Tuesday, December 3, 2024

మూలాలను వెతుకుతున్న – ‘జగనిజం’

కాలాతీతమైన వాటిని తొలగించడం వొక బృహత్ ప్రక్రియ. నిజానికి అదొక ‘ఫిజిక్స్’ అయితే సామాజికాంశానికి భౌతికశాస్త్ర అన్వయం తేలిక కావడం కోసం, మనకు బాగా తెలిసిన కుటుంబ వ్యవస్థను ప్రాతిపదికగా చేసుకుని దాన్ని చూద్దాం. వొకప్పటి మన హిందూ అవిభక్త కుటుంబంలో తరం మారిన ప్రతిసారీ కాలాతీతమైన (అవుట్ డేటెడ్) వాటి స్థానంలో కొత్త మార్పులు జరిగేవి. తర్వాత కాలక్రమంలో అవి ఆమోదం పొందేవి. అటువంటి మార్పు జరగడానికి ముందు గతంలో పెద్దగా వున్నవి చిన్నవి అయ్యేవి. వొక వస్తువు ఏదైనా చిన్నది అయిన ప్రతిసారీ వాటికి మౌలిక మార్పులు జరిగేవి. ఇలా పెద్దవి చిన్నవి చేయడం కోసం దాన్ని ‘వెర్టికల్’ లేదా ‘హారిజాంటల్’ ఎలా విభజించినా లేదా కోసినా మొదట జరిగేది ఏమిటి? అప్పటివరకు మనకు కనిపించని కొత్త పార్శ్వాలు మొదటిసారి వెలుగు చూడడం లేదా బయటకు రావడం. అటువంటి కొత్త పరిస్థితుల్ని‘అడ్రెస్’ చేయవలసిన పని (బాధ్యత) కుటుంబ పెద్దది అవుతుంది. పాలనలో వొక రాజ్యం కలిసినా లేదా విడిపోయినా పౌరపాలనలో కూడా ఇదే ప్రతిబింబం కనిపిస్తుంది.

మౌలిక అంశాలు తెరమరుగు అవుతున్నాయి

రాజ్యము లేదా ప్రభుత్వాలకు దీన్ని అన్వయించి చూస్తున్నప్పుడు, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక, అక్కడ అధికారంలో వున్న రాజకీయ పక్షాల ప్రభుత్వాలు చేస్తున్నవి మోతాదు మించి మరీ ప్రజలకు చేరుతూనే ఉంది. అందుకు కొరత ఏమీ లేదు. కానీ ఎక్కువసార్లు అస్సలు విషయానికి అదనంగా జతచేస్తున్న దినుసుల వాసన సమస్య ఎక్కువ అవుతున్నది. దాంతో పౌరసమాజం దృష్టి పడి సమగ్రమైన చర్చ కావలసిన మౌలిక అంశాలు ‘ఫోకస్’ కాకుండా తెరమరుగు అవుతున్నాయి. వారి అవగాహన స్థాయిని ‘మిడియోకర్’ దశ దాటి ఎదగనీయకూడదు అని ఆశించే వారి ఉద్దేశ్యాలు అలా నిక్షేపంగా నెరవేరుతున్నాయి. అయితే, అస్సలు అలా ఆశించేది ఎవరు? అందులో వారి ప్రయోజనాలు ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు చాలా పెద్దది కనుక, ఇప్పటికి దాన్ని అటువుంచుదాం. అధిపత్యవర్గాలు అమలుచేసే ఇటువంటి నిశబ్ద వ్యూహాలు వల్ల, దృష్టి అంతా ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాల మంచిచెడు పరిధిని దాటి లోతుల్లోకి వెళ్ళవు. అలా అవి ‘ఫ్రంట్ రూమ్’ ను దాటి లోపలి గదుల్లోకి పరీక్షగా చూడడానికి వీలుకాని,  నిర్మాణంతో మందపాటి తెరలను మన కళ్ళముందు కడుతున్నాయి. 

ఏడాదిన్నర కాలంలో ఏమి జరిగింది?

