో గీంద్ర భిక్షుగీత, ఉద్దవ బోధనలు, రుక్మిణీ కల్యాణం గోపికాగీతాలు, కుంతి, భీష్మ, ధృవ, ప్రహ్లాద, గజేంద్ర బ్రహ్మాస్తవరములు, ఇతిహాసాలు, మృదుమధురంగా ప్రవచించేవారు. ఇప్పటికీ ఆయనను అందరూ అవతార పురుషుడుగా, దైవాంశ సంభూతుడుగా, వ్యాసుడే భువిపైకి రాజన్న పేరుతో వచ్చాడని భావిస్తారు. ఆయన కులమతాలకతీతంగా కలిసిపోవడం, ధర్మపురిలో వారసంత నిర్వహణకు ప్రేరణ, బాలబాలికలను చేరదీసి సంస్కృతం మాట్లాడించడం, వితంతువులకు విద్య అవసరమని భావించి వారిని చదివించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
దొరలను దాతలుగా మార్చిన ఘనుడు
భూస్వాములు, దొరలు వస్తే వారిని తన ప్రవచనాలతో దాతలుగా మార్చేవారు. భాగవతంలో 18వేల శ్లోకాలు కంఠతా చదువుతూ అర్థతాత్పర్యాదులను వివరించ గలిగే అసాధారణ ధారణ శక్తి కలవారు. శాస్త్రి పాలరాతి విగ్ర హాన్ని గోదావరి నది వద్ద శ్రీరామ ఆలయ సమీపంలో తాడూరి బాలకృష్ణ మహోపాధ్యాయుడు తన సొంత స్థలంలో ఆవిష్క రింప జేశారు. గుంటూరు వాసులు సంగా వెంకటనారాయ శర్మ ఆదిలక్ష్మీ దంపతులు, పెద్దపల్లి, కరీంనగర్ లో జరిగిన ప్రవచనాల్లో శాస్త్రి ప్రవచనాలను 2005లో శాస్త్రి కుమారుడు రామచంద్రుడు టేపులను సీడీలు, క్యాసెట్లుగా రూపొందించారు. ఇందులో ఉప్పుల రాధాకృష్ణ కృషి చాలా ఉంది. పలుమార్లు కాశీలో కూడా ప్రవచనం చేసిన శాస్త్రిచే కరీంనగర్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మంగళంపల్లి మురహరిశర్మ భాగవత సప్తాహం చేయించారు. శాస్త్రి ప్రవచనాలను 50 మంది లబ్ద ప్రతిష్టులు, శాస్త్రి బంధువులు రాసిన అభిప్రా యాలు, వ్యాసాలతో మనుమడు విష్ణుప్రసాద్ సతీమణి డాక్టర్ వారిజా రాణి సంపాదకురాలిగా, మరో మనుమడు గుండి విష్ణుప్రసాద్ ప్రేరణతో ఎం. శేషాచలం అండ్ కంపని “ఎమెస్కో” ఓ పుస్తకం ప్రచురించింది. ఇంకా ఎందరిదో కృషి ఫలితంగా ఈ మహానీయుని చరిత్ర వెలుగు చూసింది. 30 మే 1975లో 82వ యేట శాస్త్రి బ్రహ్మలీనులైనారు.
శాస్త్రి ప్రతిభకు నిదర్శనాలు
1968లో ఒక జర్మనీ యువతి శాస్త్రిని సత్కరించి ప్రవచనాలను ఇంగ్లీషులో తర్జుమా చేయించుకొని సంస్కృతం నేర్చుకొంది. ఇంగ్లాండ్ ఎంపీ హ్యూస్ బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి ప్రవచానాన్ని విని భారత దేశ ధార్మిక ప్రవృత్తి గొప్పదని కొనియాడారు. ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాలకు శంకుస్థాపన చేయగా వేలాది ఉభయ భాషా పండితులకు కల్పతరువై విరాజిల్లుతోంది. ప్రాక్పశ్చిమ ఉత్తర దక్షిణ యాత్రలను సంపూర్ణంగా కాలినడకన పూర్తి చేశారు. జిల్లాకు ఒకప్పటి ముస్లిం కలెక్టర్‌కు ఉర్దూ పారశీక భాషల్లో భాగవత శ్లోకాలు అర్థతాత్పర్యాదులతో వివరించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, దివంగత మాజీ ముఖ్యమంత్రులు బూర్గుల రామృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, దామోదరం సంజీవయ్య, కెవీ కేశవులు, కవిసామ్రాట్ విశ్వనాథ, జువ్వాడి గౌతంరావు, జువాడి చొక్కారావు, తెన్నేటి విశ్వనాథం, కాసుగంటి నారాయణరావు, దివాకర్ల వెంకటావధాని, జువ్వాడి రత్నాకర్ రావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, వానమమాలై వరదాచార్యులు, మల్లాది, మార్కండేయశాస్త్రి, వేమూరి లక్ష్మీ నరహరి శాస్త్ర, వంటివారు ఆయన పురాణానికి శ్రోతలుగా పలు సందర్భాలలో శాస్త్రి స్వగృహానికి ఎతెంచి పురాణ శ్రవణం చేసి, పలు సందేహాలు నివృత్తి చేసుకున్నా రంటే గొప్పతనం కాక మరేమిటి.
పెద్ద జీయర్ స్వామి అభినందన
కరపాత్ర స్వామీజీ, శృంగేరీ, కంచి, కామకోటీ, పుష్పగిరి పీఠాధిపుతులు, మధ్వ పీఠాధిపతులు, తలపాక మహారాజు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామి వంటి వారు ధర్మపురిని సందర్శించినపుడు శాస్త్రి ప్రవచనాలు విని అభినందించి సన్మానించారు.
మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు ఇల్లు కట్టిస్తానన్నా, కాసుగంటి నారాయణరావు కొండగట్టు పై 200 ఎకరాల భూమిని రాసిస్తానన్నా, మానకొండూర్ సర్పంచ్ సదాశివరావు తన భూమినంతా దానం చేస్తానన్నా, ఎందరో నాయకులు రాష్ట్రపతి పురస్కారమిప్పిస్తామన్నా సున్నితంగా తిరస్కరించిన ఉదాత్తుడు రాజన్న శాస్త్రి.
(డిసెంబర్ 9 పరమ భాగవత తోత్తముని జయంతి)