ఇటువంటి పరిస్థితిల్లో బాలారిష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో గడచిన ఏడాదిన్నర కాలంలో జరుగుతున్నది ఏమిటి? అనేది ఈ వ్యాసం పరిధి. తొలి నుంచి ఈ తరహా అంశాల్ని బేరీజు లేదా మదింపు చేస్తున్నది ఎవరు అనేది ముందుగా చూద్దాం. మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ అటువంటి తూకం మేస్త్రీ పని చేస్తున్నది ‘హైదరాబాద్ ప్రెసిడెన్సీ’! ఇప్పటికీ  కొన్నికొన్ని సార్లు ఆ పని ‘డిల్లీ ప్రెసిడెన్సీ’ కూడా చేస్తూనే వుంది. వొకప్పుడు అది అక్కణ్ణించి దక్షణాది రాష్ట్రాల వైపు చూస్తూ, మనల్ని తూకం వేసేది. అప్పట్లో తెలుగు వారి ఉనికిని కూడా గుర్తించకుండా అది మనల్ని ‘మద్రాసీ’ అనేది. అయితే ఇప్పటికీ ఇక్కడ సమస్య ఏమంటే, పైన చెప్పిన రెండు “ప్రెసిడెన్సీ” ల్లో కూడా ఇంకా పాత షరాబులే ఈ ‘తూనికలు-కొలతలు’ పీఠాదిపతులుగా కొనసాగుతున్నారు. అనుమానం లేదు వీరి సుదీర్ఘ అనుభవం ఎంతైనా విలువైనదే, అయితే కాలక్రమంలో పౌరపాలనలో చోటుచేసుకుంటున్న మౌలిక ‘షిఫ్ట్’ను గమనంలోకి తీసుకోలేకపోతున్న వీరి వైపల్యం, వీరి మదింపులో తేలిగ్గా తెలిసిపోతున్నది.

పౌరపాలనలో రాజ్యం దాటుతున్న పలు దశలు వీరి దృష్టికి రాకపోవడానికి, వాళ్ళ కాళ్ళకు చిక్కులుగా అడ్డుపడే రాజకీయ కారణాలు వారికి ఉండి ఉండవచ్చు. కానీ ఆర్ధిక సంస్కరణల తర్వాత, ఇంతకాలం వొక సామాజిక దూరంలో ఉంచగలిగిన ఉప శ్రేణులకు (సబ్ ఆల్ట్రన్) వీరిని అతి దగ్గరగా చూస్తూ వీరి కదలికలు గమనించి మరీ అర్ధం చేసుకునేటంతగా, సమాచార దూరాలు తగ్గాయనే సోయ వీరికి లేకపోయింది. దాంతో జనం కళ్ళ ముందు వీరు ఎంత మందపాటి తెరలు కట్టినప్పటికీ, అతఃపుర రాజకీయ అంతరంగిక కధల్ని సైతం తమ బుద్ది కుశలతతో వీరు చూడగలుగుతున్నారు. ఏ.పి. లో అధికారంలోకి వచ్చిన తర్వాత, జనంకోసం జగన్ తెచ్చిన పధకాలు స్కీములు సంగతి సరే, వీటి అమలు మధ్య ఈ ప్రభుత్వం పలు విరామాల్లో కదుపుతున్న తీగలు ఎటువంటివి, దాంతో ఏ డొంకలు కదులుతున్నాయో అందరికీ ఇప్పుడు స్పష్టంగా అర్ధమవుతున్నది. ఈ తీగల కదలికలతో పలు కేసుల్లో పెరుగుతున్న క్షతగాత్రులు, మరో మార్గం లేక క్రియాశీల రాజకీయరంగం మీద నుంచి జరుగుతున్న వారి నిశబ్దనిష్క్రమణ, స్వీయ శ్రేణులు నుంచి సైతం నైతిక మద్దత్తు లేని వారి నిస్సహాయత, ఇటువంటివి ఎన్నో ఇప్పుడు అన్ని శ్రేణులకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాజకీయాలను తూకాలు వేసే షరాబులు

విషయం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు, ప్రజల్లోకి అవి పంపుతున్న సంకేతాలు ఎటువంటివో, వాటి ప్రభావం ఎలా వుంటుందో, పోనీ రాజకీయ పక్షాలకు అర్ధం కాకపోవడాన్ని మనం నమ్మవచ్చు. కానీ చిత్రం ఏమంటే ‘విశ్లేషకులు’ పేరుతో మీడియా ముందుకు వచ్చి, ‘పాపులర్’ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తూ రాజకీయాల్ని తూకాలు వేసే షరాబులకు కూడా అది తెలియడం లేదు! గతంలో ఇలాగే ఆంధ్రప్రదేశ్ ‘మూడు రాజధానులు’ గురించి ఉత్తరాదిన నోరుజారి భంగపడ్డ శేఖర్ గుప్త ఉదంతాన్ని మించిన మరో రుజువు ఇందుకు అక్కరలేదు. వొకప్పుడు కామన్వెల్త్ దేశాల్లో బ్రిటిష్ పాలకుల తొలి ప్రాదాన్యత అయిన విద్య – వైద్యం, తన తొలి ప్రాధాన్యత అంటున్నప్పుడు, విమర్శకులు ముందుగా జగన్ కు కొంత సమయంఇస్తూ నిజానికి కొంత సంయమనం పాటించవచ్చు.

బయటికి కనిపించని ప్రోగ్రామింగ్

అయినా, ఆర్ధిక సంస్కరణల తొలి దశకం నాటికే ‘ఎల్.పి.జి.’ లో వొకటి అయిన ‘ప్రైవేటైజేషన్’ ప్రభుత్వ యంత్రాంగాలలో పాలునీళ్లుగా కలిసిపోయిన వైనాన్ని యావత్ దేశం ‘2 జి-స్పెక్ట్రం’ ఉదంతంలో బహిరంగంగానే చూసింది. చూసింది కూడా ఇప్పుడు మన సౌకర్యార్ధం దాన్ని మర్చిపోయినట్లు నటిస్తే, కొన్నికొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ మనకు జవాబులు దొరకవు. అప్పట్లో ప్రభుత్వ సర్వీసుల్లో కీలక స్థానాల్లో పనిచేసిన కొందరు అతిగోప్యమైన (స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్) పరిజ్ఞానంతో రిటైరై బయటకు వచ్చాక, ‘స్పెక్ట్రం’ కంపెనీలకు కోసం వారు దాన్ని ‘ప్రైవేటైజ్’ చేసారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది, మునుపటి దానికి ‘అడ్వాన్స్డ్ వెర్షన్.’ ఈ పద్దతిలో లోపల ఉంటూనే ‘బయట’ వారి కోసం పనిచేయడం వుంటుంది. అందుకు ముందుగా లోపలి ‘సిస్టం కరప్ట్’ కావాలి కనుక, అందుకోసం ‘జెనిటికల్లీ మోడిఫైడ్’ విత్తనాల్ని ముందుగా ఎంపిక చేసిన కార్య క్షేత్రాల్లోకి ‘టెర్మినేటర్ సీడ్’ గా పంపుతారు. ఆ తర్వాత, ఎవరికి అప్పగించిన పనిని వారు నిశబ్దంగా చేసుకుంటూ వుంటారు. పరస్పర ప్రాయోజిత రీతిలో వొక వ్యూహంతో… ఆర్ధిక సంస్కరణల కాలంలోనే పూర్తి అయిన – ‘ప్రోగ్రామింగ్’ ఇది!   

సమాంతర పాలనకు రోడ్ మ్యాప్

అయితే, ఇవేవీ రాజ్యం వద్ద వుండే బీరువాల్లోని అధికారిక నిబంధనల గ్రంధాలలో ‘నలుపు-తెలుపు’ల్లో రాసి వుండవు. ఇది సమాంతర పరిపాలనకు – ‘రోడ్ మ్యాప్’. వ్యాసం ఆరంభంలో పెద్దవాటిని చిన్నవిగా (కో) చేసినప్పుడు, ఇన్నాళ్లుగా మనం చూడనివి కొత్తవి  పొరలు (లేయర్స్) గా బయటపడతాయి అన్నది వీటి గురించే. ఇన్నాళ్ళూ మన మధ్యే ‘అండర్ కరెంట్’ గా ఉన్నవాటిని మొదటిసారి చూసి, మనమూ విస్మయానికి గురి అవుతాం! నిజానికి పై పేరాలో ప్రస్తావించిన సాంకేతిక పదాలు మన వద్ద వాడకంలోకి వచ్చిన 10-15 ఏళ్ళల్లోనే, పౌరపాలనలో ప్రతీకలుగా వాటి అన్వయ అవసరం వస్తుంది అని మన ఊహకు తట్టలేదు! ఇటువంటి సంక్లిష్ట పరిస్థితిని రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ళ తర్వాత, సరిచేయాలి అనుకున్న ఏ ప్రభుత్వం అయినా ఆ పనిని ఎక్కడ మొదలు పెట్టాలి?

అతడు మూలాల్లోకి వెడుతున్నాడు

కొందరు అంటున్నారు, ఇప్పటి వరకు జరిగింది లేదా చేసింది కొనసాగించడానికి వీరికి అభ్యంతరం ఏమిటి? అని. ఎవరి అవగాహన స్థాయి మేరకు వారు దాన్ని అర్ధం చేసుకుంటున్నారు, అదే వారు దాన్ని పైకి చెబుతున్నారు కూడా. నిజమే, అదొక పద్దతి. అయితే, వెన్నంటిన నీడలా మారిన ప్రజా నిఘాను విస్మరించి, పాత చెప్పుల్లో కాళ్ళు పెట్టి కొత్త ప్రభుత్వం దాన్ని కొనసాగించడమా? లేక గతాన్ని నేను సరిచేస్తాను, అని తనను నమ్మిన వారి కోసం తన మార్గాన్ని తాను ఎంచుకోవడమా? జగన్మోహన రెడ్డి రెండవది కనుక ఎంచుకుంటే, మరి అతడు దాన్ని మొదలు పెట్టవలసింది ఎక్కడ? బోరు బావిలో జారిపడ్డ బిడ్డను సజీవంగా బయటకు తీయడానికి, సమాంతరంగా మళ్ళీ మనమూ అంత లోతుల్లోకి వెళ్ళడం తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నది అదే. అతడు మూలాల్లోకి వెళుతున్నాడు.

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles